YCP Changed stand on Amaravati: వైసీపీ యూటర్న్ - అమరావతికి మద్దతుగా మారుతున్న స్వరం -3 రాజధానులు ప్రజలు వద్దన్నారన్న సజ్జల !
Amaravati: అమరావతికి మద్దతుగా వైసీపీ స్వరం మారుతోంది. ప్రజలు మూడు రాజధానులు వద్దన్నారని అందుకే తాము కూడా పునరాలోచిస్తామని అంటున్నారు.

YSRCP tone is changing in support of Amaravati: మూడు రాజధానుల పేరుతో చేసిన రాజకీయం ఘోరమైన ఓటమిని తెచ్చిపెట్టడంతో వైసీపీ పునరాలోచనలో పడింది. ఓ వైపు అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతూండటం, నిధుల కొరత లేకపోవడంతో మరో మూడేళ్లలో అమరావతి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రధానమైన ప్రభుత్వ భవనాలన్నీ పూర్తవుతాయి. మౌలిక సదుపాయాలు ఏర్పడతాయి. అదే సమయంలో పెద్ద ఎత్తున ప్రైవేటు పెట్టుబడులును తెచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ, యూనివర్శిటీలు సహా పెద్ద పెద్ద సంస్థలను ఆహ్వానిస్తున్నారు. ఈ పరిణామాలతో వైసీపీ వ్యూహం మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది.
అమరావతి రాజధానిగా కొనసాగుతుంది: సజ్జల
YSRCP రాష్ట్ర కో-ఆర్డినేటర్ మరియు మాజీ మంత్రి సజ్జల రామకృష్ణ రెడ్డి మంగళగిరిలో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ, "వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. ముఖ్యమంత్రి YS జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే నివసిస్తారు, విశాఖపట్నంకు వెళ్లరు" అని వ్యాఖ్యానించారు. గతంలో విశాఖపట్నంకు మారాలని ఆలోచించామని, కానీ అది సాధ్యం కాలేదనన్నారు. మూడు రాజధానులను ప్రజలు వద్దన్నారని అందుకే తాము పునరాలోచిస్తున్నామన్నారు. "లక్షల కోట్ల అప్పులు చేసి అమరావతి కట్టడానికి మేము వ్యతిరేకమే. బెజవాడ-గుంటూరు మధ్య రాజధాని నిర్మిస్తే రెండు నగరాలు బాగా అభివృద్ధి చెందేవి" అని సజ్జల వ్యాఖ్యానించారు.
క్షవరం అయితే కానీ వివరం రాదూ
— Sreedhar Adabala 👨💻 (@SreedharAdabala) September 12, 2025
మూడు రాజధానులు సాధ్యం కాదు
అమరావతి లోనే రాజధాని
ప్రతి ఎలక్షన్ ఇదే చెప్పి
అధికారం వచ్చాక కొవ్వు ప్రదర్శన
మిమ్మల్ని ఎవడు నమ్మేది సజ్జల ?
pic.twitter.com/VsXpxKRbld
అమరావతిని కొండవీటి వాగులో నిర్మిస్తున్నారు : అంబటి రాంబాబు
TDP ప్రభుత్వం అమరావతి అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు తన అనుచరులకు మాత్రమే ప్రయోజనం చేయాలని కుట్ర పన్నారు. మేము మళ్లీ రాజకీయంలోకి వస్తే, అమరావతి ప్రాజెక్ట్‌ను పరిశీలిస్తాము, కానీ రాజధాని భావనను మార్చకుండా ప్రజల అభివృద్ధికి ఉపయోగపడేలా చేస్తామని చెప్పారు. కొండవీటి వాగులో అమరావతిని నిర్మిస్తున్నారని.. మునిగిపోయే చోట నిర్మిస్తున్నారన్నారు. అమరావతి ఒక్కటే రాజధాని కాదు .. గుంటూరు-విజయవాడ మధ్య ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాము .. అధికారంలోకి వస్తామని వ్యాఖ్యానించారు.
అమరావతికి మద్దతుగా వైసీపీ అధికారిక ప్రకటన చేస్తుందా ?
రాజధాని అంశంపై YSRCPలో గందరగోళం ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. మూడు రాజధానులు వదిలేసి, అమరావతిని ఒప్పుకున్నట్టు కనిపించడంతో, పార్టీ కార్యకర్తలు తమ విధానం మారిందా అని వాకబు చేస్తున్నారు. అయితే పార్టీ నేతలు అమరావతి రైతుల్ని మభ్యపుచ్చడానికి ఇలాంటి మాటలు చెబుతున్నారని .. గతంలోనూ జగన్ తాను అమరావతిలోనే ఉంటానని చెప్పారని అంటున్నారు. వైసీపీ గతంలో అమరావతినే రాజధానిగా ఉంటుందని చెప్పి ఎన్నికల్లో గెలిచిన తర్వాత మూడు రాజధానులు అనడం వల్ల ప్రజలు నమ్మకం కోల్పోయారు. మరోసారి అదే మాట చెప్పినా నమ్మరని టీడీపీ నేతలంటున్నారు.






















