మూడు రాజధానులపై సీఎం క్లారిటీ- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో జగన్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ కు 20 రంగాల పారిశ్రామికవేత్తల నుంచి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ ప్రకటించారు.
CM Jagan on AP Capital: విశాఖపట్నం రాజధాని అని మరోసారి సీఎం జగన్ ప్రకటన చేశారు. ఆ నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023లో మాట్లాడుతున్న సందర్భంగా ఈ ప్రకటన చేశారు. త్వరలోనే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోందని చెప్పారు. తాను కూడా త్వరలోనే విశాఖపట్నానికి మారతానని చెప్పారు.
ఏపీకి 13 లక్షల కోట్ల పెట్టుబడులు - సీఎం జగన్
Global Investors Summit 2023: మరోవైపు, ఆంధ్రప్రదేశ్ కు 20 రంగాల పారిశ్రామికవేత్తల నుంచి రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని సీఎం జగన్ ప్రకటించారు. ఈ పెట్టుబడుల వల్ల 6 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. 340 పెట్టుబడుల ప్రతిపాదనలు తమ ముందుకు వచ్చాయని.. 20 రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారని చెప్పారు. శుక్రవారం రూ. 8.54 లక్షల కోట్ల ఎంవోయూలు జరుగుతాయని వైఎస్ జగన్ ఈ సదస్సులో మాట్లాడుతూ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఆరు పోర్టులు, ఆరు ఎయిర్ పోర్టులతో అధిక మానవ వనరుల శక్తి ఏపీ కలిగి ఉందని సీఎం జగన్ పారిశ్రామిక వేత్తల దృష్టికి తీసుకెళ్లారు. దేశంలోనే అత్యధిక జీఎస్డీపీ వృద్ధి ఉన్న రాష్ట్రం ఏపీ అని సీఎం చెప్పారు.
ఆ కంపెనీలు ఇవీ..
ఎన్టీపీపీ ఎంవోయూ రూ. 1.20 లక్షల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ ఎంవోయూ రూ. 97,500 కోట్లు, శ్రీ సిమెంట్ ఎంవోయూ రూ. 5,500 కోట్లు, రెన్యూ పవర్ - ఇండోసాల్ - అరబిందో - శ్యామ్ మెటల్స్ - ఆదిత్య బిర్లా గ్రూప్ - అదానీ ఎనర్జీ గ్రూప్, పలు కంపెనీలు ఉన్నాయి.
దేశ ప్రగతికి ఏపీ కీలకంగా మారిందని గ్రీన్ ఎనర్జీపై ప్రధానంగా ఫోకస్ పెడుతున్నామని సీఎం జగన్ తెలిపారు. పారిశ్రామిక వేత్తల అభిప్రాయాలతో నెంబర్ వన్‌గా నిలిచామన్నారు. ఏపీలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్రం నుంచి ఎగుమతులు గణనీయంగా పెరగాయని గుర్తు చేశారు. పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామన్నారు.
పోర్టులకు దగ్గర్లోనే అపార భూములు
CM Jagan Speech in Visakhapatnam ‘‘ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. ఏపీ భౌగోళికంగా పరిశ్రమలకు బాగా అనుకూలం. ప్రకృతి అందాలకు కూడా విశాఖపట్నం నెలవు. 974 కిలో మీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఏపీకి ఉంది. ఏపీలో సులువైన ఇండస్ట్రియల్ పాలసీ ఉంది. పరిశ్రమలు నెలకొల్పుకొనేందుకు అపారమైన భూములు కూడా ఏపీలో ఉన్నాయి. ఓడరేవులకు (పోర్టులు) దగ్గర్లోనే భూములు కూడా చాలా పుషల్కంగా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 11 పారిశ్రామిక కారిడార్స్ ఉంటే అందులో 3 ఆంధ్రాలోనే ఉన్నాయి. సులభతర వాణిజ్య విధానం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా మూడేళ్లు నంబర్ వన్‌గా మేమే ఉన్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 540 సేవలు అందిస్తున్నాము.
ఇంకా త్వరలో విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాబోతోంది. త్వరలో విశాఖపట్నం నుంచే పరిపాలన సాగిస్తాం. స్కిల్ డెవలప్ మెంట్ కాలేజీలతో పారిశ్రామికాభివృద్ధి జరుగుతోంది. ఒక్క ఫోన్ కాల్‌తో సమస్యలు పరిష్కరిస్తాం. భవిష్యతులో గ్రీన్, హైడ్రో ఎనర్జీల్లో ఏపీదే కీలక పాత్ర కానుంది.