Gorantla Madhav : గోరంట్ల మాధవ్‌కు ఈ సారి టిక్కెట్ లేనట్లేనా ? సైలెంట్ అయిపోయిన ఎంపీ !
గోరంట్ల మాధవ్ కు ఈ సారి టిక్కెట్ లభిస్తుందా ? రాజకీయ కార్యకలాపాల్లో దూకుడు తగ్గించిన హిందూపురం ఎంపీకి ఈ సారి టిక్కెట్ లేదన్న ప్రచారం జరుగుతోంది.
Gorantla Madhav : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ది ఓ ప్రత్యేకమైన స్టోరీ. పోలీసు అధికారిగా ఉంటూ అధికార పార్టీ నేతల మీద మీసం మెలెసి.. తొడకొట్టి ప్రతిపక్ష పార్టీని మెప్పించి ఏకంగా ఎంపీ టిక్కెట్ పొందారు. అంతే కాదు ఘన విజయం సాధించారు కూడా. కానీ ఐదేళ్లయ్యేసరికి ఆయనకు రాజకీయం గడ్డు కాలం వచ్చేసింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ లబిస్తుందా లేదా అన్న డైలమాలో పడిపోయారు. సీఎం జగన్ ను చాలా సార్లు కలిసినా... మళ్లీ నీకే టిక్కెట్ అనే భరోసా దక్కలేదు. అదే సమయంలో.. ఏదో ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో అయినా చాన్సిస్తారేమోనని ఎదురు చూస్తున్నా.. ఇంత వరకూ అలాంటి సంకేతాలు రాకపోవడంతో.. మాధవ్ కూడా సైలెంట్ గానే ఉంటున్నారు.
మాధవ్ కు సమస్యగా మారిన వైరల్ వీడియో
పోలీసు అధికారిగానున్న సమయంలోనూ ఆయన చుట్టూ అనేక వివాదాలున్నాయి. ఎంపీ అయిన తరువాత చుట్టుముట్టిన వివాదం ఆయన మొత్తం జీవితాన్నే దెబ్బకొట్టేసిందా అన్నట్టుగా మారింది. మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడారంటూ సోషియల్ మీడియాలో సాగిన ప్రచారంతో ఆయన ప్రతిష్టను దెబ్బతీసింది. ఆ వీడియోపై పెద్ద దుమారమే రేగి, తరువాత చల్లారినప్పటికీ ఆయనకు మాత్రం మాయని మచ్చగానే మిగిలింది. అప్పటి నుంచి ఆయన రాజకీయంగానూ అంత క్రీయాశీలకంగా కనిపించడం లేదు.
సీఎం పర్యటించినప్పుడే వస్తున్న ఎంపీ
ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డి తదితరులు ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు తప్పా తక్కినప్పుడు ఎక్కడా ఆయన కనిపించడం లేదు. పార్లమెంటు పరిధిలోని నియోజకవర్గాల సమీక్షల్లోనూ ఆయనకు పిలుపు రావడం లేదు. మరికొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు అభ్యర్థుల అన్వేషణ మొదలుపెట్టాయి. వైసిపి కూడా ఎవరైతే సరిపోతారన్న దానిపై దృష్టి సారించిందనే చర్చ సైతం నడుస్తోంది. అయితే మాధవ్‌కు ఈసారి అవకాశం దాదాపుగా లేదనే ప్రచారమే సాగుతోంది. దీంతో కొత్తగా టిక్కెట్టు ఆశించే వారు సైతం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ముఖ్యమైన నాయకులను, ఇన్‌ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులను కలువడం, తమకు అవకాశం కల్పించాలన్న విజ్ఞాపనలను సైతం అందజేస్తున్నారు.
ఆశించినట్లుగా పని తీరు లేదనే విమర్శలు
ఎంపీగా కేంద్రం ద్వారా వచ్చే నిధులతో చేపట్టే కార్యక్రమాలు అనేకముంటాయి. వాటిని సాధించేందుకు ఆయన పెట్టిన కృషి చేయలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఒకవైపు ధర్మవరం, హిందూపురం, సోమందేపల్లి ప్రాంతాల్లో చేనేత పరిశ్రమ విరివిగా ఉంది. ఈ పరిశ్రమకు కేంద్రం ఊతమిస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేకమైన నిధులు రాబట్టలేకపోయారన్న విమర్శలున్నాయి. అదే విధంగా ఈ ప్రాంతంలోనే పట్టు పరిశ్రమ ఉంది. ఈ పట్టు రైతులకు, రీలర్లకు రావాల్సిన రాయితీలు రాలేదు. దీనిపైనా ఆయన స్పందించిన దాఖలాలు ఎక్కడా లేవ్న అసంతృప్తి ప్రజ్లలో ఉంది. ఇక రైల్వేకు సంబంధించి కొత్త ప్రాజెక్టు ఏఒక్కటీ ఈ నాలుగేళ్లలో సాధించలేకపోయారని అంటున్నారు. అన్ని విధాలుగా మైనస్‌లు కనిపిస్తూండటంతో మాధవ్ పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.