Alluri Sitharama Raju District News: రోడ్డు కోసం డోలీలు, గుర్రాలతో ప్రజల వింత నిరసన
Alluri Sitharama Raju District News: అల్లూరి సీతరామరాజు జిల్లా, అనంతగిరి మండలంలో తమ హక్కుల కోసం గిరిజనలు నిరసన బాట పట్టారు. తమ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలంటూ డిమాండ్ చేశారు.
Alluri Sitharama Raju District News: అల్లూరి సీతరామరాజు జిల్లా, అనంతగిరి మండలంలో తమ హక్కుల కోసం గిరిజనలు నిరసన బాట పట్టారు. తమ గ్రామాలకు రోడ్డు సదుపాయం కల్పించాలంటూ డిమాండ్ చేశారు. గిరిజన గ్రామాలైన బల్లగరువు నుంచి దాయెర్తి, మడ్రబు గ్రామాలకు రోడ్డు పనులు మొదలు పెట్టాలని కోరుతూ 5 కిలోమీటర్లు గుర్రాలు, డోలీలతో పాదయాత్రగా వెళ్లి నిరసన తెలిపారు. కరకవలస నుంచి నిరసన ప్రారంభించి రాచకిలం, గుర్రాల బైలు, పీచు మామిడి, కోటగరువు, గుమ్మంతి, దాయిర్తి మీదుగా మడ్రబ్ వరకు పాదయాత్ర చేశారు.
ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ.. తమ సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కలెక్టర్ గిరిజన గ్రామాలను సందర్శించాలన్నారు. అనంతగిరి మండల కేంద్రానికి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న పినకోట, పెద్దకోట, జీనపాడు పంచాయతీలు పరిధిలో మడ్రేవు, తునిసీబు, దాయర్తి, గుర్రాలు బైలు, గుమ్మంతి, పీచు మామిడి, కరకవలస, రాచకలం, రెడ్డిపాడు, కోటగరవు గ్రామాలు ఉన్నాయి. ఇందులో 2000కిపైగా ఆదివాసి గిరిజనులు నివసిస్తున్నారు. వారు ఓట్లు వేయాలంటే 30 కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే 10 కిలోమీటర్ల కిలోమీటర్లు డోలి మోతలు తప్పవు.
గత ఏడాది డోలి మోసుకుంటూ రోడ్డు మార్గానికి తీసుకువెళ్తే, ఆలస్యం అవ్వడంతో దేవరపల్లి హాస్పిటల్‌లో ఇద్దరు, కేజీహెచ్‌లో ముగ్గురు గురిజనులు మరణించారు. రోడ్డు లేకపోవడంతో రేషన్ బియ్యం తీసుకోవాలంటే 30 కిలోమీటర్లు నడవాల్సిందే. గ్రామ సచివాలయం వెళ్లాలంటే 30 కిలోమీటర్లు ప్రయాణించాలి. బ్యాంకు సేవలకు సైతం 30 కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి ఉంది. వీటిలో 15 కిలోమీటర్లను గిరిజనులు గుర్రాలపైనే ప్రయాణిస్తారు. ఆరు గ్రామాల్లో స్కూళ్లు ఉన్నాయి. ఆరు గ్రామాల్లో అంగన్వాడీ సెంటర్లు ఉన్నాయి. జగనన్న ఇల్లు కట్టుకోవాలంటే 30 కిలోమీటర్ల నుంచి గుర్రాల మీద ఇసుక తోలుకోవాల్సిన పరిస్థితి ఉంది.
ఆయా గ్రామాలకు 2017-18 సంవత్సరంలో ఉపాధి హామీ పథకం ద్వారా కోటి రూపాయలు రోడ్డు నిర్మాణానికి మంజూరు చేశారు. ఫారెస్ట్ అనుమతులు కూడా ఉన్నాయి. 20 లక్షలు ఖర్చుపెట్టి రోడ్డు ఫార్మేషన్ ఏర్పాటు చేశారు. 2022 మార్చి 2న ఉమ్మడి జిల్లా కలెక్టర్ అక్కడి గ్రామాలను సందర్శించి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.1.40 కోట్లు నిధులు మంజూరు చేశారు. అలాగే పీవీటీజీ గిరిజనులకు జీసీసీ డిపో, అంగన్వాడీ కేంద్రం, మంచి నీరు కోసం 70 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారు. రోడ్డు నిర్మాణం చేయడానికి, మెటీరియల్ రావడానికి తాత్కాలిక నిర్మాణాలు సైతం జరిగాయి.
స్థానిక ఎంపీపీ, జెడ్పీటీసీ దాయార్థి గ్రామానికి వచ్చి కొబ్బరికాయ కొట్టి రోడ్డు నిర్మాణం పనులను ప్రారంభించారు. అయితే నేటికీ రెండు సంవత్సరాలు అవుతున్నా, రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించలేదని PVTG ఆదివాసి గిరిజన సంఘం ఆరోపించింది. సమస్య పరిష్కారానికి ఈనెలాఖరులో గుర్రాలు, డోలీలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేయాలని నిర్ణయించినట్లు గిరిజన నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల సంఘం 5వ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా గౌరవాధ్యక్షుడు గోవిందరావు, మడ్రాబు కొండతాంబిలి నర్సింగరావు, పీవీటీజీ ఆదివాసీ గిరిజన సంఘం కన్వీనర్ సుధాకర్, రాచకిలం గ్రామాన చెందిన గేమ్మల జన్మరాజు, కరకవలస గ్రామానికి చెందిన కొర్ర సుబ్బారావు, గుమ్మంతి గ్రామానికి చెందిన కొర్ర జమ్ములు, ఆదివాసి మహిళలు పాల్గొన్నారు.