బాబర్ బైక్ సెగ్మెంట్‌లో కొత్త పోరు.. గోవాన్ క్లాసిక్ 350తో హోండా రెబెల్ 300 పోటీ!
Honda Rebel 300, Royal Enfield Goan Classic 350 బైక్‌ల ఇంజిన్, పవర్, బరువు, ఫీచర్లు, ధరలపై పూర్తి పోలిక.

Honda Rebel 300 vs Royal Enfield Goan Classic 350: బాబర్ బైక్‌లకు ఇండియాలో మంచి డిమాండ్ ఉంది. ఈ సెగ్మెంట్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బలమైన స్థానంలో ఉంది, గోవాన్ క్లాసిక్ 350తో ప్రత్యేకమైన బాబర్ లుక్ అందిస్తోంది. ఇప్పుడు ఈ బైక్‌కు హోండా నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. హోండా కంపెనీ జులై 2026లో నిర్వహించిన మెగా ఈవెంట్‌లో ప్రకటించిన పది కొత్త మోడళ్లలో హోండా రెబెల్ 300 కూడా ఉంది.
హోండా రెబెల్ 300ను నవంబర్ 2026లో భారత్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. అధికారిక ధర, లాంచ్ తేదీ ఇంకా వెల్లడికాలేదు. అయితే, ఈ బైక్‌కు సంబంధించిన కీలక వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350తో పోలిస్తే రెబెల్ 300 ఎలా ఉందో చూద్దాం.
ఇంజిన్‌లో భారీ తేడా
హోండా రెబెల్ 300లో 286cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఇది 30hp పవర్ & 27.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
గోవాన్ క్లాసిక్ 350లో 349cc, సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 19.9hp పవర్ & 27Nm టార్క్ అందిస్తుంది. ఇందులో 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది.
అంటే ఇంజిన్ సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ రెబెల్ 300 పవర్ విషయంలో గోవాన్ క్లాసిక్ 350 కంటే చాలా ముందుంది. రెండు బైక్‌ల టార్క్ దాదాపు ఒకే స్థాయిలో ఉంటుంది. రెబెల్ 300లో సాధారణ వెర్షన్‌తో పాటు E-Clutch వెర్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. E-Clutch వల్ల గేర్ మార్చేటప్పుడు క్లచ్‌ను ప్రతిసారి ఆపరేట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఇది కూడా చదవండి: Ducati Monster V2 vs Triumph Street Triple 765 RS - 111hp vs 130hp.. ధర, పవర్, టార్క్‌లో ఏది బెస్ట్?
బరువు
కొలతల విషయంలోనూ రెండు బైక్‌ల మధ్య తేడా ఉంది. హోండా రెబెల్ 300 బరువు 171.9kg. గోవాన్ క్లాసిక్ 350 బరువు 197kg. అంటే హోండా బైక్ సుమారు 25kg తక్కువ బరువుతో ఉంటుంది.
రెబెల్ 300 సీట్ హైట్ 691mm కాగా, గోవాన్ క్లాసిక్ 350 సీట్ హైట్ 750mm. దీనివల్ల, తక్కువ ఎత్తు ఉన్న రైడర్లకు హోండా బైక్ మరింత సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది.
రెబెల్ 300 వీల్‌బేస్ 1491mm & గోవాన్ క్లాసిక్ 350 వీల్‌బేస్ 1400mm. హోండా బైక్‌లో 11 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది & రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో 13 లీటర్ల ట్యాంక్ ఉంది. రెబెల్ 300 గ్రౌండ్ క్లియరెన్స్ వివరాలు ఇంకా వెల్లడికాలేదు. గోవాన్ క్లాసిక్ 350 గ్రౌండ్ క్లియరెన్స్ 170mm.
టైర్లు & బ్రేకులు
రెబెల్ 300లో ముందు 130/90-16, వెనుక 150/80-16 టైర్లు ఉంటాయి. గోవాన్ క్లాసిక్ 350లో ముందు 100/90-19, వెనుక 130/90-16 టైర్లు ఉన్నాయి.
బ్రేకింగ్ కోసం హోండా బైక్‌లో ముందు 296mm డిస్క్, వెనుక 240mm డిస్క్ ఉంటాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో ముందు 300mm, వెనుక 270mm డిస్క్‌లు ఉన్నాయి. రెండు బైక్‌లలోనూ డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్‌గా ఉంటుంది.
ఇది కూడా చదవండి: హీరో నుంచి రెడీ అవుతున్న ఈవీ బైక్.. ఓలా- బజాజ్‌లకు తప్పని పోటీ
ఫీచర్లలో హోండా ఆధిక్యం
రెట్రో డిజైన్ ఉన్నప్పటికీ రెబెల్ 300లో ఆధునిక ఫీచర్లను హోండా అందించే అవకాశం ఉంది. భారత్ వెర్షన్‌లో పూర్తి TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ వెర్షన్‌లో నెగెటివ్ LCD క్లస్టర్ ఉంటుంది.
గోవాన్ క్లాసిక్ 350లో ట్రిప్పర్ నావిగేషన్ పాడ్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. అయితే హోండా E-Clutch వ్యవస్థ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది సాధారణ క్విక్‌షిఫ్టర్‌కు సమానంగా అనిపించినా, రెండూ ఒకే టెక్నాలజీలు కావు.
ధరలోనూ దగ్గర పోటీ
హోండా రెబెల్ 300 అధికారిక ధర ఇంకా ప్రకటించలేదు. అయితే దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.2.10 లక్షల నుంచి రూ.2.20 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా. లాంచ్ సమయంలోనే ధర తెలుస్తుంది.
ప్రస్తుతం, రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 ధర రూ.2.25 లక్షల ఎక్స్-షోరూమ్‌గా ఉంది. ధర పరంగా రెండు బైక్‌లు దగ్గరగా ఉండే అవకాశం ఉంది.
మొత్తంగా చూస్తే రెబెల్ 300 తక్కువ బరువు, తక్కువ సీట్ హైట్, ఎక్కువ పవర్ & ఆధునిక E-Clutch టెక్నాలజీతో ఆకట్టుకోవచ్చు. గోవాన్ క్లాసిక్ 350 మాత్రం పెద్ద ఇంజిన్, ఎక్కువ ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం & ప్రత్యేకమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బాబర్ డిజైన్‌తో తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు





















