Srikakulam Latest News : రంగరాజన్‌పై దాడి కేసులో శ్రీకాకుళం వాసుల అరెస్టు- రామదండు పేరుతో జిల్లాలో చేసిన దందాలపై చర్చ
Srikakulam Latest News : రంగరాజన్‌పై దాడికేసులో శ్రీకాకుళంజిల్లా వాసులు కూడా ఉన్నారు. వారిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోను వారు చేసిన దారుణాలపై చర్చ జరుగుతోంది.

Srikakulam Latest News : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్‌పై దాడి కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించింది. ఈ దాడి కేసులో అటు తెలంగాణాతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు పాలుపంచుకున్న తీరు చర్చనీయాంశంగా మారింది. రామ రాజ్యం సైన్యం వ్యవస్థాపకుడు కొవ్వూరి వీర రాఘవ రెడ్డితో తూర్పుగోదావరి, శ్రీకాకుళం, భద్రాచలం, నిజామాబాద్, ఖమ్మం ప్రాంతానికి చెందిన వ్యక్తులు చేతులు కలిపారు.
వీళ్లంతా కలిసి వివిధ ప్రాంతాల్లో పూజారులను బెదిరించి తమ రామరాజ్యం సైన్యంలో చేర్చించడం, వారి నుంచి వసూలు చేయడం వీరి పని. అదే ప్లాన్‌తో చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. రామరాజ్యం సైన్యానికి మద్దతు ఇవ్వాలని ఆర్థిక సాయం చేయాలని ప్రతిపాదించారు. దీనికి మద్దతు ఇవ్వలేదని వీరరాఘవ రెడ్డిసహా సైన్యం మొత్తం దాడి చేశారు.
పది నెలల క్రితం ఒకసారి రంగరాజన్‌ను కలిసి తమ ప్రతిపాదనలు వివరించారు. మొన్న రెండోసారి కూడా కలిసి మరోసారి వివరించారు. ఉగాది వరకు టైం ఇచ్చారు. అయినా సమ్మతించకపోవడంతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో కేసు నమోదు అయింది. రాఘవరెడ్డి సహా పది మందికిపైగా అనుచరులను అరెస్టు చేశారు.

కేసు విచారణ స్పీడప్ చేసిన తెలంగాణ పోలీసులు ఆ సైన్యంలో ఉంటున్న మరికొందరిపై ఫోకస్ చేశారు. అందులో భాగంగా అర్చకుడుపై దాడి చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లాలోని లావేరు మండలానికి చెందిన వారిని అరెస్ట్ చేశారు. లావేరు మండలం గుర్రాలపాలెం వాసి జనపాల గోవిందరావు, లావేరుకు చెందిన రేగాన మూర్తి, ఓ రాజకీయ పార్టీకి చెందిన లావేరు మండలాధ్యక్షుడు దేవిరెడ్డి వీరబాబు, తామాడకి చెందిన లక్కోజి వెంకటరమణ, లావేరు మండలం తాళ్ళవలసకి చెందిన ముప్పిడి వెంకటరమణ ఉన్నారు.
Also Read: మోదీ కన్వర్టడ్ బీసీ -అన్నీ తెలుసుకునే చెబుతున్నా - రేవంత్ సంచలన వ్యాఖ్యలు
స్థానిక పోలీసుల సహకారంతో తెలంగాణా పోలీసులు వారందరిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించేశారు. వారి అరెస్ట్‌తో స్థానికంగా వారు చేసిన దౌర్జన్యాలపై చర్చ జరుగుతోంది. రామదండుగా పరిచయం చేసుకుంటూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు. చర్చిలకు వెళ్ళి ఫాస్టర్‌లను బెదిరించడం, ఆలయ అర్చకుల వద్దకు వెళ్లి బెదరింపులకు పాల్పడుతున్నారు.
ఆదాయం వచ్చే ఆలయాల వద్దకు వెళ్ళి పెత్తనం చేసే ప్రయత్నం చేశారు. లావేరు మండలంలోని గుర్రాలపాలెం సమీపంలోని ఓ స్వామీజీని భయపెట్టి తరిమేసినట్లుగా స్థానికులు చెబుతున్నారు. నేటికి కూడా ఆ స్వామీజి వారితో పోరాడుతూనే ఉన్నారు. తామాడ చర్చి వద్ద వీరంతా హంగామా సృష్టించినట్లుగా సమాచారం. ఫాస్టర్‌ను బెదిరించి దాడికి పాల్పడడంతో లావేరు పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది.
ఆలయాలలో అర్చకులు ఎలా పూజలు చేయాలో కూడా ఆర్డర్లు వేస్తూ పెత్తనం చెలాయించేవారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ పేరుతో రామరాజ్యం స్థాపన కోసం తాము ఉన్నామన్నట్లుగా రెచ్చిపోతూ హల్ చల్ చేశారు. కాషాయ వస్త్రాలను ధరిస్తూ దౌర్జన్యాలకు పాల్పడ్డ చరిత్ర వారికి ఉన్నట్లుగా లావేరు మండల ప్రజలు చర్చించుంటున్నారు. వీళ్ళ ఆధ్వర్యంలో శిష్యబృందాలను ఏర్పాటు చేసుకుని వారి ద్వారా కూడా కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లుగా చెప్పుకుంటున్నారు.
ఇన్నాళ్లకు వీళ్ల పాపం పడింది. అందుకే చిలుకూరు బాలాజీ ఆలయం అర్చకుడిపై దాడి చేసి అరెస్టు అయ్యారని స్థానికులు అంటున్నారు. తగినశాస్తి జరిగిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మీ తప్పులు ప్రజలే డైరీల్లో రాసుకుంటున్నారు- వైఎస్ జగన్ సంచలన పోస్టు





















