YS Jagan Bengaluru: పులివెందుల నుంచి నేరుగా బెంగళూరుకు YS జగన్ - కొద్ది రోజులు అక్కడేనా?
Latest News in AP: పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు పయనం అయ్యారు. కొద్ది రోజులు ఆయన అక్కడే ఉంటారని తెలుస్తోంది.
YS Jagan Mohan Reddy News: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ముగిసింది. గత శనివారం (జూన్ 22) మూడు రోజులపాటు జగన్ పులివెందులలో పర్యటించిన సంగతి తెలిసిందే. పులివెందుల నియోజకవర్గంలో మూడు రోజుల్లో మండలాల వారీగా వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. అయితే, ఆ పర్యటన ముగియడంతోనే వైఎస్ జగన్ బెంగళూరుకు వెళ్లారు. పులివెందుల నుంచి హెలికాప్టర్‌లో బెంగుళూరుకు బయలుదేరి వెళ్లారు. తన వ్యాపారాలు కారణంగానే కొద్ది రోజులు వాటిపై ఫోకస్ చేసేందుకు బెంగళూరుకు వెళ్లినట్లు తెలిసింది.
పులివెందుల నేతలకు దిశానిర్దేశం
ఇక మూడు రోజులపాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటించాక.. ఆఖరి రోజు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా తన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైసీపీ ఓడిపోయిందని పార్టీ శ్రేణులు ఎవరూ అధైర్యపడొద్దని.. రాబోయే కాలంలో మన పార్టీ మంచి విజయం సాధిస్తుందని అన్నారు. ప్రతి కుటుంబంలో మనం చేసిన మంచి ఇంకా ఉందని.. మనపట్ల ప్రజలకు విశ్వాసం ఉందని అన్నారు. భవిష్యత్తు మొత్తం మనదే అని పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. వైసీపీ అధికారంలో లేకున్నా ఎప్పటికీ ప్రజాశ్రేయస్సు కోసం పని చేయాలని జగన్ అన్నారు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కొందామని పిలుపు ఇచ్చారు. రానున్న కాలంలో ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు వైసీపీ తోడుగా ఉంటుందని జగన్ భరోసా కల్పించారు.