RC Smart Cards: మూడేళ్ల నిరీక్షణకు తెర.. ఏపీ వాహనదారుల చేతిలోకి కొత్త డ్రైవింగ్ లైసెన్సులు, RC కార్డులు!
ఏపీలో మళ్లీ RC, డ్రైవింగ్ లైసెన్స్ స్మార్ట్‌కార్డుల పంపిణీకి ఏర్పాట్లు. రూ.200 రుసుం చెల్లించిన అర్హులకు పోస్టు ద్వారా ఇంటికే కార్డులు పంపిణీ చేయనున్నారు.

AP RC Smart Cards: ఆంధ్రప్రదేశ్‌లోని వాహనదారులకు ఇది కచ్చితంగా పెద్ద శుభవార్త. వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు (RC), డ్రైవింగ్ లైసెన్సులకు సంబంధించిన స్మార్ట్ కార్డుల ముద్రణ మళ్లీ స్టార్ట్ అయింది. గత మూడేళ్లుగా ఆగిపోయిన స్మార్ట్‌కార్డులను పంపిణీ చేసేందుకు AP సర్కారు చర్యలు చేపట్టింది. దీంతో.. RCలు, డ్రైవింగ్ లైసెన్సులను డిజిటల్ రూపంలో లేదా జిరాక్స్ పేపర్ల రూపంలో సరిపెట్టుకుంటున్న వారికి ఊరట లభించనుంది.
2023 నుంచి నిలిచిన కార్డుల ముద్రణ
ఆంధ్రప్రదేశ్‌లో 2023 ఆగస్టు నుంచి డ్రైవింగ్ లైసెన్సులు, RC స్మార్ట్‌కార్డుల ముద్రణ నిలిచిపోయింది. దీంతో కొత్తగా వాహనాలు కొన్నవాళ్లు, డ్రైవింగ్ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇబ్బందులు పడ్డారు. దరఖాస్తు ప్రక్రియ పూర్తయినా కార్డులు చేతికి రాలేదు. ఫలితంగా చాలామంది తమ ఫోన్లలో డిజిటల్ డాక్యుమెంట్స్ రూపంలో వాటిని భద్రపరుచుకున్నారు. మరికొందరు జిరాక్స్ ప్రతులను వెంట తీసుకెళ్తున్నారు.
గతంలో రవాణా శాఖ ద్వారా స్మార్ట్‌కార్డులను నేరుగా అందించేవారు. వాటిని పర్సులో పెట్టుకుని సులభంగా తీసుకెళ్లేందుకు, తనిఖీల సమయంలో చూపించేందుకు వీలుండేది. ప్రింటింగ్ ఆగిపోయాక ఈ సౌలభ్యం పోయింది. ఇప్పుడు మళ్లీ స్మార్ట్‌కార్డుల ముద్రణ & పంపిణీ ప్రారంభం కావడంతో వెహికల్ ఓనర్లలో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కార్డుల కోసం దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ఆఫీస్‌ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు!
స్మార్ట్‌కార్డుల పంపిణీలో రవాణా శాఖ ప్రత్యేక విధానాన్ని అమలు చేయనుంది. గతంలో మాదిరిగా కార్యాలయాలకు వెళ్లి కార్డులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పోస్టల్ శాఖ ద్వారా నేరుగా వాహనదారుల చిరునామాలకే కార్డులను పంపించనున్నారు.
ఇది కూడా చదవండి: Toyota Innova Hycross Faceliftలో ఏ వేరియంట్ కొనాలి? E85 ఫ్లెక్స్ ఫ్యూయల్ ఆప్షన్, రూ.19.59 లక్షల నుంచి ధరలు
కార్డుల ముద్రణతో పాటు వాటిని పోస్టు ద్వారా పంపిణీ చేసే బాధ్యతలను టెండర్ల ద్వారా ఎంపిక చేసిన ప్రైవేటు సంస్థకు అప్పగించారు. దీంతో ముద్రణ నుంచి ఇంటికి చేరేవరకు ప్రత్యేక వ్యవస్థ పనిచేయనుంది. ఈ విధానం వల్ల వాహనదారులకు సమయం ఆదా అవుతుంది. రవాణా ఖర్చులు తగ్గుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు, ఇతర పనుల కారణంగా RTO ఆఫీస్‌లకు వెళ్లలేనివారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
మూడు నగరాల్లో ముద్రణ పనులు వేగవంతం
ప్రస్తుతం.. తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో స్మార్ట్‌కార్డుల ముద్రణ చేపట్టారు. ఇందుకోసం ప్రైవేటు సంస్థల ద్వారా పనులు కొనసాగుతున్నాయి. ముద్రణ పూర్తయిన కార్డులను సంబంధిత చిరునామాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు.
2023 తర్వాత డ్రైవింగ్ లైసెన్సులు, RCల కోసం దరఖాస్తు చేసుకుని, డిజిటల్ రూపంలో పత్రాలు పొందినవారిలో రూ.200 రుసుం చెల్లించినవారికి స్మార్ట్‌కార్డులను ఇంటికే పంపించే చర్యలు చేపట్టినట్లు రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.
వాహనదారులు తెలుసుకోవాల్సిన విషయం ఇదే!
స్మార్ట్‌కార్డుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవాళ్లు తమ చిరునామా వివరాలను సరిచూసుకోవడం మంచిది. కార్డులు ఇంటికి చేరాలంటే దరఖాస్తులో ఇచ్చిన చిరునామా సరైనదై ఉండాలి. అలాగే సంబంధిత రుసుం చెల్లింపుల వివరాలు కూడా పరిశీలించుకోవాలి.
ఇది కూడా చదవండి: 2026 Toyota Innova Hycross ఫేస్‌లిఫ్ట్‌లో భారీ మార్పులు.. 12.3 అంగుళాల స్క్రీన్లు, కొత్త లుక్, హైబ్రిడ్ మోడల్
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ కోసం "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.
ట్రెండింగ్ వార్తలు






















