Pollution Certificate: పొల్యూషన్ రూల్స్ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
PUC Certificate: వాహన కాలుష్యంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. 17 వేలకు పైగా పాత వాహనాలు సీజ్ చేశారు, PUC సర్టిఫికెట్ లేని వాహనాలకు 25,610 చలాన్లు జారీ చేశారు.

Pollution Certificate Fines: వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు పోలీసులు కఠిన చర్యలు చేపడుతున్నారు. కాలుష్య నిబంధనలు పాటించని వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి నవంబర్ 2 వరకు ఏకంగా 17 వేలకు పైగా కాలం చెల్లిన వాహనాలను (End-of-Life Vehicles) సీజ్ చేశారు. మరోవైపు, చెల్లుబాటు అయ్యే పొల్యూషన్ అండర్ కంట్రోల్ (Pollution Under Control - PUC) సర్టిఫికెట్ లేకుండా తిరిగిన వాహనాలకు 25,610 చలాన్లు జారీ చేశారు.
ఇంత కఠినమైన రూల్స్ అమలు చేస్తోంది మన తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఢిల్లీలో. ఆ రాష్ట్ర ట్రాఫిక్ పోలీసుల గణాంకాల ప్రకారం, మొత్తం 17,000కు పైగా కాలం చెల్లిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 16,918 ద్విచక్ర వాహనాలు, 164 కార్లు ఉన్నాయి. మిగిలినవి త్రిచక్ర వాహనాలు, ఇతర వాహనాలు.
ఒక్క జోన్‌లోనే 9,916 పాత వాహనాలు సీజ్
ఢిల్లీలోని జోన్-1 పరిధిలోనే పోలీసులు భారీగా పాత వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. సెంట్రల్, ఈస్టర్న్, నార్తర్న్ ట్రాఫిక్ రేంజ్‌ల పరిధిలో ఈ ఏడాది మొత్తం 9,916 'ఎండ్ ఆఫ్ లైఫ్' వాహనాలను సీజ్ చేసినట్లు PTI నివేదించింది. ఈ వాహనాల యజమానుల్లో అవగాహన పెంచేందుకు ట్రాఫిక్ పోలీసులు 'EOL వాహనాల అవగాహన సదస్సు' పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. పాత వాహనాలను స్వచ్ఛందంగా అప్పగించి, ప్రభుత్వ అనుమతి పొందిన స్క్రాపింగ్ కేంద్రాల్లోనే తుక్కుగా మార్చాలని ప్రజలకు సూచించారు.
నవంబర్ 12 నుంచి 16 వరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా యజమానులు స్వచ్ఛందంగా అప్పగించిన 240 ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలను అధికారులు స్వాధీనం చేసుకుని స్క్రాపింగ్‌కు పంపించారు. వీటిలో.. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: టాటా కార్లపై హోండా, హ్యుందాయ్ ఆసక్తి.. కొత్త భాగస్వామ్యం కోసం కీలక చర్చలు
PUC సర్టిఫికెట్ లేకుంటే చలానా
వాహనాల కాలుష్యంపై చర్యల్లో భాగంగా, PUC సర్టిఫికెట్ లేని వాహనాలపైనా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. చెల్లుబాటు అయ్యే PUC సర్టిఫికెట్ లేకుండా ప్రయాణించిన వాహనాలకు, నవంబర్ 1 నుంచి 17 మధ్యకాలంలో 25,610 చలాన్లు జారీ చేశారు. ఇదే సమయంలో, BS-VI ప్రమాణాలకు అనుగుణంగా లేని 30,742 వాహనాలను ఢిల్లీ సరిహద్దుల వద్ద నుంచే వెనక్కి పంపించారు. మరో 2,817 వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ జరిమానాల మొత్తం రూ.5.42 కోట్లుగా ఉంది.
దిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన నాన్-BS-VI పెట్రోల్ & డీజిల్ వాహనాలను నవంబర్ 1 నుంచి జనవరి 31 వరకు ఢిల్లీ పోలీసులు నిషేధించారు. అయితే, ఎలక్ట్రిక్, CNG, కొన్ని నిత్యావసర వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.
GRAP నిబంధనలు మరింత కఠినం
ఢిల్లీలో గాలి నాణ్యత 'వెరీ పూర్' స్థాయికి పడిపోవడంతో కాలుష్య నియంత్రణ చర్యలను కూడా కఠినతరం చేశారు. నవంబర్ 2న కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) GRAP రెండో దశను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ దశలో, దుమ్ము నియంత్రణ చర్యలను పెంచడం, పార్కింగ్ ఛార్జీలను అధికం చేయడం, డీజిల్ జనరేటర్ల వినియోగంపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు చేపట్టారు.
ఇది కూడా చదవండి: క్రికెటర్ శివమ్ దూబే కొత్త కారు ఇదే.. 286 bhp పవర్, 679 కి.మీ రేంజ్, అదిరిపోయే అడ్వాన్స్‌డ్ ఫీచర్లు!
నవంబర్ 6న ఢిల్లీ AQI 382కు చేరడంతో GRAP మూడో దశను కూడా అమలు చేశారు. నిర్మాణ, కూల్చివేత పనులపై ఆంక్షలు విధించారు. కొన్ని వాహనాల రాకపోకలను నియంత్రించడంతో పాటు చిన్న తరగతుల విద్యార్థులకు హైబ్రిడ్ విధానంలో తరగతులు నిర్వహించే చర్యలు చేపట్టారు. అయితే, గాలి నాణ్యత కాస్త మెరుగుపడటంతో నవంబర్ 17న GRAP మూడో దశ ఆంక్షలను ఎత్తివేశారు.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















