Winter Car AC Tips: చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఈ గుర్తుల అసలైన అర్ధం తెలిస్తే ఎన్నో ప్రయోజనాలు!
Car AC Button Symbols: చలికాలంలో కారు ఏసీ ఎలా ఉపయోగించాలి? ఏసీ బటన్ల గుర్తుల అర్థాలు, హీటర్ పనితీరు, రీసర్క్యులేషన్ వినియోగం, ప్రయాణ భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి.

Car AC Usage Tips: కారులో AC పని చేయకపోతే జర్నీ చాలా చిరాగ్గా ఉంటుంది. అద్దాలు ఎత్తేసి, ACని 22 మీద పెట్టుకుని ప్రయాణం సాగిస్తే అలసటే తెలీదు. అయితే.. చలికాలంలో చాలామంది ఏసీని అస్సలు టచ్ చేయరు. మరికొందరు హీట్ మోడ్ ఆన్ చేసుకుంటారు. అయితే, ఏసీ వినియోగాన్ని పూర్తిగా ఆపేయడం కానీ.. హీట్ మోడ్‌లో ఎక్కువసేవు ఉంచడం కానీ మంచిది కాదని ఆటోమొబైల్ ఎక్స్‌పర్ట్‌లు చెబుతున్నారు.
వాస్తవానికి, కారు ఏసీని కేవలం చల్లదనం కోసం మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటే పొరబడినట్లే. వర్షాకాలంలోనూ, చలికాలంలోనూ ఏసీ కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా అద్దాలపై పేరుకునే తేమను తొలగించడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. డ్రైవర్‌కు రోడ్డు స్పష్టంగా కనిపించేలా చేస్తుంది. AC ప్యానెల్‌పై ఉండే బటన్ల అర్థాలు తెలియక చాలామంది వాటిని సరిగ్గా ఉపయోగించరు. ఈ చలికాలంలో కారు ఏసీని ఎలా వాడాలి? ఏ బటన్ ఏం చేస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తెలుసుకుందాం.
చలికాలంలో ఏసీ ఆఫ్ చేయడం మంచిదేనా?
చలి ఎక్కువగా ఉందని ఏసీని పూర్తిగా ఆపేయాల్సిన అవసరం లేదు. అవసరాన్ని బట్టి ఏసీని ఉపయోగించడమే మంచిది. ముఖ్యంగా కారులోని అద్దాలపై పొగమంచు లేదా తేమ పేరుకున్నప్పుడు ఏసీ ఎంతో ఉపయోగపడుతుంది. ఏసీ వ్యవస్థ గాలిలోని తేమను తగ్గిస్తుంది. దీంతో అద్దాలు త్వరగా స్పష్టంగా మారతాయి.
చలికాలంలో చాలామంది రీసర్క్యులేషన్ బటన్‌ను ఆన్ చేసి ప్రయాణిస్తుంటారు. దీనివల్ల బయట గాలి లోపలికి రాకుండా కారులోని గాలే లోపల మళ్లీ మళ్లీ తిరుగుతూ ఉంటుంది. ఎక్కువసేపు ఇదే విధంగా ప్రయాణించడం మంచిది కాదు. కారులో తాజా గాలి అందకపోవడంతో ప్రయాణికులకు అసౌకర్యం కలగవచ్చు. తెలీకుండానే, డ్రైవర్ అలసటకు గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి: RTO ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు! డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్‌ను ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్‌లో ఇలా చేయండి!
కారు ఏసీ ప్యానెల్‌లోని గుర్తుల అర్థాలు ఇవే!
కారులో ఏసీ నియంత్రణ వ్యవస్థ వాహనం మోడల్‌ను బట్టి మారుతుంది. అయితే సాధారణంగా కనిపించే కొన్ని ముఖ్యమైన గుర్తుల గురించి తెలుసుకోవాలి.
ఏసీ బటన్: ఈ బటన్ నొక్కితే ఏసీ కంప్రెసర్ పనిచేస్తుంది. గాలిని చల్లబరచడంతో పాటు దానిలోని తేమను తగ్గిస్తుంది. అద్దాలపై తేమ పేరుకున్నప్పుడు కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఫ్యాన్ గుర్తు: కారులోకి వచ్చే గాలి వేగాన్ని నియంత్రించేందుకు ఈ బటన్ ఉపయోగపడుతుంది. ఫ్యాన్ వేగాన్ని పెంచితే గాలి ఎక్కువగా వస్తుంది. తగ్గిస్తే గాలి ప్రవాహం తగ్గుతుంది.
ఆటో బటన్: ఈ సదుపాయం ఉన్న కార్లలో మనకు కావాల్సిన ఉష్ణోగ్రతను ఎంచుకుంటే సరిపోతుంది. ఎంచుకున్న ఉష్ణోగ్రతను కొనసాగించేందుకు ఫ్యాన్ వేగం, గాలి ప్రవాహ దిశను వాహన వ్యవస్థ ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది.
ఉష్ణోగ్రత గుర్తు: సాధారణంగా నీలం రంగు చల్లదనాన్ని, ఎరుపు రంగు వేడిని సూచిస్తాయి. ఈ గుర్తు ద్వారా కారులో కావాల్సిన ఉష్ణోగ్రతను ఎంచుకోవచ్చు. కొన్ని కార్లలో డిజిటల్ తెరపై నేరుగా డిగ్రీలు కనిపిస్తాయి.
రీసర్క్యులేషన్ బటన్: ఈ గుర్తును ఆన్ చేస్తే బయట గాలి లోపలికి రాకుండా కారులోని గాలినే మళ్లీ ప్రసారం చేస్తుంది. బయట దుమ్ము, పొగ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతుంది. అయితే ఎక్కువసేపు నిరంతరంగా ఉపయోగించకూడదు.
కారులో హీటర్ ఎలా పనిచేస్తుంది?
చలికాలంలో కారులో వేడి గాలి రావడానికి ప్రత్యేక హీటింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లలో ఇంజిన్ నుంచి వెలువడే వేడిని ఈ వ్యవస్థ ఉపయోగిస్తుంది. ఇంజిన్ శీతలీకరణ వ్యవస్థలోని వేడి ద్రవం ద్వారా ఈ ఉష్ణాన్ని హీటర్‌కు చేరవేస్తుంది. అనంతరం ఫ్యాన్ ద్వారా ఆ వేడిగాలిని కారు లోపలికి పంపుతుంది.
ఎలక్ట్రిక్ కార్లలో విధానం భిన్నంగా ఉంటుంది. వీటిలో ప్రత్యేక విద్యుత్ హీటర్లు లేదా హీట్ పంప్ వ్యవస్థలు ఉంటాయి. ఇవి బ్యాటరీ నుంచి విద్యుత్తును వినియోగిస్తాయి. అందువల్ల చలికాలంలో హీటర్ వాడకం వల్ల వెహికల్ రేంజ్ మీద ప్రభావం పడవచ్చు.
ఇది కూడా చదవండి: టాటా కారు కొనేవాళ్లకు భారీ షాక్.. డిసెంబర్ నుంచి పెరగనున్న ICE, EV మోడళ్ల ధరలు
ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించండి!
కారు ఏసీ, హీటర్ ఉపయోగించే సమయంలో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి.
1. ఏసీని తరచూ ఉపయోగించకపోయినా అప్పుడప్పుడు ఆన్ చేయడం మంచిది. దీనివల్ల AC వ్యవస్థలోని భాగాలు సక్రమంగా పనిచేస్తాయి.
2. ఏసీ ఫిల్టర్లను నిర్ణీత వ్యవధిలో శుభ్రం చేయించాలి. అవసరమైతే మార్చాలి.
3. కారు స్టార్ట్ చేసిన వెంటనే హీటర్‌ను గరిష్ఠ స్థాయిలో పెట్టకుండా క్రమంగా ఉష్ణోగ్రతను పెంచుకోవాలి.
4. మూసి ఉన్న గ్యారేజీలో ఇంజిన్ ఆన్ చేసి హీటర్ ఉపయోగించకూడదు. కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువుల వల్ల ప్రాణాపాయం కలగవచ్చు.
5. ఇంజిన్ ఆన్‌లో ఉంచి కారులో ఏసీ లేదా హీటర్ వేసుకుని నిద్రపోకూడదు. ముఖ్యంగా మూసి ఉన్న ప్రదేశాల్లో ఇది అత్యంత ప్రమాదకరం.
6. హీటర్ ఆన్ చేసినప్పుడు అసాధారణమైన వాసన వస్తే వెంటనే స్విచ్ ఆపేయాలి, ఎక్స్‌పర్ట్ దగ్గర చెక్ చేయించాలి.
7. ఏసీ నుంచి సరైన గాలి రావడం లేదని అనిపిస్తే ఫిల్టర్, గాలి ప్రసరణ వ్యవస్థను చెక్ చేయించాలి.
కాబట్టి, చలికాలంలో ఏసీని పూర్తిగా పక్కన పెట్టకుండా, దానిలోని బటన్ల పనితీరును తెలుసుకుని అవసరానికి తగ్గట్టు ఉపయోగించాలి. చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే కారు లోపల సౌకర్యవంతమైన వాతావరణంతో పాటు ప్రయాణ భద్రత కూడా పెరుగుతుంది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















