YSRCP: కేసుల వలలో వైఎస్ఆర్‌సీపీ ముఖ్య నేతలు - ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు- టీడీపీ రౌండప్ చేస్తోందా ?
Andhra Prdesh: వైసీపీ ముఖ్య నేతలందరిపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ముందస్తు బెయిల్స్ కోసం వారు న్యాయస్థానాలకు పరుగులు పెడుతున్నారు.
Cases are registered against all the main leaders of YCP: ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా కేసుల హడావుడి జరుగుతున్న సమయంలో అంత కంటే తీవ్రమైన కేసులు కొన్ని వెలుగులోకి వచ్చాయి.ఏపీలో మాఫియా తరహాలో గత పాలకులు వ్యవహరించి ఆస్తుల్ని లాక్కున్నారని సాక్షాత్తూ చంద్రబాబు ఆరోపించారు. ఆయన అలా ఆరోపించక ముందు కాకినాడ డీప్ వాటర్ పోర్టు చేతులు మారిన వైనంపై ఆరోపణలు వచ్చాయి. ఆ పోర్టు మాజీ యజమాని కేవీ రావు సీఐడీకి ఫిర్యాదు చేశారు. వాంగ్మూలం ఇచ్చారు. నాటి ప్రభుత్వ పెద్దలు తనను బెదిరించి రూ. నాలుగు వేల కోట్ల విలువైన కాకినాడ సెజ్, పోర్టుల్లోని వాటాలను రూ. 13 కోట్లుకు మాత్రమే రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు.దీనిపై సీఐడీ కేసులు నమోదు చేసి విజయసాయిరెడ్డి, విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డిలపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది.
పోర్టు చేతులు మారిన వైనంపై అనేక అనుమానాలు
మొదట కాకినాడపోర్టులో అక్రమాలు అని నోటీసులు జారీ చేశారు. తర్వాత డీల్ సెట్ అయిన తర్వాత అవన్నీ తప్పుడు ఆరోపణలు అని గుర్తించామని నోటీసులు వెనక్కి తీసుకున్నారు. కానీ డీప్ వాటర్ పోర్టు అతి తక్కువకు ఈ మధ్యలో చేతులు మారిపోయింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడేఈ డీల్ పై ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పాత యజమాని కెవి రావు సీఐడీకి ఫిర్యాదు చేయడంతో అసలు కథ ప్రారంభమయింది. ఈ పోర్టును అతి తక్కువకు ఔరో రియాల్టీగా మారిన అరబిందో రియాల్టీ దక్కించుకుంది. ఇది విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడి కంపెనీ. వైవీ సుబ్బారెడ్డి అప్పట్లో ఉభయగోదావరి జిల్లాల ఇంచార్జుగా ఉండేవారు. ఆయనకు కుమారుడు విక్రాంత్ రెడ్డి.అరబిందో యజమాని శరత్ చంద్రారెడ్డిలపై కేసులు నమోదయ్యాయి. పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
Also Read: Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
నిజానికి ఇలాంటి కేసులు అన్నీ జగన్ దగ్గరకే చేరే అవకాశం ఉంది. అంతిమ లబ్దిదరు ఆయనేనని దర్యాప్తు సంస్థలు గుర్తించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే లిక్కర్ కేసుల వ్యవహారంలో జగన్ నేరుగా లబ్ది పొందారని రేపోమాపో సంచలనాత్మక వివరాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు. ఇక ఇసుక స్కాంలోనూ ఇదే తరహా విచారణ జరుగుతోంది. ఇప్పటికే రఘురామపై కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో జగన్ మీద కేసు నమోదు అయింది. జగన్ తో పాటు ముఖ్య నేతలందరిపైనా విచారణలు అంతర్గతంగా జరుగుతున్నాయి. అందుకే చాలా మంది సైలెంట్ అయిపోయారు.కుదిరితే పార్టీలు మారిపోతున్నారు.ఆ చాన్స్ లేని వాళ్లు అసలు కనిపించడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా అనేక మంది వైసీపీ ముఖ్య నేతలు సైలెంట్ గా ఉంటున్నారు.
ప్లాన్డ్ గా రౌండప్ చేస్తున్న అధికార పార్టీ
కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి నేతల వరకూ గత ఐదేళ్ల కాలంలో చేసిన వ్యవహారాలపై ప్లాన్డ్ గా రౌండప్ చేస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందరూ కేసుల వలలో చిక్కుకుంటున్నారు. బెయిల్స్, ముందస్తు బెయిల్ కోసం లీగల్ టీంను ఎప్పటికప్పుడు రెడీగా ఉంచుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.గతంలోలా రాత్రికి రాత్రి అరెస్టు చేసే ప్రయత్నాలు చేయడం లేదు. వారికి న్యాయపరమైన అన్ని అవకాశాలను వినియోగించుకునే అవకాశం ఇస్తున్నారు. ఎలాంటి రిలీఫ్ రాకపోతే అరెస్టు తప్ప మరో మార్గం లేకుండా పోతోంది. కస్టోడియల్ టార్చర్ కేసులో మాజీ సీఐడీ ఓఎస్డీ విజయ్ పాల్ సుప్రీంకోర్టు వరకూ వెళ్లేందుకు అవకాశం కల్పించారు. ఇప్పుడు ఆయన జైల్లో ఉన్నారు. గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్‌సీపీ నేతలు విచ్చలవిడిగా దాడులు, దౌర్జన్యాలు, అవినీతికి పాల్పడ్డారని వాటిపై సాక్ష్యాలు బహిిరంగంగానే ఉన్నాయని టీడీపీ ఎలా వదిలివేస్తుందని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా వైసీపీ నేతలు మాత్రం కేసుల వలలో రోజు రోజుకు చిక్కిపోతున్నారు.