నవంబర్ 1 నుంచి ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం- ఎన్నికలు ఎప్పుడో చెప్పేసిన ఏపీ సీఎం
వైసీపీ తప్ప దేశంలో ఏ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. మేనిఫెస్టోలో ఇచ్చినహామీలను 99శాతం అమలు చేశామన్నారు.
వైసీపీ తప్ప దేశంలో ఏ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. మేనిఫెస్టోలో ఇచ్చినహామీలను 99శాతం అమలు చేశామన్నారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు న్యాయం చేశామన్నారు. మార్చి , ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని అన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ప్రజలకు సేవకుడిగా సేవలందించాను కాబట్టే 52 నెలల కాలంలో సువర్ణాక్షరాలతో లిఖించేలా పాలన అందించామన్నారు సీఎం జగన్, మూడు ప్రాంతాల ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ మూడు రాజధానులు ఏర్పాటు చేశామన్నారు. అధికారాన్నిఇచ్చిన ప్రజలకు తొలి సేవకుడి బాధ్యతగా తీసుకున్నట్లు వెల్లడించారు.
40రోజుల పాటు బస్సు యాత్రలు
అక్టోబరు 25 నుంచి డిసెంబరు 5వరకు ఎమ్మెల్యేల బస్సు యాత్ర జరుగుతుందన్నారు. ప్రతి రోజు మూడు ప్రాంతాల్లో మూడు సమావేశాలు జరుగుతాయన్నారు. నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో 40 రోజుల పాటు బస్సు యాత్రలు సాగుతాయన్నారు. ప్రతి బస్సులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నేతలు ఎమ్మెల్యేలు ఉంటారని సీఎం జగన్ స్పష్టం చేశారు. సామాజిక వర్గాలన్నింటిని కలుపుకొని వెళ్లేదే బస్సు యాత్ర అని అన్నారు. రాబోయేది కురుక్షేత్ర సంగ్రామమేనని, పేదవాడికి, పెత్తదారులకు జరుగుతోందన్నారు. 175 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎమ్మెల్యేలు వివరిస్తారని అన్నారు. పేదలంతా ఏకమైతేనే పెత్తందారులను ఎదుర్కొంటామన్నారు. డిసెంబరు 11 నుంచి ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం మొదలవుతుందన్నారు సీఎం జగన్. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం క్రీడా సంబరాలు నిర్వహిస్తుంది. దీని ద్వారా గ్రామస్థాయిలో నైపుణ్యమున్న క్రీడాకారులను గుర్తించడమే లక్ష్యమన్నారు.
వై ఏపీ నీడ్స్ జగన్
జగనన్న సురక్షకార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చాు. రాష్ట్రవ్యాప్తంగా 15వేల హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఏ వ్యాధులు ఉంటే అన్ని విధాలా సాయం చేస్తామన్నారు. వ్యాధి నయం అయ్యేంత వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు మరింత మంచి చేయడానికి జగన్ మళ్లీ రావాలన్నారు. కోటి 60 లక్షల ఇళ్లకు వై ఏపీ నీడ్స్ జగన్ వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో మళ్లీ మన ప్రభుత్వమే రావాలన్నారు. ఏపీకి జగనే ఎందుకు కావాలో చేప్పేందుకే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. నవంబరు 1 నుంచి డిసెంబరు 10 వరకు వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం ఉంటుందన్నారు.
31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ
అక్క చెల్లెమ్మలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్న సీఎం జగన్, 22 లక్షల ఇళ్లు అక్క చెల్లెమ్మల పేరుతో నిర్మాణం జరుగుతున్నాయని వెల్లడించారు. ఇందులో 80శాతం పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చామని గుర్తు చేశారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామన్న జగన్, పేదరికంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. అక్క చెల్లెమ్మల సాధికారతకు కృషి చేశామన్న సీఎం, నామినేటెడ్ పదవుల్లో 50 శాతానికి పైగా ఎస్పీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఇచ్చామన్నారు. స్థానిక సంస్థల నుంచి కేబినెట్ వరకూ సామాజిక న్యాయం చేశామన్న ఆయన, వైఎస్ జగన్ అంటే మాట నిలబెట్టుకుంటాడని నిరూపించుకున్నామని స్పష్టం చేశారు. సామాజిక వర్గాలకు, ప్రాంతాలకు సమన్యాయం చేశామన్న జగన్, రూ. 2లక్షల 35వేల కోట్లు డీబీటీ ద్వారా ప్రజలకు అందించామన్నారు.