Srikakulam: ఇసుక వివాదంలో శ్రీకాకుళం తమ్ముళ్లు- క్లాస్ తీసుకుంటే తప్ప దారికి వచ్చేలా లేరు!
Srikakulam: శ్రీకాకుళంలో రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి కారు నిర్లక్ష్యంగా నడిపారని కొందరు చితకబాదారు. తీరా ఆ కేసు మూలాల్లోకి వెళ్తే అది ఇసుక తుపానుగా తేలింది.
Srikakulam : శ్రీకాకుళంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని కారులో నుంచి లాక్కొచ్చి కొందరు వ్యక్తులు చితక్కొట్టారు. ఏంటని ఆరా తీస్తే... కారు ర్యాష్‌గా డ్రైవ్ చేసి ముగ్గురు వ్యక్తులను గాయపరిచాడని చెప్పారు. కారు ఆపకుండా వచ్చేశాడని అన్నారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ కారు డ్రైవర్‌ను స్టేషన్‌కు తరలించారు. ఇదంతా విన్న వాళ్లకు, చూసిన వాళ్లకు ప్రమాదం, అనంతరం జరిగిన ఘటనగా అనుకుంటారు. అయితే కేసు మూలాల్లోకి వెళ్తే తప్ప అసలు కథ ఏంటో ఎవరికీ తెలియదు. దీని వెనుక ఇసుక వివాదం ఉందని చాలా మందికి అర్థం కాదు.
శ్రీకాకుళం జిల్లాలో ఈ మధ్య కాలంలో పలు ప్రాంతాల్లో అక్రమంగా దాచి ఉంచిన ఇసుకను అధికారులు సీజ్ చేశారు ఇప్పుడు ఈ వివాదానికి ఈ ఇసుక సీజ్ కారణమనే వాదన బలంగా ఉంది. ఇసుక దందాలో టీడీపీ శ్రేణులే జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఇప్పటికే ఆ పార్టీలోని వారే పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆముదాలవలస ఇసుక పంచాయితీ ఎఫెక్ట్ శ్రీకాకుళం నడిరోడ్డుపై కనిపించింది. కారును ర్యాష్‌గా డ్రైవ్ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి... ఇసుక అక్రమార్కులపై ఫిర్యాదు చేసిన సురేష్. ఆయన్నే బలగ సమీపంలో చితక బాదారు.
వంశధార, నాగావళినదిలో అడ్డగోలుగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేస్తున్న వ్యక్తులు అక్రమంగా నిల్వ చేస్తున్నారు. ఫలితంగా ఆమదాలవలస, నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం పరిధిలో అక్రమంగా రీచ్‌లు వెలిశాయి. శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు, దూసి రోడ్డు, జెమ్స్ ఆసుపత్రి వెనుక ఇసుక నిల్వలపై ఫిర్యాదు అందుకున్న అధికారులు దాడులు చేశారు. వాటిని సీజ్ చేశారు. సురేష్ ఫిర్యాదుతోనే అధికారులు చర్యలు తీసుకున్నారు. అందుకే బుధవారం సనపల సురేష్‌పై దాడి జరిగిందని అంటున్నారు.
ఇసుక దందా చేసే బ్యాచ్ సురేష్ కారును అడ్డగించి దాడికి యత్నించింది. వారి నుంచి తప్పించుకొనే ప్రయత్నంలో ముగ్గురిని గాయపరిచారు. దీంతో ఆగ్రహించిన వారంతా సురేష్ కారును వెంబడించి బలగ రోడ్డులో ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకొని దాడి చేశారు. కాలువలో పడేసి చితక్కొట్టారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులు చేరుకొని సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.
టూటౌన్ స్టేషన్ హైడ్రామా:
సురేష్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లగా అక్కడ హైడ్రామా నడిచింది. తనను ఆసుపత్రికి తీసుకెళ్లడం లేదని సెల్ఫీ వీడియో విడుదల చేసిన సురేష్.. అక్రమ ఇసుక తవ్వకాలపై ఫిర్యాదు చేశాననే కూన రవికుమార్ అనుచరులు దాడి చేశారని ఆరోపించారు. రవి కుమార్ వల్ల ప్రాణహాని ఉందన్నారు. సీసీ ఫుటేజ్ చూసి తప్పుంటే శిక్షించాలని సూచించారు.
సురేష్ నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే గాయాలపాలయ్యామని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు చెబుతున్నారు. ఆముదావలస వైసీపీ నేత అండతోసురేష్ సైకోలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై ఇరు వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివాదం ఎలా ఉన్నా... దీనికి బేస్ మాత్రం ఇసుక దందాయే అంటున్నారు జిల్లా ప్రజలు. గతంలో ఇసుక రుచి మరిగిన వర్గానికి ఇప్పుడు ఇసుక నుంచి డబ్బులు పిండుకుందాం అని చూసే వాళ్లకు మధ్య పోరుగా చెబుతున్నారు. అందుకే తమ్ముళ్లను కాస్త కంట్రోల్‌లో పెడితేనే ఇలాంటి వివాదలకు పుల్‌స్టాప్ పడుతుందని సలహా ఇస్తున్నారు.