Vizag TDP : రుషికొండ విధ్వంసంపై టీడీపీ నిరసన - ఉక్కుపాదం మోపిన పోలీసులు !
విశాఖలో టీడీపీ నేతల నిరసనలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రుషికొండ వైపు వెళ్లకుండా ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.
Vizag TDP : ఉత్తరాంధ్ర సమస్యలపై పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు ప్రయత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఒక రోజు ముందుగానే ఉత్తరాంధ్ర కీలక నేతలందర్నీ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రిషికొండను పిండి చేసి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మిస్తున్నారని.. ముందుగా ఆ ప్రాంతాన్ని పరిశీలించాలని టీడీపీ నేతలు నిర్ణయించారు. నిరసన కార్యక్రమాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ నేతలంతా పాల్గొనాలని నిర్ణయించారు. నగరంలో సెక్షన్ 30 అమలులో వున్నందున అనుమతి ఇవ్వలేమని పోలీసులు టీడీపీ నేతలు చెప్పారు. కానీ టీడీపీ నేతలు మాత్రం నిరసన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఉత్తరాంధ్ర కు చెందిన టీడీపీ నేతలను ముందుగానే హౌస్ అరెస్టులు చేసారు.
రుషికొండ వైపు ఎవరూ వెళ్లుకండా కట్టడి చేసిన పోలీసులు
రుషికొండ ప్రాంతంలో బారీగా పోలీసుల మొహరించారు. నార్త్ సబ్ డివిజన్ లో 30 యాక్ట్ ఉందని పోలీసులు వెల్లడించారు. ఎవ్వరు ర్యాలీ, మీటింగ్స్ నిర్వహించకూడదని పోలీసు అధికారులు స్పష్టం చేసారు. ఎవ్వరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. విశాఖ రుషికొండ కి వెళ్లేందుకు సిద్ధం అయిన ఎమ్మెల్యే చినరాజప్ప తో పాటుగా టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనితను పోలీసులు అడ్డుకున్నారు.ఉత్తరాంధ్ర సమస్యలపై టీడీపీ పోరుబాట కార్యక్రమాన్ని సీఎం జగన్ అడ్డుకోవడం అప్రజాస్వామికమని చిన రాజప్ప ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ అండ్ కో ఉత్తరాంధ్రను అడ్డంగా దోచుకుంటున్న వ్యవహారాలు బయటపడతాయనే ఈ కార్యక్రమాన్నిఅడ్డుకుంటున్నారని విమర్శించారు. రుషికొండ వైపు వెళ్లే మార్గాల్లో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.
విశాఖలో కీలక నేతలందరి ఇళ్లనూ ముట్టడించిన పోలీసులు
గురువారం తెల్లవారుజామునే పల్లా శ్రీనివాసరావు నివాసం దగ్గరకు చేరుకున్న పోలీసులు.. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి అనుసరించారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపైనా పోలీసులు నిఘాను తీవ్రతరం చేశారు. ఆయన ఇంటి దగ్గర కాపుకాసిన పోలీసులు ఆయన ఎక్కడి వెళ్తే అక్కడికి వెంటాడారు. పార్టీ కార్యకర్త అంత్యక్రియలకు వెళ్లినా అనుసరించారు. పోలీసుల చర్యల్ని రామకృష్ణబాబు తీవ్రంగా తప్పుపట్టారు. ఎమ్మెల్యే గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి సహా ఇతర ముఖ్య నేతల ఇళ్ల వద్ద నిఘా ఉంచారు.
టీడీపీ కార్యాలయంలో వినూత్న నిరసన తెలిపిన టీడీపీ నేతలు
పోలీసులను తప్పించుకున్న టీడీపీ కార్యాలయాన్ని చేరుకున్న పలువురు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. అనకొండ నోటిలో రుషికొండ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అనకొండ సీఎం.. అక్రమ నిర్మాణాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. నిరసనలో ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు పాల్గొన్నారు. మరోవైపు టీడీపీ పార్టీ కార్యాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఎవరూ బయటకు రాకుండా కాపలా కాశారు.