Sankranti 2024: పెద్ద పండగకు మోగిన నెలగంట- పల్లెల్లో సందడి చేస్తున్న హరిదాసులు, బుడజంగాలు
Sankranti 2024: నెలగంట కొట్టేశారు. పల్లెల్లో సందడి మొదలైంది. సంక్రాంతి వచ్చే వరకు జరిగే వేడుకలు చాలా ప్రత్యేకం. తరాలు మారుతున్నా ఇప్పటికీ వీటిని అనుసరిస్తున్న వాళ్లు ఉన్నారు.
Sankranti 2024: సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించటంతో ధనుర్మాసం ప్రారంభమైంది. దీనిని ధనుస్సంక్రమణమని, నెల పట్టడమని నానుడి. జనవరిలో మకర సంక్రమణం వరకు ధనుర్మాసం ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ఉదయాన్నే హరినామ సంకీర్తనలు పాడుతూ హరిదాసులు, డూడూ బసవన్నలతో విన్యాసాలు చేయిస్తూ గంగిరెద్దుల వారు, కొమ్మదాసులు, అంబ పలుకు జగదంబ పలుకు అంటూ బుడబుక్కల వారు శంఖం ఊదుతూ జంగమ దేవలు, ఏడాదికోమారం టూ పిట్టల దొరలు, భట్రాజులు, సోదెమ్మలు, పగటి వేషగాళ్లు, కనికట్టు చేసేవాళ్లు, గారడీ వారు వరుసగా క్యూ కడుతుంటారు. ఆయా జాతులవారు ఊళ్లను పంచుకుని తమతమ పరిధిలోని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తమ కళలను ప్రదర్శించి వినోదాన్ని పంచి యజమానులిచ్చే మొత్తాన్ని తీసుకువెళుతుంటారు. మారుతున్న కాలంలో ఆదరణ తగ్గి ఉపాధి నిమిత్తం వేరే జిల్లాలకు వెళ్లి వేర్వేరు వృత్తుల్లో స్థిరపడగా, కొందరు మాత్రం తమ వృత్తులను కొనసాగిస్తూ సంస్కృతి, సాంప్రదాయాలనుకాపాడుతున్నారు.
కొమ్ముదాసు గారడీ..
కొమ్ముదాసులు మాటల గారడీ చేస్తూ ఆకటుకుంటారు. పూర్వం చెట్లు ఎక్కి హడావిడి చేసేవారు. ఇప్పుడు భుజాన కొమ్మవేసుకుని తిరుగాడుతున్నారు. తాతల కాలం నుంచి వస్తున్న విద్యను ప్రదర్శిస్తూ సంప్రదాయ కళలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఊరూరు తిరుగుతున్నారు.
హరిదాసుల కీర్తనలు
శ్రీమద్రమా రమణ గోవిందో.. శ్రీమద్రమా రమణ గోవిందో హరి... అంటూ హరిదాసులు సందడి తెచ్చారు. నుదుట తిరునామం, తలపై అక్షయపాత్ర, చేతిలో చిడతలు, భుజాన తంబూర, పట్టు ధోవతి పంచెకట్టు, మెడలో మాల, కాళ్లకు గజ్జెలతో హరిదాసులు వీధివీధి తిరుగుతూ హరినామ సంకీర్తనలు చేస్తున్నారు. వారు నడయాడిన గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా ఉంటుందని ప్రజల అభిప్రాయం. హరిదాసు అక్షయ పాత్రలో బియ్యం పోస్తే తమ ఇంటిలో సిరిసంపదలు పొంగిపొర్లుతాయని ప్రజలు భావిస్తారు.
Also Read: అయిపోయింది అనుకున్న స్థితి నుంచి అధికార పీఠానికి.. టీడీపీకి మర్చిపోలేని సంవత్సరంగా 2024
గంగిరెద్దుల విన్యాసాలు...
అయ్యగారికి దండం పెట్టు... అమ్మగారికి దండం పెట్టు అంటూ యజమాని చెప్పే ఆదేశాలకు తలాడిస్తూ గంగిరెద్దులు చేసే విన్యాసాలు అబ్బురపరుస్తాయి. సంక్రాంతికి గంగిరెద్దులతో విడదీయలేని అనుబంధముంది. డూడూ బసవన్నల రూపంలో ఇంటి ముందుకొస్తేనే పండగ హడావిడి మొదలవుతుంది. గంగిరెద్దుల వారు సన్నాయిలు ఊదుతూ పాటలు పాడుతుంటే గంగిరెద్దుల మువ్వల చప్పుడు మధ్య తమ ఇంటికి లక్ష్మీ కళవస్తుందని పల్లె ప్రజలు భావన.
బుడబుక్కలవారు...జంగమ దేవరలు....
అంబ పలుకు... జగదంబ పలుకు అంటూ తలపాగా, కోటు ధరించి డమరుకం వాయిస్తూ కనిపిస్తారు బుడబుక్కల వాళ్లు. భవిష్యత్తు శుభాలు చెబుతూ వారు వస్తే మంచి కలుగుతుందని నమ్మకం. తలపాగా, పంచెకట్టు ధరించి ఓ చేతితో శంఖం ఊదుతూ మరో చేతితో గంట వాయిస్తూ జంగమ దేవరలు ఇంటింటికీ వస్తుంటారు. వీళ్లతో కూడా సిరులు వస్తాయని అంటారు.
ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ....
వైష్ణవాలయాల్లో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వేకువ జామునే మహిళలు పాశురాలు పఠిస్తూ గోదా, రంగనాథ స్వామికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గజగజ వణికే చలిని సైతం లెక్కచేయకుండా తెల్లవారు జామున 4 గంటల నుంచే మహిళలు పాశురాలు చదువుతూ గోదాదేవిని శరణు కోరుతున్నారు. రామాలయాలు, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల రోజులు ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సందడి నెలకొంటుంది.
Also Read: నేను మీసం తిప్పితే మీకు రోడ్లు రావు, నన్ను పని చేసుకోనివ్వండి : ఫాన్స్ కు పవన్ రిక్వెస్ట్