విశాఖ నడిరోడ్డు మీద అర్ధరాత్రి అమ్మాయిల పడిగాపులు... ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ అరాచకాలకు నరకం చూసిన ప్రయాణికులు
ట్రావెల్స్ అరాచకాలకు ఆదివారం విశాఖలో 40 మంది ప్రయాణికులు బలి పశువులు అయ్యారు. నడిరోడ్డు మీద అర్ధరాత్రి వరకు ఎదురు చూపులు చూసి చూసి చివరకు మోసపోయామని ఘటన ఇది.
ప్రయాణికులను నమ్మించి నిట్టనిలువునా మోసం చేసిన ఘటన ఆదివారం ఏపీలోని విశాఖపట్నం నగరంలో జరిగింది. ఇది ప్రైవేటు ట్రావెల్స్ ఆగడాలు, అరాచకాలకు 40 మందికి పైగా ప్రజలు బలి పశువులుగా మారిన ఘటన. అర్ధరాత్రి వరకు నమ్మించి చివరకు నట్టేట ముంచడంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో గమ్యం చేరుకోవడానికి ట్రై చేసిన వారు కొందరు అయితే, ముఖ్యంగా విశాఖ నడిరోడ్డు మీద అర్ధరాత్రి వరకు ఎదురు చూసి చూసి, పడిగాపులు గాచి చివరకు ఇంటికి వెళ్లిన మహిళలు మరికొందరు. పూర్తి వివరాల్లోకి వెళితే...
ఎనిమిదిన్నరకు బయలుదేరాల్సిన బస్సు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ఉద్యోగాలు చేస్తున్న విశాఖ వాసులు ఎందరో ఉన్నారు. ఐటీ కంపెనీల్లో కావచ్చు లేదంటే మార్కెటింగ్ లేదా మరొక రంగంలో కావచ్చు... బతుకుదెరువు కోసం సొంతింటికి దూరంగా ఉద్యోగాలు చేస్తున్న ప్రజలు ఎందరో! ఉగాదితో పాటు రంజాన్ సైతం గత వారం రావడంతో మధ్యలో రెండు రోజులు సెలవులు పెట్టుకుంటే ఐదారు రోజులు కుటుంబ సభ్యులతో సంతోషంగా సమయం గడపవచ్చు అని సొంతిళ్లకు వెళ్లిన ఉద్యోగస్తులు వేల సంఖ్యలో ఉన్నారు. వాళ్లందరూ ఆదివారం తిరిగి భాగ్య నగరానికి ప్రయాణం అయ్యారు.
హైదరాబాద్ సిటీకి ట్రావెల్ చేసే జనాల రద్దీ ఆదివారం ఎక్కువ ఉండటంతో అదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచాయి. విశాఖ నుంచి హైదరాబాద్ సిటీకి స్లీపర్ క్లాస్ టికెట్ 2700 నుంచి 3700 వరకు పలికింది. డిమాండ్ అండ్ సప్లై అనుకుని అంత రేటు పెట్టి టికెట్ తీసుకున్న ప్రయాణికులకు ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ సర్వీసెస్ చుక్కలు చూపించింది. రాత్రి ఎనిమిది, ఎనిమిదిన్నరకు బయలుదేరాల్సిన బస్సు క్యాన్సిల్ అయినట్టు పదిన్నర దాటిన తర్వాత కస్టమర్లకు సమాచారం ఇచ్చింది. అప్పటి వరకు వాళ్లను నడిరోడ్డు మీద పడిగాపులు కాసేలా చేసింది.
గంట గంట అంటూ చివరకు ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి...
ఒక్కసారి బస్ అన్నాక మధ్యలో ట్రబుల్ ఇవ్వడం కామన్. జర్నీ స్టార్ట్ అయ్యాక బస్ బ్రేక్ డౌన్ కావడం లేదంటే మరొక సమస్య రావడంతో ప్రయాణికులను వేరే బస్సు ఎక్కించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. లేదంటే టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చి మధ్యలో ప్రయాణికులను దింపేసిన సందర్భాలు సైతం కొందరికి అనుభవమే. ఈ సమస్య మాత్రం వేరు. జర్నీ స్టార్ట్ కాకముందు ఇంటర్ సిటీ బస్ ట్రబుల్ ఇచ్చింది. దాంతో షెడ్యూల్ ప్రకారం ఎనిమిది గంటలకు స్టార్ట్ కావాల్సిన బస్ స్టార్ట్ కాలేదు. ఏడున్నరకు ప్రయాణికులకు ఆ సమాచారం ఇచ్చారు. 45 నిమిషాలు ఆలస్యంగా బస్ స్టార్ట్ అవుతుందని పేర్కొన్నారు. వాట్సాప్ మెసేజ్ చేయడంతో పాటు ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ ప్రతినిధి నుంచి ఫోన్ కూడా వచ్చింది. ఆ తర్వాత మొదలైంది అసలు కథ.
ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ సర్వీస్ నుంచి ఎనిమిది గంటలకు షెడ్యూల్ ప్రకారం బయలుదేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యంగా ప్రయాణం మొదలు అవుతుందని సమాచారం ఇచ్చారు. తొమ్మిదిన్నరకు మరోసారి సంస్థ ప్రతినిధులకు ఫోన్ చేయగా... ఇంకో గంట ఆలస్యం అవుతుందని సమాచారం ఇచ్చారు. చివరకు పదిన్నరకు ఫోన్ చేయగా... బస్ రిపేర్ అయ్యిందని, టెస్ట్ డ్రైవ్ చేస్తున్నారని సమాధానం తెలిపారు. ఆ తర్వాత పది నిమిషాలకు సంస్థ ప్రతినిధి ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఆ తర్వాత మెల్లగా సంస్థ నుంచి బస్ క్యాన్సిల్ చేశామని సమాచారం ఇచ్చారు.
ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ సర్వీస్ కస్టమర్ కేర్ నెంబర్ రాత్రి వేళల్లో పని చేయదు. ఆ సంస్థ ప్రతినిధుల ఫోన్స్ స్విచ్ఛాఫ్ వచ్చాయి. దాంతో చేసేది ఏమీ లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఆఫీసులకు వెళ్లాల్సిన మగవాళ్లు కొందరు క్యాబ్స్ మాట్లాడుకుని ట్రావెల్ చేశారు. విశాఖ ఎన్ఏడీ జంక్షన్ దగ్గర రాత్రి పదిన్నర వరకు తల్లిదండ్రులతో ఎదురు చూసిన ఓ అమ్మాయి తనకు తోడుగా మరో మహిళా ప్రయాణికురాలు లేకపోవడంతో క్యాబ్ ప్రయాణం చేయడానికి సంశయించి ఇంటికి వెనుదిరిగింది. ఈ విధంగా విశాఖలో మరో రెండు మూడు ప్రాంతాల్లో జరిగిందని సమాచారం అందింది. అర్ధరాత్రి వరకు విశాఖ నడిరోడ్డు మీద బస్ కోసం పడిగాపులు కాచిన అమ్మాయిలు ఇళ్లకు వెళ్లగా... అబ్బాయిలు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ చూసుకున్నారు.
Also Read: జగన్ మోహన్ రెడ్డి మీద రాయి వేసిన వాళ్లెవరో చెబితే రూ. 2 లక్షలు - పోలీసుల కీలక ప్రకటన
ఇంటర్ సిటీ స్మార్ట్ బస్ సంస్థ ఈ విధంగా ప్రయాణికులను నట్టేట ముంచిన ఘటనలు కొత్త కాదని, ఇదేమీ తొలిసారి కాదని తెలిసింది. గతంలో పలుసార్లు ఈ విధంగా చేసిందని ప్రయాణికుల నుంచి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం తిరుపతి నుంచి హైదరాబాద్ రావడానికి ఓ ఫ్యామిలీ టికెట్స్ బుక్ చేసుకోగా గంట తర్వాత క్యాన్సిల్ చేసినట్టు మెసేజ్ చేశారు.
Also Read: పవన్ కల్యాణ్ కు చెడ్డ పేరు తెస్తున్నారు - ట్రోలింగ్ మీద స్పందించిన కోన వెంకట్