Kodi Ramamurthi Naidu: తెలుగు వారి బాహుబలి, కోడి రామ్మూర్తి నాయుడు - మరిచిపోయిన మహాబలశాలి!
Kodi Ramamurthi Naidu: మనకు కూడా ఒక బాహుబలి ఉన్నారని నేటి తరానికి తెలియక పోవచ్చు. కానీ, ఆయన గురించి తెలుసుకుంటే..మన రాష్ట్రానికి చెందినవారేనా? అని ఆశ్యర్యపోకతప్పదు.
Bahubali Kodi Ramamurthi Naidu: బాహుబలి. ఈ పేరు అందరికీ తెలిసిందే. అయితే.. మనకు కూడా ఒక బాహుబలి(Bahu Bali) ఉన్నారని నేటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చు. కానీ, ఆయన గురించి తెలుసుకుంటే.. మన దగ్గరే.. మన రాష్ట్రానికి చెందిన వారేనా? అని ఆశ్చర్యపోక తప్పదు. ఆయనే, కలియుగ భీముడిగా వేనోళ్ల కీర్తొందిన కోడి రామ్మూర్తినాయుడు (Kodi Ramamurthi Naidu). 20వ శతాబ్దపు తొలినాళ్లలో తెలుగునాట ప్రాచుర్యం పొందిన పేరు కోడి రామ్మూర్తి నాయుడు. చిన్న నాటి నుంచే ఆయన దేహధారుఢ్య పోటీల్లో పాల్గొని తన సత్తా చాటారు. జాతీయ, అంతర్జాతీయ వేదికలపై నిర్వహించిన కుస్తీ పోటీల్లో వ్యక్తిగతంగానే కాకుండా.. రాష్ట్రానికి ఎనలేని పేరు సముపార్జించి పెట్టారు.
ఎక్కడివారు?
ప్రపంచ ప్రఖ్యాత మల్లయోధుడిగా గుర్తింపు పొందిన కోడి రామ్మూర్తి నాయుడు (Kodi Ramamurthi Naidu).. 1882లో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం(Srikakulam dist Veeraghattam) మండలంలో జన్మించారు. ఈయన తండ్రి కోడి వెంకన్న నాయుడు (Kodi venkanna naidu) చిన్నప్పటి నుంచి రామ్మూర్తినాయుడిని ఎంతగానో ప్రోత్సహించారు. తల్లి చిన్నప్పుడే మరణించడంతో పెంపకం అంతా కూడా.. విజయనగరం (Vijayanagaram)లో ఉన్న చిన్నాన్న కోడి నారాయణస్వామి దగ్గరే జరిగింది. అప్పట్లో స్థానికంగా జరిగే కుస్తీలు, కర్రసాము వంటి వాటిని ఆసక్తిగా వీక్షించిన రామ్మూర్తినాయుడు.. తన అభిరుచిని చిన్నాన్నకు వ్యక్తపరచడంతో ఆయన రామ్మూర్తిని ప్రోత్సహించారు.
ఇంతింతై అన్నట్టుగా..
రామ్మూర్తి నాయుడు ఎదుగుదల.. ఇంతింతై అన్నట్టుగా సాగింది. విజయనగరం జిల్లాలో ఒక వ్యాయామశాలలో చేరి దేహ ధారుడ్యాన్ని (Body Building) పెంచుకోవడంతో పాటు మల్లయుద్ధంలోనూ తర్ఫీదు పొందారు. ఒకవైపు సాధారణ విద్యను అభ్యసిస్తూనే.. మరోవైపు మల్లయుద్ధం (Boxing), దేహదారుఢ్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. దీంతో ఆయన చిన్నవయసులోనే మల్లయుద్ధంలో ఆరితేరేస్థాయికి చేరుకున్నారు. 21 సంవత్సరాల వయసులోనే ఛాతిపై ఒకటిన్నర టన్నుల బండరాయిని మోసి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. నెమ్మది నెమ్మదిగా.. 3 టన్నుల భారాన్ని మోయగలిగే స్థాయికి చేరుకున్నారు.
వ్యాయామ విద్య కోసం..
సాధారణంగా ఉన్నత విద్య కోసం.. పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు వెళ్లినట్టే అప్పట్లో కోడి రామ్మూర్తి నాయుడు కూడా.. వ్యాయామ విద్య కోసం.. ఉమ్మడి మద్రాస్ స్టేట్(Madras State)లో రాజధానికి వచ్చారు. సుదీర్ఘ దూరంవచ్చి మరీ ఆయన మద్రాసులోని సైదాపేట కాలేజీలో ఏడాది పాటు వ్యాయామంలో శిక్షణ తీసుకున్నారు. అనంతరం.. వ్యాయామ విద్యనే ఆయన వృత్తి(Ocupation)గా ఎంచుకున్నారు. దీనిలోనే సర్టిఫికెట్ పొందారు. అంతేకాదు.. ఆశ్చర్యకర విషయం ఏంటంటే.. చిన్నాన్న చేర్పించిన, విజయనగరంలోని తాను చదివిన హైస్కూలు(High School)లోనే కోడి రామ్మూర్తి నాయుడు వ్యాయామ ఉపాధ్యాయుడిగా చేరారు.
అబ్బురపరిచిన విన్యాసాలు
ఒకవైపు వ్యాయామ ఉపాధ్యాయులు(Teacher)గా ఉంటూనే కోడి రామ్మూర్తి నాయుడు మరోవైపు.. సర్కస్ కంపెనీని కూడా ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ.. మల్లయుద్ధం, దేహ ధారుఢ్యం వంటి ప్రదర్శనలు ఇచ్చేవారు. విజయనగరంలో పొట్టి పంతులు(Pottu panthulu) అనే మిత్రుని సహకారంతో సర్కస్ కంపెనీ నెలకొల్పారు. పలుచోట్ల ప్రదర్శనలిచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారు. శరీరానికి ఉక్కు సంకెళ్లు బిగించుకుని.. ఊపిరి బిగించి.. వాటిని తునాతునకలు చేయడంలో రామ్మూర్తి నాయుడును మించిన వారు లేరనే పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు.. రెండు కార్లను రెండు భుజాలకు ఇనుప గొలుసులతో కట్టించుకుని.. వాటిని శరవేగంగా నడపమనేవారు. కానీ, కార్లు కదిలేవి కాదు. ఇక, చూసేందుకే భయమనిపించే.. ఏనుగును తన ఛాతీపై ఎక్కించుకుని.. కొన్ని నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ బరువంతా మోసేవారు. ఇలా.. గ్రామ గ్రామానా రామ్మూర్తి.. తన బాహుబలి విన్యాసాలతో ప్రజలను ఎంతో ఆకట్టుకున్నారు.
ఎంతో మందికి శిక్షణ
కోడి రామ్మూర్తినాయుడు తెలుగు రాష్ట్రంలో ఎంతో మందికి వ్యాయామంలోనూ.. దేహ దారుఢ్యంలోనూ శిక్షణ ఇచ్చారు. ఇప్పటికీ చాలా జిల్లాల్లో ఏర్పాటుచేసిన వ్యాయామశాలలకు ఆయన పేరునే పెట్టారు. ఆయన విగ్రహాలు సైతం ఆయా వ్యాయామశాలల్లో ఏర్పాటు చేశారు.
జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతి
కోడి రామ్మూర్తినాయుడు.. జాతీయ అంతర్జాతీయ(Inter national) వేదికలపై ఎన్నోప్రశంసలు అవార్డులు దక్కించుకున్నారు. నాటి వైస్రాయ్, విక్టోరియా మహారాణి, మదన్ మోహన్ మాలవీయ లాంటి స్వాతంత్య్ర సమార యోధుల నుంచి ప్రశంసలందుకున్నారు. స్పెయిన్ లో అత్యంత జనాదరణ కలిగిన bull fight ను తిలకించి తాను కూడా బరిలోకి దిగి ఆబోతు తోకను పట్టుకొని అవలీలగా రింగ్ అవతలకు విసిరి పారేసి.. తెలుగు తేజం సత్తా చాటి చెప్పారు.
గుర్తింపు దక్కిందా?
వ్యాయామ విద్యను దేశవ్యాప్తం చేయడంలోనేకాదు.. ఎంతో మంది యువతను ప్రోత్సహించి, దేశ, విదేశాల్లో దేశ కీర్తిని చాటిన రామ్మూర్తి నాయుడికి దక్కాల్సిన గౌరవం.. దక్కాల్సిన మన్నన లభించలేదని అంటారు. ఈ గజబలుడి స్మృత్యర్థం రెండు మూడు విగ్రహాలు, ఒక సంస్థ తప్ప ఏమీ లేవు. మన దేశ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఈ బలాఢ్యుని కౌశలానికి, జాతీయ వాదానికి స్మృతి చిహ్నంగా అమరావతిలో ఒక క్రీడా శిక్షణ సంస్థ నెలకొల్పితే సముచితంగా ఉంటుందనేది క్రీడాకారుల మాట.