Arasavalli Sun Temple: అభివృద్దికి నోచుకోని అరసవల్లి ఆలయం, నిధులన్నారు చివరి నిమిషంలో షాకిచ్చారు
Srikakulam News | శ్రీకాకుళం ప్రతి ఏడాది అరసవల్లి దేవస్థానంలో నిర్వహించే రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. 24 గంటల పాటు సాగే ఈ ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తరిస్తుంటారు.
Sri Sri Sri Suryanarayana Swamy Temple | ఆ కలియుగ ప్రత్యక్ష దైవాన్ని కనులారా చూసి తరించేందుకు భక్తులు విచ్చేస్తుంటారు. అటువంటి రథసప్తమి వేడుకలను వచ్చే ఏడాది నుంచి రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇతర పెద్దలు స్పందించి అరసవల్లి రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించారు. ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర పండుగగా రథసప్తమిని నిర్వహించడం సరే.. అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం అభివృద్ధి సంగతేంటన్న ప్రశ్నలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. దేశంలోనే నిత్య పూజలు అందుకుంటున్న సూర్యదేవాలయంగా గుర్తింపు పొందిన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం అభివృద్ధికి ఆమడదూరంలో నిలుస్తొంది. రాష్ట్రంలోని ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటిలో అభివృద్ధి పనులు జరుగుతున్నా అరసవల్లిలో మాత్రం ఎటువంటి అభివృద్ధి పనులు జరుగడం లేదు. ఇరుకురోడ్లు, అరకొర వసతులు, చాలిచాలని సౌకర్యాలతో ఇప్పటికీ అరసవల్లిలో దర్శనమిస్తున్నాయి. అరసవల్లి వెళ్లే భక్తులు ప్రతి ఏడాది పెరుగుతున్నారు. దేవస్థానం ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఆదాయానికి అనుగుణంగా దేవస్థానం హెూదా కూడా పెరిగింది. అంతా భాగానే ఉన్నా అరసవల్లి దేవస్థానానికి వచ్చే భక్తులకు మాత్రం సరిపడా సౌకర్యాలు ఇక్కడ అందుబాటులో లేవు.
దేవస్థానానికి సంబంధించిన గదులు ఇక్కడ లేవు. భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా టాయ్ లెట్స్ ఇక్కడ కరువే. కనీసం స్నానపు గదులు గాని,దుస్తులు మార్చుకునే వసతులు కూడా అరసవల్లిలో లేవు. విశ్రాంతి తీసుకునేందుకు అవసరమయ్యే మండపాలు లేవు. సూర్యదేవాలయంకి వచ్చే భక్తులు ఇంధ్రపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించే పరిస్థితి లేదు. వాహనాల పార్కింగ్ కి అనువైన స్థలాలు లేవు. ఇలా చెప్పుకుంటూ పోతే అరసవల్లి విచ్చేసే భక్తులకు అడుగడుగునా సమస్యలు ఎదురవుతునే ఉన్నాయి. సాధారణ రోజుల్లో ఆదివారం వచ్చే భక్తుల పరిస్థితే ఇలా ఉంటే ఇక ఉత్సవాలు జరిగే సమయంలోను స్వామి వారికి ప్రీతిపాత్రమైన మాఘ ఆదివారాలు ఇతరత్రా రోజులలోనైతే పరిస్థితులు చెప్పనక్కర్లేదు. కేవలం అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులే కాదు... స్థానికంగా నివాసరం ఉంటున్న వారు కూడా వసతుల లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ రోజుల్లో వారు ఇళ్ళకు వెళ్ళి రావడానికి కూడా అవస్థలు పడుతున్నారు. ఇక రథసప్తమి లాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు పనులన్నీ మానుకుని ఇళ్ళకే పరిమితం కావాల్సి వస్తుంది.
అమలుకి నోచుకోని మాస్టర్ ప్లాన్
అరసవల్లి దేవస్థానం అభివృద్ధికి సంబందించి మాస్టర్ ప్లాన్ను రూపొందించినా అది అమలుకు నోచుకోవడం లేదు. ఇప్పటికే పలుమార్పులు చేర్పులు చేసినా పనులు మాత్రం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. గతంలో దేవస్థానం ఎదురుగా ఇంధ్రపుష్కరిణి రోడ్డులో ఉండే షాపులను తొలగించడం మినహా ఇతరత్ర పనులు ఏమీ జరగలేదు. ఇంధ్రపుష్కరిణి అభివృద్ది పనులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. సువిశాల ప్రాంగణంగా అరసవల్లి దేవస్థానాన్ని తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో మాస్టర్ ప్లాన్ రెఢీ చేసినా నిధుల కొరతతో పనులు మాత్రం ముందుకు సాగలేదు. పాలకులు,అధికారులు మారుతున్నప్పుడు అంతా అరసవల్లిని అభివృద్ధి చేస్తామని, మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేసామని,పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తామని మాటలు చెబుతున్నా అవేవి కూడా ఆచరణకి నోచుకోలేదుదాతల సొమ్ములతో అడ్డగోలుగా పనులు
మాస్టర్ ప్లాన్ అమలుకి నోచుకోకపోవడంతో దాతలు అందజేసిన విరాళాలతో అరసవల్లిలో ఏది పడితే ఆ పనులు చేపడుతున్నారు. ఇప్పటికే ప్రధాన రహదారిపై ఇష్టారాజ్యంగా షెడ్లు ఇతరత్రా పనులు చేపట్టారు. ఇవి కొంత వరకూ భక్తులకు ఉపయోగపడుతున్నా కనీస వసతులైన టాయ్ లెట్స్, దుస్తులు మార్చుకునే గదులు, స్నానపు గదులు లాంటివి మాత్రం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మాత్రం చేయలేదు. సూర్యనారాయణ స్వామికి మొక్కులు చెల్లించుకునే వారు ఇక్కడ తలనీలాలు ఇస్తుంటారు. అటువంటి వారు ఇంధ్రపుష్కరిణిలో ఆ నీరు బాగాలేని పక్షంలో స్థానికంగా స్నానాలు చేస్తుంటారు. భక్తులు దుస్తులు మార్చుకునేందుకు సరైన సదుపాయాలు లేవు. అయినా భక్తులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై దేవస్థానం అధికారులు దృష్టి సారించలేదు. క్యూలైన్ల నిర్మాణానికి, రేకుల షెడ్లు ఏర్పాటు వంటి వాటికే ఖర్చు చేశారు. విలువైన స్థలాలు ఉన్నా... అభివృద్ది పనులు సున్నా...అరసవల్లి దేవస్థానానికి సంబందించి ఆలయం చుట్టు ప్రక్కల విలువైన స్థలాలు ఉన్నాయి. వాటిలో భక్తులకి అవసరమైన సౌకర్యాలు కల్పించే చాన్స్ కూడా ఉంది.
పక్కా భవనాలు నిర్మించలేకపోయినా భక్తులు సేద తీరేందుకు రేకుల షెడ్లు లాంటి మండపాలు, టాయ్ లెట్స్, స్నానపు గదులు,దుస్తులు మార్చుకునే గదులు వంటివి ఏర్పాటు చేయవచ్చు. అటువంటి నిర్మాణాలకు దాతలు ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయి. సిఎస్ఆర్ నిధులతోనైనా ఆయా పనులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఆ దిశగా అటు అధికారులు ఇటు పాలకులు ఎవ్వరూ కూడా ఇంతవరకూ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
దేవస్థానం నిధులతోనే రాష్ట్ర పండుగ
రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయం. మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న అధికారులు దేవస్థానం నిధులతోనే వాటిని నిర్వహించుకోవాలని స్పష్టం చేశారు. ఉత్సవాల నిర్వహణకి అవసరమైన నిధులు అరసవల్లి దేవస్థానంలో అందుబాటులో ఉన్నాయని కూడా పేర్కొంది. ఈ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కొంత మంది భక్తులు హర్షం వ్యక్తం చేయగా, దేవస్థానం నిధులనే పండుగకి ఉపయోగించుకోవాలని పేర్కోవడం పట్ల పెదవి విరుస్తున్నారు. తాజా ఉత్తర్వులతో అరసవల్లి అభివృద్ధి చేసేట్లు లేరని శ్రీకాకుళం జిల్లాలో హాట్ టాపిక్ అవుతోంది.
Also Read: Pawan Kalyan News: గిరిజనులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ - డోలీ మోతలకు చెక్ పెడుతూ రోడ్ల నిర్మాణం