Tirumala Laddu వివాదం- మనిషి పుట్టుక పుట్టి, ఇలా మాట్లాడతారా ? చంద్రబాబుపై వైవీ సుబ్బారెడ్డి ఫైర్
Andhra Pradesh | తిరుమల లడ్డూపై ఏపీ సీఎం చంద్రబాబు దారుణమైన వ్యాఖ్యలు చేసి, వందల కోట్ల మంది హందువుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.
YV Subba Reddy challengs AP CM Chandrababu over Tirumala Laddu Row | అమరావతి: తిరుమల పవిత్రతను గత వైసీపీ ప్రభుత్వం దెబ్బతీసిందని, వైఎస్ జగన్ హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ ఏపీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత, రాజ్యసభ సభ్యుడు, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. మనిషి పుట్టుక పుట్టినవారెవ్వరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, అలాంటి ఆరోపణలు చేయరంటూ చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దివ్య క్షేత్రం అయిన తిరుమల (Tirumula Temple) పవిత్రతను, వందల కోట్ల హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దారుణంగా దెబ్బతీసి పెద్ద పాపమే చేశాడన్నారు. తిరుమలలో లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గంగా ఉన్నాయన్నారు.
రాజకీయ లబ్ధికోసం చంద్రబాబు ఎంతటి నీచానికైనా వెనుకాడరని.. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో నిరూపితం అయిందన్నారు. భక్తుల విశ్వాసాన్ని బలపరిచేందుకు తిరుమల ప్రసాదంపై ఎలాంటి అవకతవకలు జరగలేదని నేను, నా కుటుంబం ఆ దేవుడి సాక్షిగా ప్రమాణానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఇదే విధంగా సీఎం చంద్రబాబుచ నారా లోకేష్‌లు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్ విసిరారు.
We challenge @ncbn, along with @naralokesh and his family, to take the same oath. Are they ready @JaiTDP ?#SaveTTDFromTDPFakeNews#TDPFakeNewsFactory https://t.co/UsMFPnebGE
— YSR Congress Party (@YSRCParty) September 18, 2024
ఇంతకీ చంద్రబాబు ఏమన్నారు..
మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాలులో ఎన్డీఏ కూటమి ప్రజా ప్రతినిధులతో చంద్రబాబు సమావేశం అయ్యారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సమావేశం నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. 'తిరుమలను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అపవిత్రం చేసింది. ఆఖరికి తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలిపిన దారుణ పరిస్థితి ఉంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వును గత వైసీపీ ప్రభుత్వం వాడింది. వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం తిరుమలలో అరాచకాలు చేసింది. తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రను దెబ్బతీశారు. నాణ్యత లేని పదార్థాలతో లడ్డూను తయారు చేసి, దేవుడి ప్రసాదాలను కూడా అపవిత్రం చేశారు.
గతంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడితే.. కూటమి అధికారంలోకి రాగానే నాణ్యమైన పదార్థాలతో లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయిస్తున్నాం. వైసీపీ గత ఐదేళ్లలో ఎన్నో అవకతవకలకు పాల్పడింది. తిరుమలలో ఇలా తప్పులు చేసి, డబ్బు దండుకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లో తప్పకుండా శిక్ష పడాల్సిందే. అన్నా క్యాంటీన్ రద్దు చేసి దుర్మార్గమైన పని చేశారు జగన్. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే వాలంటీర్ల గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదు. వైఎస్ఆర్సీపీ హయాంలో తప్పులు చేసిన వాళ్లని వదిలిపెట్టం. కూటమి ప్రభుత్వంలో ఒక్క తప్పు చేయడానికి కూడా వీల్లేదు. అందరూ జాగ్రత్తగా ఉండాలని ' హెచ్చరించారు.