Ysrcp On Ayyanna Patrudu : నర్సీపట్నం పిల్లి ఎక్కడ నక్కింది, అయ్యన్నపై వైసీపీ నేత చెంగల తీవ్ర వ్యాఖ్యలు
Ysrcp On Ayyanna Patrudu : అయ్యన్నపాత్రుడుపై వైసీపీ నేత చెంగల వెంకట్రావు మండిపడ్డారు. మద్యం మత్తులో నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం అయ్యన్న అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Ysrcp On Ayyanna Patrudu : రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు అన్నారు. అయినా ప్రభుత్వంపై టీడీపీ బురద జల్లుతోందన్నారు. ప్రభుత్వ విధానాలలో ఎక్కడైనా తప్పులు జరిగితే ప్రతిపక్షంగా వాటిని ఎత్తిచూపాలా కానీ అలా కాకుండా, టీడీపీ నేతలు ఇష్టానుసారంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై నోరు పారేసుకుంటున్నారన్నారు. ఇదంతా చంద్రబాబు ఒక ప్లాన్ ప్రకారం కుట్ర చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఒక నొటోరియస్ క్రిమినల్ అని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం దురదృష్టమన్నారు. చంద్రబాబు రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఇద్దరు, ముగ్గురు ఆబోతులను ముద్రవేసి వదిలివేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నర్సీపట్నంలో ఒక తాగుబోతును జనం మీదకు వదిలారని విమర్శించారు. అయ్యన్నపాత్రుడు ఎప్పుడూ మద్యం, గంజాయి మత్తులోనే ఉంటారని విమమర్శించారు. నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతుంటారని మండిపడ్డారు.
ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం
అయ్యన్న ఉత్తరాంధ్రకు పట్టిన దరిద్రం. ప్రజలకు ప్రజాప్రతినిధులు ఆదర్శంగా ఉండాలి. అయ్యన్న ఇంటి గోడ కూల్చివేత విషయానికి వస్తే ఆక్రమించిన స్థలం ఎంతనేది సర్వే జరిగితే కదా, రెండు సెంట్లో, ఇరవై సెంట్లో తెలిసేది. జాయింట్ సర్వేకు ఒప్పుకుని మళ్లీ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవడం ఏంటి? నర్సీపట్నం పిల్లి ఎక్కడ నక్కింది? బయటకు వస్తే తేల్చుకుందాం.- మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు
ఆ అర్హత టీడీపీకి లేదు
చట్ట ప్రకారం ఆక్రమణ తొలగిస్తే అయ్యన్నపాత్రుడు తన భార్య ద్వారా బీసీ కార్డును తెరమీదకు తేవడం సిగ్గుచేటని చెంగల వెంకట్రావు అన్నారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే అన్న ఆయన... దళితులు, బీసీలు గురించి మాట్లాడే అర్హత టీడీపీకి లేదన్నారు. చంద్రబాబు ఏనాడు ఒక దళితుడిని హోంమంత్రి చేసిన సందర్భాలు ఉన్నాయా? ప్రశ్నించారు. సీఎం జగన్ రాష్ట్రంలో సామాజిక విప్లవం తెచ్చారన్నారు. వాలంటీర్ నుంచి కేబినెట్ వరకు బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు పెద్దపీట వేశారన్నారు. హోంమంత్రి పదవులు కూడా ఎస్సీలకు, అందులోనూ మహిళలకు ఇచ్చారన్నారు.
భూకబ్జాలపై బహిరంగ చర్చకు సిద్ధమా?
టీడీపీ హయాంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా దోచుకున్నారో అందరికీ తెలిసిందే. దీనిపై సిట్ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటారు. తాగుబోతు అయ్యన్నను ఒకటే అడుగుతున్నాను. సండ్రా హోటల్ నీది కాదా? దానికి అక్రమంగా రోడ్డును వేయించుకోలేదా? నీ కొడుకుకు వేరే రాష్ట్రాల్లో అయిదు పవర్ ప్లాంట్లు లేవా? కీర్తీ క్రియేషన్స్ ఎవరిది? ఆ చౌదరి నీ బినామీ కాదా? వీటన్నింటిపై చర్చిద్దామా? - మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు