AP MLC Elections : రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమాలు - ఈసీ తక్షణం జోక్యం చేసుకోవాలని ఏపీ బీజేపీ డిమాండ్ !
రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు.
AP MLC Elections : ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటర్ల నమోదు చేశారన్న అంశంపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు ఉన్నాయని టెన్త్ పాస్ కాని వాళ్లను కూడా ఓటర్లుగా చేర్చి ఓట్లు వేయించే ప్రయత్ం చేస్తున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను గెలిపించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వివిధ పార్టీల నేతలు పెద్ద ఎత్తున ఈ దొంగ ఓట్ల వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాయలసీమలో పట్టభద్రుల బీజేపీ అభ్యర్థుల తరపున విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్సి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఈ అర్హత లేని ఓటర్ల అంశాన్ని ప్రధానంగా గుర్తించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లను చేర్చారనే ఆరోపణలు
రాయలసీమలోని రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లలో అనేక అక్రమాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం పట్టభద్రులకే్ ఓటర్లుగా నమోదు చేయాలి. కానీ ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లతో.. కొంత మంది అవినీతి అధికారుల సంతకాలతో దుర్వినియోగానికి పాల్పడి మరీ అర్హత లేని వారిని ఓటర్లుగా నమోదు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై విష్ణువర్ధన్ రెడ్డి ఎన్నికల సంఘం తీరుపై మండిపడ్డారు. రెండు చోట్ల వైఎస్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేసిందని.. దీనికి సచివలాయ, వాలంటీర్ వ్యవస్థలను వాడుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సంఘం ఎన్నికలు అపహాస్యం కాక ముందే మేలుకుని ఈ దొంగ ఓటర్లను గుర్తించి ఓటు వేయకుండా నిరోధించాలని ఆయన కోరుతున్నారు.
వాలంటీర్లు, సచివాలయ సిబ్బందితో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శలు
అదే సమయంలో పెద్ద ఎత్తున అక్రమాలు కూడా జరుగుతున్నాయని సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు అధికార వైకాపా గురిచేస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. దీనికి సంబందించి రోజూ.. మీడియాలోనే సాక్ష్యాలు కనిపిస్తున్నాయన్నారు. వాలంటీర్లు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని.. ఎన్నికల ప్రక్రియలో వారంటీర్లు జోక్యం చేసుకోకూడదన్న ఆదేశాలు ఉన్నాయన్నారు. కానీ వాలంటీర్లు పూర్తి స్థాయిలో ఉల్లంఘిస్తున్నా... ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వారిపై ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్రమ ఓటర్లపై రాజకీయ పార్టీల ఆందోళన
రాయలసీమలో రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఎన్నికలు, ఓటర్ల జాబితాలో తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఒక్క వైఎస్ఆర్‌సీపీ మినహా ఇతర పార్టీలు అర్హత లేని ఓటర్లను చేర్చారని.. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. తిరుపతిలో వైసీపీ కార్యాలయం అడ్రస్‌లోనే నాలుగైదు ఓట్లు నమోదయ్యాయి. అసలు పట్టభద్రులే లేని ఇంట్లో పదికి పైగాఓట్లు మమోదయ్యాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ పరిణామమాలపై విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని దొంగ ఓట్లతో అపహాస్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.