YSR Achievement Awards: గురువారం వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల జాబితా ప్రకటన
YSR Achievement Awards: ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే విధంగా కార్యక్రమం చేపట్టి, రాష్ట్ర అవార్డులు కూడా ఇస్తే బాగుంటుందని వైఎస్సార్ అవార్డులు ప్రవేశపెట్టింది.
YSR Lifetime Achievement Awards:
కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా పలు రంగాలలో విశేష కృషి చేసిన వారిన పద్మ, భారతరత్న వంటి అవార్డులతో సత్కరించడం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం పలు రంగాలకు చెందిన ప్రముఖులను గుర్తించి వారికి సత్కారాలు చేస్తుంటాయి. ఈ క్రమంలో ఏపీలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇదే విధంగా కార్యక్రమం చేపట్టి, రాష్ట్ర అవార్డులు కూడా ఇస్తే బాగుంటుందని వైఎస్సార్ అవార్డులు ప్రవేశపెట్టింది. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌లైన, కళలకు, సంస్కృతికి ఈ అవార్డులలో పెద్దపీట వేయనున్నారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ పేరు మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నెలకొల్పి.. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్, వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు గ్రహీతల వివరాలను అక్టోబర్ 19న (గురువారం) ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డును అందించడం ఇది వరుసగా మూడో ఏడాది అని ఆయన వెల్లడించారు. 2021లో ఏపీ ప్రభుత్వం తొలిసారిగా ఈ అవార్డులను ప్రకటించింది.
సామాన్యుల్లో అసామాన్యులకు, పలు రంగాల్లో సమాజానికి విశిష్ట సేవలందించి తమదైన ముద్రవేసిన వారిని గుర్తించి అవార్డులు అందించనున్నామని విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జీవీడి. కృష్ణమోహన్ ఇతర అవార్డు కమిటీ సభ్యులతో కలిసి అవార్డుకు ఎంపికైన వారి జాబితాను రేపు (అక్టోబర్ 18న) సాయంత్రం 3 గంటలకు పబ్లిసిటీ సెల్, సెక్రటేరియట్ లో వెల్లడించనున్నట్లు కమిషనర్ తెలిపారు.
రూ.5 లక్షల, రూ.10 లక్షల నగదు రివార్డులు..
వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డుకు ఎంపికైన వారికి రూ.10 లక్షల నగదు పురస్కారంతో పాటు వైఎస్సార్ కాంస్య ప్రతిమ, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయనున్నారు. వైఎస్సార్ అచీవ్ మెంట్ అవార్డు క్రింద రూ.5 లక్షల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారని కమిషనర్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నవంబర్ 1వ తేదీన అవార్డు గ్రహీతలకు ఈ అవార్డులను ప్రదానం చేయనున్నామని తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.