California: అమెరికాలోని కాలిఫోర్నియాలో 7.0 తీవ్రతతో భారీ భూకంపం- సునామీ వస్తుందా?
California Earthquake Today: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం సంభవించింది. దీని ప్రకంపనలు శాన్ ఫ్రాన్సిస్కో వరకు వచ్చాయి. సునామీ హెచ్చరిక కూడా అధికారులు జారీ చేశారు.
7.0 Earthquake In California Today: గురువారం (డిసెంబర్ 5) ఉత్తర కాలిఫోర్నియాలోని హంబోల్ట్ కౌంటీలో ఉదయం 10:44 గంటలకు 7.0 తీవ్రతతో భూకంపం వచ్చింది. US జియోలాజికల్ సర్వే (USGS) ప్రకారం భూకంప కేంద్రం ఒరెగాన్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫెర్న్‌డేల్ అనే చిన్న పట్టణానికి పశ్చిమాన ఏర్పడింది. ఈ భూకంపం ప్రకంపనలు శాన్ ఫ్రాన్సిస్కో వరకు వచ్చాయి. ప్రకంపనల సమయంలో ఒక్కసారిగా షేక్ అయ్యామని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాసేపటికే దానిని ఉపసంహరించుకున్నారు.
భూకంపం ప్రభావంతో ఇచ్చిన సునామీ హెచ్చరికతో 5.3 మిలియన్ల మంది ప్రజలు భయాందోళలకు గురయ్యారు. ప్రకంపనలు వచ్చిన ప్రాంతాల్లో సుమారు 1.3 మిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారని USGS తెలిపింది. శాంటాక్రజ్ ప్రాంతంలోని నేషనల్ వెదర్ సర్వీస్ తీర ప్రాంతాలను బలమైన అలలు ప్రభావితం చేసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించింది. శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా రాపిడ్ ట్రాన్సిట్ (BART) ముందుజాగ్రత్తగా నీటి అడుగున సొరంగం నుంచి ట్రాఫిక్‌ను నిలిపివేసింది.
భూకంపానికి కారణం ఏమిటి
భూమి లోపల ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక వల్ల భూకంపాలు ఏర్పడతాయి. ఈ పలకలు ఒకదానికొకటి ఢీకొన్నప్పుడు లేదా రాపిడీ జరిగినప్పుడు భూమి షేక్ అవుతుంది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై కొలుస్తారు. ఇది 1 నుంచి 9 వరకు ఉంటుంది. 7.0 తీవ్రతతో సంభవించిన భూకంపం 40 కిలోమీటర్ల వ్యాసార్థంలో తీవ్రమైన ప్రకంపనలకు కారణమవుతుంది.
జాతీయ వాతావరణ శాఖ హెచ్చరికలు
తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ఎత్తైన ప్రదేశాల్లో తలదాచుకోవాలని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు తీర ప్రాంతాల వద్దకు వెళ్లొద్దని సూచించింది. ప్రకంపనల తర్వాత పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తి సన్నాహాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Also Read: 5.3 తీవ్రతతో ములుగులో భూకంపం- హైదరాబాద్, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఊగిన భూమి