Telangana Earthquake News: 5.3 తీవ్రతతో ములుగులో భూకంపం- హైదరాబాద్, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఊగిన భూమి
Earthquakes Today News : తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు భయాందోళనలు కలిగించాయి. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో ఈ ప్రభావం కనిపించింది.
Earthquake In Hyderabad Just Now: దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. రెండు సెకన్లపాటు కంపించిన భూమి అందర్నీ భయాందోళనకు గురి చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది.
ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భవనాలు షేక్ అవ్వడం అందర్నీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఉదయాన్నే ఆఫీస్‌కు వచ్చిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇలాంటి ప్రకంపనలు హైదరాబాద్, హన్మకొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెంలో కనిపించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలు కూడా ఈ భూ ప్రకంపనల ప్రభావాన్ని చూశారు.
ఉదయం 7:27 గంటలకు తెలంగాణలోని ములుగులో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకటించింది. దీని కారణంగానే తెలుగు రాష్ట్రాలు షేక్ అయినట్టు పేర్కొంది.
ఈ ఏడాది మార్చిలో తిరుపతిలో భూకంపం
2024 మార్చి 14న ఆంధ్రప్రదేశ్ లో భూకంపం సంభవించినట్లుగా నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారికంగా ప్రకటించింది. తిరుపతిలో 13.84 అక్షాంశం, 79.91 రేఖాంశం వద్ద భూకంప కేంద్రం ఉన్నట్లుగా పేర్కొంది. ఇది రిక్టర్ స్కేలుపై 3.9 గా నమోదైందని ట్వీట్ చేసింది. భూకంప కేంద్రం ఉపరితలం నుంచి 10 కిలో మీటర్ల లోతులో ఉన్నట్టు వెల్లడించింది.
అప్పట్లో ఆదిలాబాద్ జిల్లాలో భూకంపపం
2022లో అక్టోబరు 12న రాత్రి భూమి కంపించింది. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్‌లో భూమి షేక్ అవ్వడంతో ప్రజలంతా బయటకు పరుగులు తీశారు. ఉట్నూర్లోని, వజీర్ పురా, మోమిన్ పురా, ఫకిర్ గుట్టా ప్రాంతాల్లో ఈ పరిస్థితి కనిపించింది. రాత్రి 11:12 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భూమి కంపించడంతో తమ ఇళ్ళలో ఏదో కదిలినట్లుగా అనిపించిందని, వెంటనే అందరం బయటకు పరుగులు తీశామని స్థానికులు వివరించారు.
13 జులై 2022 నెల్లూరు, కడపలో కంపనలు
13 జులై 2022లో నెల్లూరు, కడప జిల్లాల్లో భూకంపం సంభవించింది. ఉదయం 5.20గంటలకు 3 సెకన్లపాటు భూమి కంపించింది. మర్రిపాడు మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, కండ్రిక, పడమట నాయుడుపల్లి, చిలకపాడు, కృష్ణాపురం తదితర గ్రామాల్లో భూకంపం వచ్చింది.
2021 అక్టోబర్‌లో భూ కంపం
2021 అక్టోబర్‌లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లి సమీపంలో సాయంత్రం 6:49 గంటలకు 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. రామగుండం, జగిత్యాల జిల్లాలలో ప్రకంపనలు వచ్చాయి. లక్షేటిపేట, గోదావరి పరివాహక ప్రాంతాల్లో దాదాపు 3 సెకన్లు భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలో వస్తువులు కింద పడ్డాయి.
26 Jul 2021 నాగర్ కర్నూల్‌లో భూమి కంపించింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో కూడా 26 Jul 2021లో భూ కంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. ఈ జిల్లాలోని అచ్చంపేట, లింగాల పరిసర గ్రామాలు, అమ్రాబాద్, ఉప్పునూత మండలాల్లో ఉదయం 5 గంటలకు రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భూ ప్రకంపనలతో భయపడ్డ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. తక్కువ తీవ్రతతో భూకంపం రావడం వల్ల ఆస్తి నష్టం కూడా పెద్దగా జరగలేదు.
2021 జులైలో కంపించిన చిత్తూరు
2021 జులైలో చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో అర్థరాత్రి భూకంపనలు భయపెట్టాయి. అర్థరాత్రి వేళ జనం భయంతో ఇళ్లనుంచి పరుగులు తీశారు. ఈడిగపల్లె, చిలకవారిపల్లి, షికారిపాళ్యం, కోటగడ్డలో 6 సెకన్ల పాటు భూమి కదిలింది. పెద్ద పెద్ద శబ్దాలు రావడం ఏం జరుగుతోందో అర్థంకాక కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు.