Vizag Andhra University News : ఆంధ్రా యూనివర్శిటీలో లైంగిక వేధింపుల కలకలం - కేసులో లిక్కర్ కిక్ కూడా ! తవ్వే కొద్దీ ...
ఆంధ్రా యూనివర్శిటీలో ఓ ప్రొఫెసర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలతో ఏయూలో జరుగుతున్న వ్యవహారాలన్నీ బయటకు వస్తున్నాయి. లిక్కర్ వ్యాపారం, పీహెచ్‌డీ అమ్మకాలు వంటి ఆరోపణలు వస్తున్నాయి.
Vizag Andhra University News : ఆంధ్రా యూనివర్సిటీలో ఓ ప్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా వస్తున్న ఆరోపణల వ్యవహారంలో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆంధ్రా యూనివర్సిటీలో హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్ సత్య నారాయణ పై రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఘటక్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. జాతీయ మహిళా కమిషన్ కు రీసెర్చ్ స్కాలర్ సోనాలి ఫిర్యాదు చేశారు. ప్రీ - టాక్ వైవా కోసం రెండు లక్షలు డిమాండ్ చేశారని, 75 వేలు తీసుకున్నారని, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఫిర్యాదు లో సోనాలి పేర్కొన్నారు. మిగతా డబ్బు చెల్లించలేదని తన భర్త పై ఎస్ సీ,.ఎస్టీ కేసు పెట్టీ బ్లాక్ మెయిల్ చేశారని సోనాలి ఆరోపించారు. లైంగిక వేధింపులపై ఏయూ రిజిస్ట్రార్, వీసీకు కూడా ఫిర్యాదు చేసినా ... స్పందించ లేదని చెబుతున్నారు.
సోనాలి ఘటక్ ఎవరో కూడా తెలియదన్న ప్రొ.సత్యనారాయణ
ఆంధ్రా యూనివర్సిటీ హిందీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఎన్ సత్య నారాయణ ఈ ఆరోపణలపై స్పందించారు. స్కాలర్ సోనాలి మా డిపార్ట్మెంట్ లో ఎప్పుడూ అడుగుపెట్టలేదు...ఆ అమ్మాయి ఎవరో మాకు తెలియదని ప్రకటించారు. ఎగ్జిక్యూటివ్ కోటాలో జాయిన్ అయ్యిందని.. ఎన్ రోల్ కూడా కాలేదన్నారు. నా తప్పుంటే...నన్ను సస్పెండ్ చెయ్యండి అని వైస్ చాన్సలర్‌కే చెప్పానని సత్యనారాయణ చెబుతున్నారు.
సోాానాలి భర్త బ్రోకర్ అని ఆరోపించిన సత్యనారాయణ
అయితే సోనాలి భర్తపై సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. సోనాలి ఎవరో తెలియదన్న సత్యనారాయణ ఆమె భర్త ఉజ్వల్ ఘటక్ యూనివర్సిటీ లో లిక్కర్ వ్యాపారం చేస్తున్నాడని ఆరోపించారు. డిఫెన్స్ లో ఉన్న పరిచయాలతో యూనివర్సిటీ లో లిక్కర్ పంచుతాడని.. వైస్ ఛాన్సలర్ ల కాన్ఫరెన్స్ లో 50 మంది వీసీ లకు మందు బాటిళ్లు పంచానని చెప్పుకుంటాడని సత్యనారాయణ ఆరోపించారు. ఏ అర్హత. లేకున్నా యూనివర్సిటీ లో ఒక నెల రోజులు శానిటరీ డిపార్ట్ మెంట్ కు డీన్ గా చేశాడని ఆరోపించారు.
డబ్బులకు పీహెచ్‌డీలు అమ్ముకుంటున్నారని ఆరోపణలు
పీహెచ్‌డీ చేస్తున్న విద్యార్థులకు ఏయూ ఉన్నతాధికారులకు మధ్య ఒక బ్రోకర్ ఈ ఘటక్ అని ఆరోపించారు. పది మందిని తీసుకొచ్చి నన్ను బెదిరించి వాళ్ళావిడ పీహెచ్‌డీ పేపర్స్ పై సంతకం పెట్టించుకున్నారన్నారు. భయపడి వీసీ దృష్టికి తీసుకెళితే తనకే సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. యూనివర్సిటీలో ప్రొసీజర్ లకు విరుద్ధంగా చాలా వ్యవహారాలు జరుగుతున్నాయ్...యూనివర్సిటీ పెద్దల సపోర్ట్ తో ఉజ్వల్ ఘటక్ దందాలు చేస్తున్నాడని ఆరోపించారు.
యూనివర్శిటీలో అనేక అక్రమాలు - గవర్నర్‌కు ఫిర్యాదు
ఈ అంశంపై గవర్నర్ గారికి కూడా కంప్లైట్ ఇచ్చానని సత్యనారాయణ ప్రకటించారు. యూనివర్సిటీ లో 1400 PHD ల వరకూ అడ్మిషన్ లు ఈ మధ్య జరిగాయి . అవన్నీ ఎగ్జిక్యూటవ్ కోటా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినవేనన్నారు. వాటిలో చాలా వరకూ ఈ ఉజ్వల్ ఘటక్ తెచ్చినవేనని.. ఆంధ్రా యూని వర్శిటీ కి ఆదాయం తెస్తాడు అంటూ ఉజ్వల్ ను కొందరు వెనకేసుకు వస్తున్నారని సత్యనారాయణ మండిపడ్డారు.
సుప్రీంకోర్టు వరకైనా వెళ్తానంటున్న సత్యనారాయణ
యూనివర్శిటీలో రాజకీయ ప్రమేయం ఎక్కువై పోయిందని ఆరోపించారు. ఆంధ్ర యూనివర్సిటీ లో PHD లు అమ్మకం ఒక పెద్ద వ్యాపారంగా మారిందన్నారు. పెద్దల నుండి వచ్చే ఒత్తిడుల వల్ల నా పరిస్థితి లో వేరే వారు ఉంటే ఆత్మహత్య చేసుకునేవారని.. ఉజ్వల్ ఘటక్ కు అడ్డు చెప్పినందుకు నాపై అతని భార్య తో లైంగిక ఆరోపణల కేసు పెట్టించారు .ఆ విషయం అతను పోలీసుల ముందు ఒప్పుకున్నాడన్నారు. వెనక్కి తగ్గేదే లేదు...అవసరమైతే...సుప్రీం కోర్ట్ కు వెళ్తానని చెబుతున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనాత్మకం అవుతోంది.