Murthy Yadav allegations against Jawahar Reddy : మా భూములపై జవహర్ రెడ్డి కన్ను- బెదిరిస్తున్నారు - విశాఖలో అసైన్డ్ ల్యాండ్స్ రైతుల ఆరోపణలు
Andhra News : జవహర్ రెడ్డిపై అసైన్డ్ రైతులు భూకబ్జా ఆరోపణలు చేశారు. జవహర్ రెడ్డి బినామీ త్రిలోక్ రౌడీలతో బెదిరిస్తున్నారని ఆరోపించారు. వీడియోలను ప్రదర్శించారు.
Jawahar Reddy News : రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే ఎస్ జవహర్ రెడ్డి, ఆయన కుమారుడు మే 20 వ తేదీన తాము సాగుచేసుకొంటున్న భూముల్లోకి వచ్చి పరిశీలించిన తరువాత ఆయన బ్రోకర్ త్రిలోక్ రౌడీలతో వచ్చి భూముల స్వాదీనానికి రెవిన్యూ అధికారుల సహకారంతో ప్రయత్నం చేశారుని భీమిలి మండలం అన్నవరం,తూడెం గ్రామల రైతులు,సాగుదారులు ఆరోపించారు. శుక్రవారం విశాఖలో జనసేన నేత పీతల మూర్తి యాదవ్ తో కలసి విలేకరుల సమావేశంలో పాల్గొన్న వారు తమకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఆయన బ్రోకర్ త్రిలోక్, జిల్లా కలెక్టర్ మల్లిఖార్జున లనుంచి రక్షణ కల్పించాలని కోరారు. హైకోర్టులో స్టేటస్కో వున్న కేసులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పటికీ జవహర్ రెడ్డి వత్తిడి కారణంగా, కలెక్టర్ మల్లిఖార్జున సిఫార్సులతో అక్రమంగా తమ సాగు భూములను స్వాధీనం చేసుకొనేందుకు త్రిలోక్ కొందరు రౌడీలు, క్రింది స్దాయి అధికారులతో ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 30 వ తేదీ గురువారం స్ధానిక రెవిన్యూ అధికారులు, పోలీసుల సాయంతో తమ భూములను ఆక్రమించి ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించగా తాము తీవ్రంగా ప్రతిఘటించామని చెబుతూ ఆ వీడియోలను ప్రదర్శించారు. తమ ప్రాణాలు పోయినా దశబ్ధాలుగా తమ సాగులో వున్న భూములను వదిలేది లేదని స్పష్టం చేశారు. తాము జీడి , మామిడి,సరుగుడు,కొబ్చరి సాగు చేస్తున్న భూములు ఈ ప్రాంతంలో సంబంధమే లేని ప్రధుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి ఆయన బినామీలకు ఎలా దఖలు పడతాయని ప్రశ్నించారు. చుట్టు పక్కల పలు గ్రామాల్లో త్రిలోక్ రౌడీలతో అమాయక రైతులు భూములను ఈ విధంగానే స్వాధీనం చేసుకొన్నారని ఆరోపించారు.
సీ ఎస్ జవహార్ రెడ్డి,కలెక్టర్ మల్లిఖార్జున లను సస్పెండ్ చేయాలని రైతుల డిమాండ్
నిరుపేదలైన దళిత, బీసీ ల చేతుల్లో వున్న అసైన్డ్ భూములకు కస్టోడియన్ గా వ్యవహరించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, వారికి రక్షణ కల్పించాల్సిన కలెక్టర్ మల్లిఖార్జున భక్షకులుగా మారి భూముల కబ్జా చేయడం దారుణమని మూర్తి యాదవ్ ధ్వజమెత్తారు. అసైన్డ్ భూములను కాపాడాల్సిన కీలకమైన పదువుల్లో ఉన్న ఐ ఏ ఎస్ లు ఇలా దారుణానికి ఓడిగట్టడం దేశచరిత్రలోనే మొదటిసారి అని , వెంటనే వీరిద్దరినీ సర్వీసు నుంచి తొలగించాలని డిమాండు చేశారు.ఎన్నికల సంఘం యాక్టివ్ గా ఉన్న సమయంలోనే జవహర్ రెడ్డి, మల్లిఖార్జునలు బరితెగించి ఇన్ని అక్రమాలు చేస్తున్నారంటే అంతకముందు ఇంకెన్ని చేశారో అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. వీరిని సర్వీసు నుంచి తొలగించి వ్యవహారాలపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
త్రిలోక్ ను అరెస్టు చేయాలన్న బాధితులు
వందలాది మంది దళితులను బెదిరించి అంబేద్కర్ రాజ్యాంగ స్పూర్తితో వారికిచ్చిన అసైన్డ్ భూములను కొట్టేసిని జవహర్ రెడ్డి తరపు బ్రోకర్ త్రిలోక్ ను వెంటనే అరెస్టు చేయాలని రైతులు తరపున మూర్తి యాదవ్ డిమాండు చేశారు. జవహర్ రెడ్డికి బందువైన పోలీసు ఉన్నతాధికారి నాగిరెడ్డి పేరు చెప్పి త్రిలోక్ క్రిందిస్ధాయి పోలీసు అధికారులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను చెప్పినట్లు చేయకపోతే బదిలీలుచేయిస్తానని, సస్పెండ్ అయిపోతారని త్రిలోక్ ఎస్ ఐ, సీ ఐ లనే బెదిరిస్తున్నారంటే అమాయక దళితులతో ఇంకెలా వ్యవహరిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. భూ కబ్జాకేసులు, బెదిరింపుల కేసుల్లో త్రిలోక్ ను అరెస్టు చేయాలని కోరారు.
700 ఎకరాలే అనడానకి సిగ్గులేదా?
రాష్ర్టంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కంటే కాస్త ఎక్కువగా కేవలం 700 ఎకరాల దళితుల భూములకే ఫ్రీ హోల్డు సర్టిఫికేట్లు ఇచ్చామని కలెక్టర్ మల్లిఖార్జున చెప్పడం సిగ్గుచేటని మూర్తి యాదవ్ విమర్శించారు. చిత్తూరు జిల్లాలో లక్షకు పైగా ఎకరాలలో ప్రీ హోల్డు అనుమతులిచ్చారని తాను మాత్రమే 700 ఎకరాలకు పరిమితమయ్యానని ఆయన పోల్చుకోవడం దారుణమని ధ్వజమెత్తారు. విశాఖ జిల్లాలో కలెక్టర్ ఇచ్చిన భూముల విలువ వేలకోట్ల లోనే వుంటుందన్న విషయం మరువరాదని , భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోనూ, ఆనందపురం , భీమిలి ఆరు లైన్ల జాతీయ రహదారి సమీపంలోని భూములు కలెక్టర్ చెప్పినట్లు విలువలేని గ్రామీణ భూములా అని ప్రశ్నించారు. కలెక్టర్ కు చిత్తసుద్ది వుంటే కుంభకోణం బయటపడ్డాక ఆనందపురంలో 22 ఎకరాలకు తాజాగా అనుమతులివ్వరని అన్నారు. మరిన్ని వందల ఎకరాల ఫైళ్లు కలెక్టర్ వద్ద సిద్ధంగా వున్నాయని, ఆయన 700 ఎకరాల మాటకే కట్టుబడితే కౌంటింగ్ ముగిసి కొత్త ప్రభుత్వం వచ్చే వరకూ ఆ ఫైళ్ల జోలికి వెళ్లకూడదని సవాల్ విసిరారు.