Visakha Ramanaidu Studio : విశాఖ రామానాయుడు స్టూడియోపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు - ఆ పని చేయవద్దని ఆదేశం !
Vizag Ramanaidu Studio : విశాఖ రామానాయుడు స్టూడియో స్థలాన్ని ప్లాట్లుగా చేసి అమ్మడంపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వానికి, ప్రతి వాదులకు నోటీసులు జారీ చేసింది.
Supreme Court Visakha Ramanaidu Studio : విశాఖ రామానాయుడు భూముల వ్యవహారంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. విశాఖ రామానాయుడు స్టూడియో భూములను లేఅవుట్ చేసి విక్రయించడంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. విశాఖలో రామానాయుడు స్టూడియోకు కేవలం సినిమా సెట్టింగ్‌ల కోసం.. సినిమా షూటింగ్‌ల కోసం మాత్రమే స్థలం కేటాయించారని కానీ అక్కడి స్థలం రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా వేసి అమ్ముకుంటున్నారని విశాఖ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టు ను ఆశ్రయించారు.
వెలగపూడి రామకృష్ణబాబు వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రామానాయుడు స్టూడియోకు 2003 సెప్టెంబర్ 13న ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్న అవసరాలకు మినహా ఎలాంటి కార్యకలాపాలకు ఈ భూములను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. రామానాయుడు స్టూడియోకు 2003లో సినీ అవసరాలకు వినియోగించేందుకు నాటి ప్రభుత్వం 35 ఎకరాల భూమి కేటాయించింది. కొండ మీద ఈ భూమి ఉంటుంది. ఇక్కడ కొంత స్థలంలో రామానాయుడు స్టూడియోను నిర్మించారు.
ఖాళీగా ఉన్న భూమిని కోస్టల్ నిబంధనలకు విరుద్దంగా లేఅవుట్ చేసి ఇతర కార్యకలాపాలకు వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ఆదేశాలను విశాఖ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు హైకోర్టులో సవాలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా హైకోర్టు కేసు కొట్టివేయడంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రామకృష్ణబాబు పిటిషన్‌పై జస్టిస్ అభయ్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.
భూమి ఎందుకు కేటాయించారు? ప్రస్తుతం లేఅవుట్ వేశారా?, కార్యకలాపాలు చేపట్టారా? అని పిటిషనర్ న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. విశాఖలో సినీ స్టూడియో నిర్మాణానికి భూములు కేటాయించారని, అందుకు అనుగుణంగా అక్కడ ఎలాంటి పనులు చేపట్టకుండా లేఅవుట్ వేసి అమ్మకాలకు సిద్దంగా ఉంచారని పిటిషనర్ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో ప్రభుత్వం 2003లో కేటాయించిన అవసరాలు మినహా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ధర్మాసనం ఆదేశించింది. ఈ ఏడాది మార్చి 11లోగా స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ఇతర ప్రతివాదులకు నోటీసులు పంపించింది.
ఏపీలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖలో పలు భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చాయి.అందులో రామానాయుడు స్టూడియో అంశం కూడా ఉంది. గతంలో ఈ స్టూడియో చేతులు మారిందన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత ఏం జరిగిందో కానీ నిర్మాత, స్టూడియో యజమాని దగ్గుబాటి సురేష్ బాబు ప్లాట్లు వేసి అమ్మకాలు ప్రారంభించారు. కానీ సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఇప్పుడా భూముల వ్యవహారం వివాదాస్పదంగా మారింది.