Vizag News: 12kmకి హెలికాఫ్టర్ ప్రయాణం, పిచ్చి తుగ్లక్ పనులు సీఎం మానుకోవాలి: విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్మెత్స విష్ణుకుమార్ రాజు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
Vishnu Kumar Raju on CM Jagan: ప్రపంచంలో ఎన్నడూ చూడని వింతలను సీఎం జగన్మోహన్ రెడ్డి చేష్టల్లో చూస్తున్నామని బీజేపీ ఉపాధ్యక్షుడు పెన్మెత్స విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) ఎద్దేవా చేశారు. కేవలం 12 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి హెలికాఫ్టర్ ను వాడడం, ప్రజల వద్దకు రాకపోవడం లాంటివి ఆయన్ను ఘనుడిగా మార్చాయని అన్నారు. సొంత ఇంటిలో జరిగిన హత్య విషయంలో గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చిన ఘనుడు జగన్ రెడ్డి అని దుయ్యబట్టారు. ఇక అసలు విషయానికొస్తే ఎంపీ అవినాష్ రెడ్డి సిబిఐ ఎదుట అప్రూవర్ గా మారితే దోషులు శిక్ష అనుభవిస్తారని అన్నారు. విశాఖపట్నంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెన్మెత్స విష్ణుకుమార్ రాజు (Vishnu Kumar Raju) మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ విశాఖ నగరంలో కూడా జగన్మోహన్ రెడ్డిలా అధికారులు కూడా ప్రవర్తిస్తున్నారని, ప్రధానంగా సిరిపురం కూడలిలో ఉన్న దత్ ఐలాండ్ వద్ద వైసీపీ నాయకుడి నిర్మాణ స్థలానికి రోడ్డు సూల ఉందని సిరిపురం నుండి వచ్చేవారు VIP రోడ్డులోకి, అలాగే VIP రోడ్డు నుండి సంపత్ వినాయగర్ రోడ్డుకు వెళ్లే సిగ్నల్ జంక్షన్ ను మూసివేసి వన్ వే గా మార్చారని అన్నారు. దత్ ఐలాండ్ బిల్డింగ్ ముందు ఉన్న రోడ్డును నైట్ మార్కెట్ ఫుడ్ కోర్ట్ గా మార్చడమనేది ప్రస్తుత ప్రభుత్వ పిచ్చి ఆలోచన అని, ఇటువంటి పిచ్చితుగ్లక్ పనులు మానుకొని, ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని అన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర మేడపాటి మాట్లాడుతూ.. ఈ నెల 27వ తేదీన రావలసిన బీజేపీ రాష్ట్ర నూతన అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఈనెల 28 వ తేదీన ఉదయం ఢిల్లీ నుండి విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారని తెలిపారు. అక్కడి నుండి భారీ ర్యాలీతో బయలుదేరి ఎన్ఏడీ జంక్షన్ - మర్రిపాలెం - కంచరపాలెం మెట్టు - 80 ఫీట్ రోడ్డు - మహారాణి పార్లర్ - అక్కయ్యపాలెం హైవే - మద్దిలపాలెం - ఇసుకతోట - ఎంవీపీ డబుల్ రోడ్ మీదుగా బీజేపీ జిల్లా కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు. ఉదయం 11:00 గంటలకు పార్టీ కార్యాలయంలో పురందేశ్వరి ప్రెస్ మీట్ నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం VMRDA చిల్డ్రన్స్ అరేనాలో ఉత్తరాంధ్ర జిల్లాల జోనల్ సమావేశానికి హాజరవుతారని తెలిపారు.
ఇటీవల జీవీఎంసీ పరిధిలోని ఆరిలోవ 11వ వార్డు సెక్టర్ - 4 లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో సామాజిక భవనాన్ని నిర్మిస్తుండడాన్ని తప్పుబట్టారు. తక్షణమే జీవీఎంసీ కమిషనర్, నగరపాలక మేయర్ స్పందించి ఆ కట్టడాన్ని కేవలం ఆసుపత్రి అవసరాలకు, రోగుల సహాయకులకు ఉపయోగపడే వెయిటింగ్ హాల్ గా మార్చాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రెస్ మీట్ లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ మహిళా మోర్చా జోనల్ ఇంచార్జి వత్సవాయి రోహిణి పాల్గొన్నారు.