TDP Protests: టీడీపీ పోరాటం ఉధృతం, బుధవారం నుంచి ఏపీ వ్యాప్తంగా రిలే నిరాహారదీక్షలు
TDP Protests: ఏపీ మాజీ సీఎం టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పార్టీ నేతలు పోరాటాన్ని ఉధృతం చేయనున్నారు.
TDP Protests:
ఏపీ మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ ను నిరసిస్తూ పార్టీ నేతలు పోరాటాన్ని ఉధృతం చేయనున్నారు. ఈ మేరకు బుధవారం (సెప్టెంబర్ 13వ తేదీ) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రిలే నిరాహారదీక్షలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రతిరోజూ ఒక మండలం చొప్పున అన్ని మండలాల నాయకులతో నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో నిరాహారదీక్ష శిబిరం ఏర్పాటు చేసి రిలే నిరాహారదీక్షలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు.
నిరాహారదీక్ష జరిగే శిబిరం వద్ద సామాన్య ప్రజల నుంచి చంద్రబాబు అరెస్ట్ పై వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపే సందేశంతో ఉన్న కరపత్రాలను విస్తృతంగా పంపిణీ చేయనున్నారు టీడీపీ నేతలు. ఈ రిలే నిరాహార దీక్షలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో పాటు అన్ని అనుబంధ సంఘాల నాయకులు పాల్గొని సీఎం జగన్, ఏపీ ప్రభుత్వం చర్యలను ప్రజల్లో ఎండగట్టాలని నిర్ణయించారు.
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్, పార్టీ భవిష్యత్ కార్యచరణపై రాష్ట్ర వ్యాప్తంగా 13 ఉమ్మడి జిల్లాల్లో టీడీపీ సమావేశాలు నిర్వహించింది. ఈ సందర్బంగా నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. మరోవైపు
హౌస్ రిమాండ్ కు అనుమతించాలని చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో పూర్తిభద్రత ఉంటుందని అడిషనల్ అడ్వకేట్ జనరల్ చేసిన వాదనలతో జడ్జి ఏకీభవించారు. సోమవారం ఉదయం నుంచి ఈ తీర్పుపై నెలకొన్న ఉత్కంఠకు మంగళవారం సాయంత్రానికి తెరపడింది.
చంద్రబాబుకు ప్రాణహాని ఉందని.. హౌస్ రిమాండ్‌కు ఇవ్వాలని సిద్ధార్థ్ లూథ్రా వాదనలు విన్పించారు. సెక్షన్ 167(2) కింద రెండు కస్టడీలు మాత్రమే ఉంటాయని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. జ్యుడిషియల్ కస్టడీ, పోలీస్ కస్టడీ మాత్రమే ఉన్నాయంటున్న ఏఏజీ.. నవలఖా తీర్పును పరిగణనలోకి తీసుకోవాలంటూ లూథ్రా వాదనలు విన్పించగా... నవలఖా తీర్పునకు.. ఈ కేసుకు సంబంధం లేదన్నారు ఏఏజీ సుధాకర్‌రెడ్డి. అయితే కొన్నేళ్లు జైల్లో ఉండి ఆరోగ్యం క్షీణించిన వారికి మాత్రమే.. హౌస్ కస్టడీ ఇస్తారని వాదించారు. హౌస్ ప్రొటెక్షన్ అనేది సీఆర్‌పీసీలో ఎక్కడా లేదన్న ఏఏజీ.. చంద్రబాబుకు కావాల్సినంత భద్రత పెట్టామని.. ఆరోగ్యంగానూ ఉన్నారని ఏఏజీ పొన్నవోలు కోర్టు దృష్టికి తెచ్చారు.
చంద్రబాబును తమ కస్టడీకి ఇవ్వాలన్న ఏపీ సీఐడీ పిటిషన్ ను ఏసీబీ కోర్టు బుధవారం విచారించనుంది. మరోవైపు చంద్రబాబు తరఫు లాయర్లు ఆయనకు జైలులో సెక్యూరిటీ ఉండదని కోర్టుకు చెప్పినా న్యాయమూర్తి సీఐడీ వాదనతో ఏకీభవించారు. హౌస్ రిమాండ్ పిటిషన్ కొట్టివేసిన తరువాత న్యాయమూర్తికి భద్రతను పెంచింది ప్రభుత్వం. ఇన్నర్ రింగ్ రోడ్డు సహా పలు కేసులతో చంద్రబాబును ఉక్కిరి బిక్కిరి చేయాలని వైసీపీ నేతలు యత్నిస్తున్నారు.