YSRCP Nominated Posts: వీళ్లకే నామినేటెడ్ పోస్టులు.. వైసీపీ నేతలకు పండగే పండగ!
వైసీపీ నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన నామినేటెడ్ పోస్టులను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పోస్టుల్లో నియోజకవర్గ స్థాయి నేతలు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీలో నియోజకవర్గ స్థాయి నాయకులు.. ద్వితీయ శ్రేణి నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల పంపకాన్ని ఆ పార్టీ హైకమాండ్ పూర్తి చేసింది. ఈ మేరకు పదవులు పొందిన అదృష్టవంతుల జాబితాను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మొత్తం 135 మందికి రాష్ట్ర స్థాయి పదవులు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 76 పదవులు కేటాయించారు. 135 పోస్టుల్లో మహిళలకు 68, పురుషులకు 67 పదవులు ఇచ్చారు. నియోజకవర్గ స్థాయి.. నేతలకు అత్యధికంగా ప్రాధాన్యం ఇచ్చారు.
గత ఎన్నికల్లో వైసీపీ గెలవని 24 నియోజకవర్గాల్లోని నేతలకు ప్రాధాన్య పదవులు ఇచ్చారు. విశాఖలో .. గంటా శ్రీనివాస్‌పై పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజుతో పాటు దాడి వీరభద్రరావు కుమారుడు రత్నాకర్‌కు కూడా రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చారు. అలాగే గత ఎన్నికల్లో టిక్కెట్లు రాకపోయినా పార్టీ కోసం కష్టపడిన వారికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. వైవీ సుబ్బారెడ్డికి మళ్లీ టీటీడీ బోర్డు ఛైర్మన్ పదవి ఇచ్చారు. ఆయనకు కొనసాగింపు ఇవ్వకుండా.. స్పెసిఫైట్ అథారిటీని నియమించడంతో.. ఆయన అలిగారన్న ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో... బోర్డు మొత్తాన్ని ప్రకటించకపోయినా ఆయనకు పదవి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సుధాకర్ , ఏపీఐడీసీ ఛైర్మన్‌గా పుణ్యశీలను నియమించారు.
ఇక రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టులను దక్కించుకున్న నేతల ఆనందానికి అవధులు లేవు. అయితే ఇది వైసీపీలో కొత్త రకం చిచ్చు పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే.. పదవులు దక్కని అనేక మంది.. ఇప్పుడు అసంతృప్తితో రగిలిపోయే ప్రమాదం ఉంది. చాలా మంది నేతలు... తమకు రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారని.. తాము పార్టీ కోసం కష్టపడ్డామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు.. సామాజిక సమీకరణాలు.. ఎస్సీ, ఎస్టీ , బీసీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించే లక్ష్యంతో చాలా మందికి పదవులు దక్కలేదు. వారు ఎలా స్పందిస్తారన్నదానిపైనే వైసీపీలో చిచ్చు రేగుతుందా?.. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంటుందా? అన్నది తెలియాల్సి ఉంది.
నిజానికి వైసీపీ కార్యకర్తలకు ఇటీవలి కాలంలో పదవుల పందేరం జరుగుతోంది. స్థానిక ఎన్నికలతో ఎక్కువ మందికి పదవులు దక్కాయి. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఏ పదవులూ లేని వారికి ... కుల కార్పొరేషన్లు పెట్టి పదవులు ఇచ్చారు. కానీ.. ఆ పదవుల కంటే పెద్ద నేతలకు నామినేటెడ్ పోస్టులు కట్ట బెట్టారు. ఇప్పటికీ.. కొంత మంది మిగిలిపోయారు. వారికి వైసీపీ హైకమాండ్ ఎలా న్యాయం చేస్తుందనే దాన్ని బట్టి.. ఆ పార్టీ నేతలు తమ స్పందన వ్యక్తం చేసే అవకాశం ఉంది.