విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ, ఏమైందంటే?
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. వాదనలు విన్న ధర్మాసనం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు. గతంలో విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్రం పాటించకుండా, రాజ్యాంగ బద్ధమో కాదో చెప్పకుండా ముందుకు వెళుతోందని లాయర్ యలమంజుల బాలాజీ వాదించారు. దాదాపు 9,200 మంది రైతులు భూములు కోల్పోయి నాలుగో తరం ఉద్యోగాల కోసం ఎదురు చూస్తుంటే.. ఉద్యోగ భద్రత కల్పించకుండా కేంద్రం విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదించారు.
విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అంశంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ప్రత్యామ్నాయాలు పరిశీలించకుండా ప్రైవేటీకరించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. ప్రైవేటీకరణ అంశంలో కేంద్రం ముందుకు వెళ్లకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఇందుకు స్పందించిన హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ ధాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. తుది విచారణను సెప్టెంబర్ 21వ తేదీకి వాయిదా వేసింది.
అసలీ వివాదం ఎందుకంటే..?
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌గా పిలిచే వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాదాపు 26 వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. దీని పేరు మీదే విశాఖ నగరానికి ఉక్కు నగరం అనే పేరు స్థిరపడింది. ప్రారంభంలో ఏడాదికి 3. 5 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో మొదలైన స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం 7. 3 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. ప్రత్యక్షంగా 17,500 మంది ఉద్యోగులూ, పరోక్షంగా మరో లక్షమంది ఈ స్టీల్ ప్లాంట్‌పై ఆధారపడి పని చేస్తున్నారు. అయితే ఈ సంస్థ నష్టాల్లో ఉందంటూ కేంద్ర ప్రభుత్వం తన వాటాను ఉపసంహరించు కోవడంతో ఏడాది క్రితం ఆందోళనలు మొదలయ్యాయి. స్టీల్ ఉత్పత్తుల్లో అనేక రికార్డులు సాధించిన స్టీల్ ప్లాంట్ 2015 నుంచి వరుసగా నష్టాలను చవిచూస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంత గనులు లేకపోవడమీ దీనికి ప్రధాన కారణమని కార్మిక సంఘాలు అంటున్నాయి. జిందాల్ లాంటి ప్రైవేటు సంస్థలకు గనులను కేటాయించిన ప్రభుత్వం... విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మాత్రం అలంటి పనులు చేయడంలేదంటున్నారు. సొంత గనులు లేకపోవడంతో ముడి ఖనిజాన్ని కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. అందుకే గత కొన్నేళ్లుగా సంస్థ నష్ఠాలను నమోదు చేస్తుందంటున్నారు. వాటిని సాకుగా చూపించి కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్‌ను పూర్తిగా ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేసింది.
5 వేల కోట్ల వరకు ష్టం వచ్చిందంటూ...
నిజానికి 2015 వరకూ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బానే ఉంది. కానీ ఉక్కు పరిశ్రమలో అంతర్జాతీయంగా వస్తున్నమార్పులు, ఐరన్ ఓర్‌ను ప్రైవేటుగా కొనుగోలు చెయ్యాల్సిన పరిస్థితి రావడంతో 2015-16 నుంచి 2020 వరకూ 5 వేల కోట్లు వరకు నష్టం వచ్చిందని కేంద్రం అంటుంది. ప్లాంట్ ఆధునికీకరణ, విస్తరణ చేపట్టడం వలన కూడా ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. అయితే దేశంలో స్టీలుకు డిమాండు పెరుగుతుండటంతో భవిష్యత్తులో మళ్లీ లాభాల బాటపట్టే అవకాశం ఉంది. కానీ ఈ టైంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణకు సిద్ధమైంది.
సమస్య పరిష్కారానికి బదులు అమ్మకం..
సమస్యకు పరిష్కారం చూపించాల్సింది పోయి సంస్థను అమ్మేస్తామనడం సరికాదని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు అంటున్నారు . స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం ఆంధ్రులు చేసిన త్యాగాలు అన్నీ ఇన్నీ కావు . 1971లో ఈ సంస్థ కోసం 64 గ్రామాల నుంచి దాదాపు 26 వేల ఎకరాల భూమిని సేకరించారు. ఇదిగాక కురుపాం జమీందార్ 6వేల ఎకరాలను విరాళంగా ప్రకటించారు. అయితే భూములు ఇచ్చిన కుటుంబాల్లో సగం మందికే ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వగలిగారు. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అది అందరిదీ అనే అభిప్రాయంతో ప్రజలు సర్దుకుపోయారు. ప్రతీ ఏటా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నుంచి టాక్సుల రూపంలో వేలకోట్లు కేంద్ర ప్రభుత్వానికి చేరుతున్నాయి. అయినప్పటికీ నష్ఠాల వంక చూపి స్టీల్ ప్లాంట్ అమ్మేయ్యాలని కేంద్రం చూస్తుందని ఉద్యోగులు, కార్మికులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఏర్పాటై పోరాటం చేస్తుంది .