Bandi Sanjay Comments : అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటం సాంగుల్లా ఆడియో టేపులు - కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి అయిపోయినట్లేనన్న బండి సంజయ్ !
ఆడియో టేపులు ఐటం సాంగుల్లా రిలీజ్ చేశారని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. సీజ్ చేసిన డబ్బులు.. ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని బండి సంజయ్ ప్రశ్నించారు.
Bandi Sanjay Comments : ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలో కేసీఆర్ ప్రమేయం ఉందని ..కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి కావడం తధ్యమని బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ చేసిన తప్పులు, దోచుకున్న, దాచుకున్న సొమ్ము పాపం ఊరికే పోదన్నారు. త్వరలోనే సీఎం కుటుంబ రాజకీయ జీవిత చరిత్ర సమాధి కాబోతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్ కు ముమ్మాటికీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఒకవేళ కేసీఆర్ కు ప్రమేయం లేకుంటే లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కసీఆర్ తోపాటు ఈ వ్యవహారంలో ఉన్న ఎమ్మెల్యేలు సిద్ధమా? అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులు, కుటుంబ సభ్యులు సైతం లైడిటెక్టివ్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు.
సీజ్ చేశారని చెబుతున్న డబ్బులెక్కడ ఉన్నాయి ?
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో 100 కోట్లు సీజ్ చేశామని, బీజేపీ పాత్ర ఉందంటూ తమ పార్టీని అప్రదిష్టత పాల్జేసేలా వ్యవహరించారు. ఈ విషయంలో ఎలాంటి ఆధారాల్లేవు. మునుగోడు ఎన్నికల్లో మందు, మనీ, మాంసం పంచినా, ఓటుకు రూ.40 వేలు పంచినా, ఓటుకు తులం బంగారం ఇచ్చినా ప్రజలు టీఆర్ఎస్ ను నమ్మే పరిస్థితి లేదని సర్వేలన్నీ తేల్చడంతో... కేసీఆర్ ఎమ్మెల్యేల కొనుగోలు పేరుతో కుట్రలకు తెరలేపారని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని దుస్ధితి. మునుగోడు ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అయితదనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ఆ స్వామిజీ ఎవరో తెలవదు. ఆ గొట్టంగాళ్లు ఎవరో మాకు సంబంధం లేదు. బాధితులు టీఆర్ఎస్ పార్టీ నేతలు... పైసలకు అమ్ముడుపోయేందుకు సిద్ధమైంది వాళ్లే. ఫిర్యాదు చేసింది వాళ్లే.. డబ్బు తీసుకొచ్చిన వాహనాలు టీఆర్ఎస్ నేతలవే... ఇందులో బీజేపీకి సంబందం లేకపోయినా బురదచల్లి రాజకీయ లబ్ది పొందే కుట్రకు కేసీఆర్ తెర తీశారని ఆరోపించారు.
అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటం సాగుల్లా ఆడియో టేపులు
ఆడియో టేపుల పేరుతో మరో కొత్త సినిమా చూపే యత్నం కేసీఆర్ చేశారని బండి సంజయ్ ఆరోపించారు. అందులో ఏమీ లేదు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేసినట్లుగా చిత్తయిన కేసీఆర్ డ్రామాను రక్తికట్టించేందుకు ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారన్నారు. ఆ రోజు విడుదల చేసిన ఆడియో రికార్డులు దొంగవి... వాటిని రడీ చేయడానికి రెండ్రోజులు పట్టిందని కేసీఆర్ ఆరోపించారు. నిజమైన ఆడియో అయితే కేసీఆర్ స్వయంగా ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. లక్ష కోట్ల కమీషన్లు దండుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అసెంబ్లీ, ప్రగతి భవన్ సాక్షిగా ప్రొజెక్టర్ పెట్టి విజువల్స్ చూపించినట్లుగా ఆడియో టేపులను ఎందుకు విడుదల చేయలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో నిందితులుగా ఉన్న వాళ్లకు బీజేపీకి ఏం సంబంధం? ఈ వ్యవహారం ఎట్లా ఉందంటే... అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ తగిలించినట్లుగా ఉందన్నారు.
ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు ?
మేం ధర్మాన్ని, న్యాయాన్ని నమ్ముకున్నాం కాబట్టే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశామని బండి సంజయ్ తెలిపారు. అసలా ఎమ్మెల్యేలు ఎటుపోయినరు? మూడు రోజులుగా మిస్సింగ్. బయటకు ఎందుకు రావడం లేదు? ప్రగతి భవన్ కు ఎందుకు పరిమితం చేశారు? నిందితులుగా పేర్కొన్న వారిని ఏసీబీ కోర్టు ముందు ప్రవేశపెడితే... ఆధారాల్లేవని రిమాండ్ ను కూడా కో ర్టు తిరస్కరించినా టీఆర్ఎస్ నేతలకు బుద్ది రావడం లేదని మండిపడ్డారు. నిజంగా నిజాయితీ ఉంటే 3 రోజులుగా ఆ ఎమ్మెల్యేలు బయటకు ఎందుకు రావడం లేదు? గంప కింద కోడిలా ఎందుకు కప్పి పెట్టారు. అసలు వాళ్లను ఎందుకు దాస్తున్నట్లో చెప్పాలన్నారు. దక్కన్ కిచెన్ హోటల్ వద్ద సీసీ పుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదన్నారు. ఢిల్లీలో సీఎంను కలిసిన వారి సీసీ పుటేజీ వివరాలు బయటపెట్టడం లేదు ఎందుకు? అనుమానితుల, సదరు ఎమ్మెల్యేల, నిందితులుగా పిలవబడుతున్న వారి కాల్ లిస్ట్ ను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు.