Minister Vidadala Rajini : వైద్య ఆరోగ్యశాఖలో ఎలాంటి తప్పులు క్షమించం, ఉదయగిరి ఘటనపై స్పందించిన మంత్రి విడదల రజిని
Minister Vidadala Rajini : నెల్లూరు జిల్లాలో పోస్టుమార్టానికి లంచం అడిగిన వైద్యుడిపై తీవ్ర చర్యలుంటాయని మంత్రి విడదల రజిని తెలిపారు. ఇప్పటికి వైద్యుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారని మంత్రి వెల్లడించారు.
Minister Vidadala Rajini : నెల్లూరు జిల్లా ఉదయగిరి ఘటనపై మంత్రి విడదల రజిని స్పందించారు. ఉదయగిరి ఘటనపై నెల్లూరు జిల్లా ఉన్నతాధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. నిరుపేద కుటుంబం నుంచి రూ.16 వేలు లంచం డిమాండ్ చేసిన డాక్టర్ సంధాని బాషాపై తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోస్టుమార్టం కోసం డాక్టర్. సంధాని బాషా లంచం డిమాండ్ చేయడం అమానవీయం అని మంత్రి రజిని అన్నారు. విషయం తన దృష్టికి వచ్చిన వెంటనే మెడికల్ ఆఫీసర్ సంధాని బాషాను సస్పెండ్ చేశామన్నారు. పోస్టు మార్టం కోసం ఏ ప్రభుత్వ ఆస్పత్రిలోనూ ఏ వైద్యుడికి కూడా ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం వైఎస్సార్సీపీ ప్రభుత్వం లక్ష్యమని తెలిపారు.
'వైద్య ఆరోగ్యశాఖలో ఎలాంటి తప్పిదాలనూ క్షమించం. అధికారులపై ఆరోపణలు వస్తే ఉపేక్షించం. వెనువెంటనే చర్యలు తీసుకుంటున్నాం. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయి. ఒక్క ఏప్రిల్ నెలలోనే తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ద్వారా 18,450 మంది తల్లులు, శిశువులను వారి గమ్యస్థానాలకు చేర్చాం. ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకునేలా తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు పనిచేస్తున్నాయి' అని మంత్రి విడదల రజిని అన్నారు.
అసలేం జరిగింది?
నిరుపేద కుటుంబం నుంచి పోస్టుమార్టం కోసం డబ్బులు డిమాండ్ చేశాడో డాక్టర్. తనవద్ద అంత డబ్బు లేవని తగ్గించాలని వేడుకుంది మృతుడి భార్య. అయినా వైద్యుడు కనికరించలేదు. చేసేదేంలేక చివరకు వైద్యుడు అడిగిన రూ.15 వేలు ఇచ్చి ఆత్మహత్య చేసుకున్న తన భర్త మృతదేహానికి పోస్టుమార్టం చేయించింది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై స్పందించిన మంత్రి వైద్యుడిపై సస్పెన్షన్ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు మండలం రాయకుంట గ్రామానికి చెందిన ముదిరాజ్ (27) కొండారెడ్డిపల్లి పనుల నిమిత్తం వచ్చాడు. ఆర్థిక సమస్యలతో మంగళవారం రాత్రి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
పోస్టుమార్టం చేసేందుకు ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి ముదిరాజ్ మృతదేహాన్ని పోలీసులు తరలించారు. అక్కడి డాక్టర్ సంధాని బాషా ఫోన్‌పే నంబరు ఇచ్చి రూ.15 చెల్లించాలని మృతుడి భార్య మునీశ్వరి తెలిపారు. తగ్గించమని కోరగా అందుకు వైద్యుడు ఒప్పుకోలేదు. రూ.15 వేలు తాను చెప్పిన నంబరుకు ఫోన్ పే చేయాలని, వాచ్‌మన్‌కు రూ.వెయ్యి ఇవ్వాలని సూచించారు. తగ్గించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. రూ.8వేలు ఇస్తామని బతిమిలాడినా పట్టించుకోలేదని ఆవేదన చెందింది. చివరికి డాక్టర్ అడిగినంత ఇచ్చి పోస్టుమార్టం చేయించానని వెల్లడించింది.