Babu Rushikonda Tour : రుషికొండకు వెళ్లకుండా చంద్రబాబు అడ్డగింత - అనుమతి లేదన్న పోలీసులు !
రుషికొండ వెళ్లకుండా చంద్రబాబు బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదన్నారు.
ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విశాఖలో రుషికొండ ప్రాంతాన్ని పరిశీలించేందుకు చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. విశాఖలో కార్యకర్తల సమావేశం ముగిసిన తర్వాత పార్టీ నాయకులతో కలిసి రుషికొండ ప్రాంతానికి చంద్రబాబు బయలుదేరారు. ఇటీవల రుషికొండ చుట్టూ తవ్వకాలు జరిపారు. గతంలో ఆ కొండపై ఉన్న టూరిజం కాటేజీలను కూల్చివేశారు. రుషికొండ మొత్తాన్ని తొలిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ప్రాంతాన్నిత పలు పార్టీల నేతలు పరిశీలిస్తున్నారు కూడా. అయితే అనూహ్యంగా చంద్రబాబు బృందం రుషికొండను పరిశీలించడానికి వెళ్లాలని నిర్ణయించడంతో పోలీసులు ఉలిక్కి పడ్డారు.
చంద్రబాబు కాన్వాయ్‌ను ఎండాడ వద్ద నిలిపివేశారు. రుషికొండను పరిశీలించడానికి అనుమతి కావాలన్నారు . పోలీసుల తీరుపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రుషికొండ చూసేందుకు పోలీసుల పర్మిషన్ ఎందుకని ప్రశ్నించారు. నలభై ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్నారు. రుషికొండకు వెళ్తామంటే ఎందుకు భయపడుతున్నారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో తాము ఎప్పుడూ ఇలా చేయలేదన్నారు. మా పాలనలో పోలీసులు ఇలా వ్యవహరించలేదని గుర్తు చేశారు. కాన్వాయ్‌ను వెనక్కిపంపాలని పోలీసులు ప్రయత్నించారు.కానీ చంద్రబాబు అంగీకరించలేదు.
టీడీపీ కంటే మెరుగైన పాలన - శ్రీకాకుళంలో చంద్రబాబు విమర్శలకు ధర్మాన కౌంటర్
పలువురు పార్టీ నేతలు అడ్డగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. కొంత సమయం తర్వాత చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు వెనక్కి పంపారు. అయితే అదే సమయంలో కొంత మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రుషికొండ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు హైరానా పడ్డారు. వారిని పోలీసులు ఎక్కడిక్కకడ అరెస్ట్ చేశారు. పోలీసులకు వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌ను వెనక్కి పంపడంతో ఉద్రిక్తత తగ్గింది
వైద్య ఆరోగ్యశాఖలో ఎలాంటి తప్పులు క్షమించం, ఉదయగిరి ఘటనపై స్పందించిన మంత్రి విడదల రజిని
టూరిజం పేరుతో రుషికొండను మొత్తం తొలిచేసి ఆ వ్యర్థాలను కూడా సముద్రతీరంలో పారబోస్తున్నారని.. పర్యావరణ నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారని కొంత కాలంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. రూ. కోట్ల విలువైన టూరిజం కాటేజీల్ని కూల్చేసి కొత్తగా ఏం కట్టాలనుకుంటున్నారో కూడా స్పష్టత లేదు. అయితే కొండను శరవేగంగా తవ్వేస్తున్నారు. ప్రస్తుతం రుషికొండ చుట్టూ తవ్వేశారు. మధ్యలో భాగం మాత్రమే ఉంది. దాన్ని ఉంచుతారో తొలగిస్తారో స్పష్టత లేదు.