Honda Elevate: హోండా ఎలివేట్‌లో కొత్త ఎడిషన్ - భారీ తగ్గింపు, పరిమితకాల ఆఫర్
Honda Elevate Apex Summer Edition: హోండా SUV ఎలివేట్‌కు కొనసాగింపుగా తీసుకొచ్చిన కొత్త వెర్షన్ ధరను రూ.32,000 వరకు తగ్గించారు. ఇది లిమిటెడ్ పిరియడ్ ఆఫర్.

Honda Elevate Apex Summer Edition Launched: హోండా కార్స్ ఇండియా, తన పాపులర్ SUV 'ఎలివేట్'లో వివిధ ఎడిషన్‌లను లాంచ్ చేసింది. ఈ SUV కి మార్కెట్‌లో స్పెషల్ ఇమేజ్ ఉంది, అయితే సేల్స్ తగ్గుతున్నాయి. అమ్మకాలు పెంచుకోవడానికి, ఈ జపనీస్ కంపెనీ, 'ఎలివేట్'లో కొత్తగా 'అపెక్స్ సమ్మర్ ఎడిషన్'ను ప్రవేశపెట్టింది. ఎలివేట్ కొత్త వెర్షన్ లిమిటెడ్ రన్ మోడల్ & స్టాండర్డ్ వెర్షన్‌లకు భిన్నమైన మార్పులతో వచ్చింది, వాటి కంటే తక్కువ ధరలో లాంచ్ అయింది. హోండా ఎలివేట్ అపెక్స్ సమ్మర్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 12.39 లక్షలుగా నిర్ణయించారు.
అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌లో "అపెక్స్ ఎడిషన్" బ్యాడ్జ్, కొన్ని స్పెషల్ ప్రత్యేక యాక్సెసరీస్ సహా చిన్నపాటి కాస్మెటిక్ ఛేంజెస్ ఉన్నాయి. అమ్మకాలు క్షీణించిన ఎలివేట్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చి, కస్టమర్ ఫస్ట్ ఆప్షన్‌గా మార్చడానికి హోండా ప్రయత్నిస్తోంది.
9-అంగుళాల స్క్రీన్ & 360-డిగ్రీ కెమెరా
మొదటిసారి, హోండా అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌లో పెద్ద 9-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ అమర్చారు, ఇది ప్రయాణీకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు డ్రైవర్ అసిస్టెంట్‌గా పని చేస్తుంది. 360-డిగ్రీల కెమెరాను కూడా ఫిట్ చేశారు.
డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్ & సాఫ్ట్ టచ్ ఎలిమెంట్స్
అపెక్స్ సమ్మర్ ఎడిషన్‌లో బ్లాక్ & ఐవరీ కలర్ థీమ్‌తో డ్యాష్ బోర్డ్, ఐవరీ లెథరెట్ సీట్లను ఏర్పాటు చేశారు. డోర్ ప్యాడ్స్ & డ్యాష్ బోర్డ్ కోసం సాఫ్ట్ టచ్ మెటీరియల్‌ను ఉపయోగించడం వల్ల ఇది ప్రీమియం లుక్ ఇస్తోంది. వెంటిలేటెడ్ సీట్ల గురించి టాక్ ఉన్నప్పటికీ, అవి యాక్సెసరీస్‌గా అందుబాటులో ఉన్నాయి & వాటిని స్టాండర్డ్ ఫీచర్‌గా పరిగణించలేదు.
ఇంజిన్ & మైలేజ్
హోండా ఎలివేట్ 1.5-లీటర్ నాలుగు సిలిండర్ల VTEC పెట్రోల్ ఇంజిన్‌తో పవర్ పొందుతుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 121 PS శక్తిని & 145 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌కు కనెక్ట్ చేస్తూ 6-స్పీడ్ మాన్యువల్ & CVT ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ SUV లీటరుకు 16 కిలోమీటర్ల నుంచి 17 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
ఎక్స్‌టీరియర్ & సేఫ్టీ
అపెక్స్ సమ్మర్ ఎడిషన్ ఎక్స్‌టీరియర్‌లో పెద్దగా మార్పులు లేవు. అయితే, "అపెక్స్" బ్యాడ్జింగ్ & లిమిటెడ్ కలర్ ఆఫ్షన్లు దీనిని ప్రత్యేకంగా నిలబెడతాయి. భద్రత పరంగా, కొత్త వెర్షన్‌లో 360-డిగ్రీల కెమెరాను స్టాండర్డ్ ఫీచర్‌గా చేర్చారు, ఇది ఇప్పుడు VX ట్రిమ్‌లో కూడా అందుబాటులో ఉంది.
హోండా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్ మూడు ప్రధాన వేరియంట్లలో లాంచ్ అయింది. V MT అపెక్స్ ఎడిషన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది & దీని ఎక్స్-షోరూమ్ ధర 12.86 లక్షల రూపాయలు. VX CVT అపెక్స్ ఎడిషన్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది & దీని ఎక్స్-షోరూమ్ ధర 13.59 లక్షల రూపాయలు. పరిమిత కాల డిస్కౌంట్‌తో లాంచ్ అయిన అపెక్స్ సమ్మర్ ఎడిషన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో పని చేస్తుంది & దీని ఎక్స్-షోరూమ్ ధర 12.39 లక్షల రూపాయలు. అంటే, స్టాండర్డ్ మోడల్ కంటే ఇది రూ. 32,000 చవకగా అందుబాటులో ఉంది.





















