Andhra Pradesh: సినర్జిన్ ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం: మంత్రి అనిత
Andhra Pradesh News | ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. పరవాడలోని సినర్జిన్ కంపెనీలో మృతుల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున పరిహారం అందిస్తామని అనిత తెలిపారు.
Paravada Fire accident | అమరావతి: అనకాపల్లి జిల్లాలోని పరవాడలోని సినర్జిన్ కంపెనీలో జరిగిన ప్రమాదం బాధితుల కుటుంబాలకు రూ.1 కోటి రూపాయల చొప్పున పరిహారం ప్రకటించారు. సినర్జిన్ కంపెనీ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు పరిహారం అందించనున్నట్లు హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఇటీవల అచ్యుతాపురం సెజ్ లో ఎసెన్షియా, పరవాడలోని సినర్జిన్ కంపెనీలో అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ రెండు ప్రమాదాల బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకుందని చెప్పారు. కానీ ఆ పరిశ్రమల్లోని కార్మికులు, సిబ్బందికి తాము అండగా నిలిచినా, వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి, విశాఖకు వెళ్లి బాధితులను పరామర్శించి అండగా నిలిచినట్లు పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కంపెనీలను ఆదేశించినట్లు చెప్పారు. హోం మంత్రిగా తాను ఈ రెండు ప్రమాద ఘటనల్ని ప్రత్యక్షంగా పర్యవేక్షించినట్లు చెప్పారు.