Simhachalam: సింహాచలం స్వామివారి ఉంగరం పోయిందట, దొంగిలించారని మంత్రినే నిలదీసిన పూజారి - చివరికి ట్విస్ట్
Simhachalam Appanna Temple: మంత్రి తొలుత రాజగోపురం వద్దకు రాగానే పురోహితుడు ఆయన్ను తాడుతో బంధించి స్థానాచార్యుల ముందుకు తీసుకొచ్చారు. ఉంగరాన్ని ఎందుకు దొంగిలించారని నిలదీశారు.
Visakhapatnam: విశాఖపట్నం జిల్లా సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి వార్షిక తిరు కల్యాణోత్సవాలు వైభవంగా జరిగాయి. అయితే, ఆదివారం అప్పన్న స్వామి ఉంగరపు సేవ వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి ఉంగరం పోయిందంటూ కంగారు పెట్టేశారు. అక్కడికి అదే సమయంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కూడా రావడంతో ఆయన్ను కూడా అర్చకులు ప్రశ్నించారు. స్థానాచార్యులు టీపీ రాజగోపాల్ మంత్రిని ప్రశ్నిస్తూ.. ‘‘రాష్ట్రానికి మంత్రిగా ఉండి మీరు ఉంగరం దొంగతం చేస్తే ఎలాగండీ.. దయచేసి ఉంగరం ఇచ్చేయండి’’ అంటూ రాష్ట్ర బీసీ వెల్ఫేర్, సమాచారశాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణను నిలదీశారు.
మంత్రి తొలుత రాజగోపురం వద్దకు రాగానే పురోహితులు అలంకారి కరి సీతారామాచార్యులు.. మంత్రి చెల్లుబోయినను తాడుతో బంధించి స్థానాచార్యుల ముందుకు తీసుకొచ్చారు. దొంగలించిన ఉంగరం ఇచ్చేయాలంటూ స్థానాచార్యులు మంత్రిని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ కొంత సేపు ఆందోళనకర వాతావరణం నెలకొంది. తర్వాత మంత్రి మాట్లాడుతూ.. తనకు ఏ ఆపదా రాకూడదని ఆ స్వామి రక్ష (తాడు) వేశాడని, స్వామి అనుగ్రహం తనపైపై ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. వినోదోత్సవంలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవం అనంతరం మంత్రి స్వామివారి పల్లకీని మోశారు.
అసలు స్వామివారి ఉంగరం ఏమైంది?
ఈ నెల 11 నుంచి వారం రోజుల పాటు జరిగిన స్వామి వార్షిక కల్యాణోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి మృగయోత్సవం జరిగింది. దొంగిలించబడ్డ స్వామి ఉంగరాన్ని వెతికే ఘట్టాన్ని సింహగిరిపై ఆదివారం ఉదయం వినోదోత్సవంగా నిర్వహించారు. ఉంగరం పోయిందనే హడావుడి తర్వాత తీరిగ్గా అసలు విషయం బయటపెట్టారు అర్చకులు. ఉంగరం పోవడం అనేది స్వామివారి వసంతోత్సవాల్లో సరదాగా ఆడే నాటకమని చెప్పారు. ప్రతిఏటా సింహాచలం దేవస్థానంలో ఈ వేడుకను ఆనవాయితీగా నిర్వహిస్తారు. ఈ విషయం తెలియని భక్తులు బెదిరిపోయారు. పూజారులు అసలు సంగతి చెప్పడంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. స్వామివారి సేవలో పాల్గొనే అవకాశం దక్కిందంటూ సంబరపడ్డారు.
ఆగ్రహంతో ఊగిపోయిన భక్తులు, ఏడ్చిన మరికొందరు
స్వామివారి ఉంగరం పోయిందని అర్చకులు భక్తులను కూడా నిలదీయడంతో అసలు విషయం తెలియని భక్తులు విస్తుపోయారు. కొంత మంది పూజారులపై ఓ సందర్భంలో కోపంతో ఊగిపోయారు. ఇలాగే ఒకర్ని ఉంగరం దొంగ అనగానే ఆ భక్తుడు ఆగ్రహించారు. తాను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అని అలాంటి తననే ఇలా అనుమానిస్తారా అంటూ ఊగిపోయారు. అసలు విషయం తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు.