సింగిల్ ఛార్జ్‌తో ఏకంగా 1338 km ప్రయాణం.. Audi A6 e-tron సంచలనం
ఆడి ఏ6 ఈ ట్రాన్ ఒక్క ఛార్జ్‌తో 1338 కి.మీ. ప్రయాణించి గిన్నిస్ రికార్డు సృష్టించింది. 777 కి.మీ. అధికారిక రేంజ్‌ను 72 శాతం అధిగమించింది.

Audi A6 e-tron Guinness World Record: ఒక్కసారి ఛార్జ్ చేస్తే మీ కారు ఎంత దూరం వెళ్తుంది? సాధారణంగా కంపెనీ ప్రకటించే రేంజ్‌నే మనం నమ్ముతాం. కానీ, ఆడి ఏ6 స్పోర్ట్‌బ్యాక్ ఈ ట్రాన్ ఏకంగా 1338 కి.మీ. ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్క ఛార్జ్‌తో 831 మైళ్లు, అంటే 1338 కి.మీ. దూరం వెళ్లింది. ఈ ప్రయాణంతో.. 'ఉత్పత్తి దశలో ఉన్న ఎలక్ట్రిక్ కారు'తో సింగిల్ ఛార్జ్‌తో అత్యధిక దూరం ప్రయాణించిన రికార్డును ఆడి సొంతం చేసుకుంది. వాస్తవానికి, ఆడి ప్రకటించిన WLTP రేంజ్ 777 కి.మీ. మాత్రమే.
ఈ ప్రత్యేక ప్రయాణం పోలాండ్‌లో ప్రారంభమైంది. సెప్టెంబర్ 11న తెల్లవారుజామున 1:55 గంటలకు రికార్డు ప్రయత్నం మొదలైంది. ర్యాలీ డ్రైవర్ మికో మార్జిక్ కారును నడిపారు. వీస్తులా నది వెంట ప్రయాణించిన ఆయన.. క్రాకోవ్, సాండోమియెర్జ్, వార్సా, టోరున్, గ్రుడ్జియాంజ్ మీదుగా వెళ్లారు. చివరకు బాల్టిక్ సముద్రంలోని హెల్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి నుంచి తిరిగి అదే మార్గంలో ప్రయాణం కొనసాగించారు.
45 గంటల ప్రయాణం
45 గంటలకు పైగా సాగిన ఈ ప్రయాణంలో ఆడి పూర్తిగా సాధారణ రహదారులపైనే నడిచింది. ట్రైలర్‌పై తరలించలేదు. సాధారణ ట్రాఫిక్‌ను ఎదుర్కొంది. రద్దీ సమయాల్లోనూ ప్రయాణించింది. ఈ సమయంలో సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్‌గా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోయింది. చివరకు టోరున్ & సిచెకోసినెక్ మధ్య కారు ఛార్జ్ పూర్తిగా అయిపోయింది.
ఆడి ఏ6 స్పోర్ట్‌బ్యాక్ ఈ ట్రాన్ పెర్ఫార్మెన్స్‌లో వెనుక చక్రాలకు శక్తినిచ్చే ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఇది 365 bhp శక్తిని & 565 Nm గరిష్ఠ టార్క్‌ను అందిస్తుంది. ప్రత్యేక లాంచ్ మోడ్‌లో శక్తి 380 bhp వరకు పెరుగుతుంది. 0 నుంచి 100 km/h వేగాన్ని 5.4 సెకన్లలో అందుకుంటుంది. గరిష్ఠ వేగం 210 km/h.
ఇది కూడా చదవండి: KTM 390 అడ్వెంచర్‌ను ఫైనాన్స్ ఆఫర్‌లో సొంతం చేసుకోండి.. డౌన్‌పేమెంట్ & EMI లెక్కలు ఇవే
శక్తి వినియోగమే కీలకం
ఈ రికార్డులో అసలు ఆకట్టుకునే విషయం వేగం కాదు, శక్తి వినియోగం. మికో మార్జిక్ ప్రతి 100 కి.మీ.కు కేవలం 7.09 kWh విద్యుత్‌ను మాత్రమే వినియోగించారు. ఇది కంపెనీ ప్రకటించిన అధికారిక వినియోగం కంటే సగానికంటే తక్కువ. వేగాన్ని నియంత్రించడం, ముందుగానే ట్రాఫిక్‌ను అంచనా వేయడం, అవసరం లేని యాక్సిలరేషన్ & బ్రేకింగ్‌ను తగ్గించడం వంటి పద్ధతులను ఆయన పాటించారు. రీజెనరేటివ్ బ్రేకింగ్‌ను సమర్థంగా ఉపయోగించారు. టైర్లలో సరైన గాలి ఒత్తిడిని కూడా కొనసాగించారు.
ఈ రికార్డులో కారు రూపకల్పన కూడా కీలక పాత్ర పోషించింది. ఆడి ఏ6 స్పోర్ట్‌బ్యాక్ ఈ ట్రాన్ గాలి నిరోధక గుణకం 0.21గా ఉంది. ఇది ఆడి ఉత్పత్తి కార్లలో అత్యంత ఏరోడైనమిక్ మోడల్‌గా నిలుస్తోంది. ఇందులో 94.9 kWh ఉపయోగించగల బ్యాటరీ సామర్థ్యం ఉంది. రీజెనరేటివ్ బ్రేకింగ్ వ్యవస్థ ద్వారా 220 kW వరకు శక్తిని తిరిగి పొందవచ్చు.
72 శాతం ఎక్కువ దూరం ప్రయాణం
ఆడి ప్రకటించిన WLTP రేంజ్ 777 కి.మీ. అయితే ఈ 45 గంటల రికార్డు ప్రయాణంలో 1338 కి.మీ. దూరాన్ని చేరుకుంది. అంటే అధికారిక రేంజ్ కంటే సుమారు 72 శాతం ఎక్కువ. అయితే, ఇది మొత్తం ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన రికార్డు కాదు. 2023లో TUfast Eco Team రూపొందించిన చిన్న నమూనా వాహనం 2573.79 కి.మీ. ప్రయాణించింది. అందుకే ఆడి సాధించిన రికార్డు ప్రత్యేకంగా 'ఉత్పత్తి దశలో ఉన్న ఎలక్ట్రిక్ కార్ల' విభాగానికి చెందుతుంది.
ఇది కూడా చదవండి: ఒంటరిగా వెళ్లినా, జంటగా వెళ్లినా.. లాంగ్ రైడ్స్‌కు బెస్ట్.. రూ.2-5 లక్షల్లో 11 అడ్వెంచర్ టూరర్ బైక్స్
సాధారణ వినియోగదారులు కూడా 777 కి.మీ. రేంజ్ ఉన్న ఆడి ఏ6 ఈ ట్రాన్‌తో ప్రతిసారీ 1338 కి.మీ. ప్రయాణించగలరని దీని అర్థం కాదు. అయితే డ్రైవింగ్ పద్ధతి, వాహనం డిజైన్ & గాలి నిరోధకత వంటివి ఎలక్ట్రిక్ కారు సామర్థ్యంపై ఎంత ప్రభావం చూపుతాయో ఈ రికార్డు స్పష్టంగా చూపించింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















