Weather Latest Update: హైదరాబాద్‌లో అకాల వర్షం - వచ్చే 3 గంటల్లో ఇక్కడ ఉరుముల, మెరుపులతో వర్షాలు
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది.
నేడు (ఏప్రిల్ 14) ఉదయం నుంచే హైదరాబాద్ సహా తెలంగాణలోపి కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు నేడు ఉదయం 6 గంటలకు విడుదల చేసిన వెదర్ బులెటిన్ ప్రకారం.. వచ్చే 3 గంటల్లో నాగర్ కర్నూల్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, నారాయణపేట జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కొనసాగుతుందని చెప్పారు.
నిన్నటి ద్రోణి/ గాలిలోని అనిచ్చితి, ఈ రోజు తూర్పు విదర్భ నుండి మరాత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కోస్తా కర్ణాటక వరకు సగటు సముద్రం మట్టంకి 0.9 కిలో మీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దిగువ స్థాయిలో గాలులు ఈ రోజు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల మధ్యన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. GHMC, చుట్టు ప్రక్కల జిల్లాలలో 38 డిగ్రీల నుండి 41 డిగ్రీల మధ్యన నమోదు అయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 39 డిగ్రీలు, 26 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 38.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 26.4 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 36 శాతం నమోదైంది.
ఏపీలో ఎండలు ఇలా
నేటి నుంచి ఏపీలో ఎండల తీవ్రత మరింత పెరగనుంది. ఒక పక్కన ఆంధ్రాలో ప్రస్తుతం 41-42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు చూస్తూ వచ్చాము. కానీ మరో మూడు రోజుల పాటు ఇది కాస్త 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో ఉండనుంది. కారణం ఏమిటి అంటే పొడిగాలులు ఉత్తర భారత దేశం నుంచి నేరుగా మన వైపుగా వీస్తున్నాయి కాబట్టి వేడి తీవ్రత ఎక్కువవ్వనుంది. విశాఖ నగరంలో కూడ నేటి నుంచి మరో మూడు రోజులు వేడిగా ఉంటుంది. అనకాపల్లి, కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మణ్యం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంధ్యాల, కడప, తూర్పు అనంతపురం, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వేడి 42 నుంచి 43 మధ్యలో ఉండనుంది.
ఆంధ్రప్రదేశ్ లో విరగ కాస్తోంది. ప్రస్తుతానికి పొడి గాలులు కోస్తా ప్రాంతం మీదుగా వీస్తోంది కాబట్టి వేడి అనేది చాలా ఎక్కువగా ఉంది. ప్రకాశం జిల్లాలోని గుండ్లపల్లిలో అత్యధికంగా 43.2 డిగ్రీలు నమోదయ్యింది. అలాగే నంద్యాల, కడప, చిత్తూరు జిల్లాలో కూడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలకు మించి నమోదయ్యింది. ప్రకాశం జిల్లా జువ్విగుంటలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఒక ప్రకాశం జిల్లానే కాదు కోస్తాంధ్ర వ్యాప్తంగా, రాయలసీమ జిల్లాలతో పాటుగా తూర్పు తెలంగాణలో వేడి భాగా పెరిగింది. చాలా చోట్లల్లో 42 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతోంది. రేపు ఈ వేడి కంటే ఇంకాస్త వేడి ఉండే అవకాశాలున్నాయి. జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గత నెలలో వర్షాలు ఏంటి అని అనుకుంటూ ఉన్నాం, కానీ ఈ నెలలో ఎండలు మామూలుగా లేవు. మరి ఇంకా మంచి ఎండలు ముందు ఉంది’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.