వైసీపీ మంత్రులు, నేతలు మరణశాసనం రాసుకుంటున్నారు: మాజీ మంత్రి గంటా
Bandaru Satyanarayana Arrest: వైసీపీ మంత్రి మాట్లాడిన మాటలకు టీడీపీ నేత స్పందించారు. అంతమాత్రాన బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరం అన్నారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.
Bandaru Satyanarayana Arrest:
నారా, నందమూరి కుటుంబసభ్యుల గురించి వైసీపీ మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంత అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడినప్పుడు పోలీసులు ఏమయ్యారు అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఇప్పుడు కూడా వైసీపీ మంత్రి మాట్లాడిన మాటలకు టీడీపీ నేత స్పందించారు. అంతమాత్రాన బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరం అన్నారు. ఈ చర్యలకు వైఎస్సార్ సీపీ తప్పక మూల్యం చెల్లించుకుంటుందన్నారు. ఎవరైనా మాట్లాడితే అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. దీనికి త్వరలోనే వైసీపీ ప్రభుత్వం తగిన మూల్లం చెల్లించుకోవాల్సిన రోజులు వస్తాయన్నారు.
మొన్న చంద్రబాబు నాయుడును సైతం ఇదే విధంగా అక్రమ కేసులో అరెస్ట్ చేశారు. ప్రజలు దీన్ని బ్లాక్ డే గా నిర్వహించుకున్నారు. ఈరోజు అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా సత్యమేవ జయతే అంటూ ఒక్కరోజు చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ దీక్ష చేపట్టగా ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా వి సపోర్ట్ బాబు అని, వి ఆర్ విత్ బాబు అని ట్రెండింగ్ అయిందన్నారు. వైసీపీ పతనానికి వాళ్లే మరణ శాసనం రాసుకుంటున్నారు. ఇందులో భాగంగానే బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అప్రజాస్వామికంగా అరెస్ట్ చేశారని గంటా శ్రీనివాసరావు అన్నారు. మాజీ మంత్రి బండారుకు వైద్య పరీక్షలు నిర్వహించి 24 గంటల్లోగా జడ్జి ఎదుట ప్రవేశపెట్టాలన్నారు.
మాజీ మంత్రి బండారు అరెస్ట్..
ఏపీ సీఎం, మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 1 రాత్రి నుంచి పరవాడలోని బండారు సత్యనారాయణ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు పోలీసులు సోమవారం నాడు మాజీ మంత్రి బండారును అరెస్టు చేశారు. సీఎం, మంత్రిని దూషించినందుకు గానూ ఆయనపై రెండు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని పోలీసులను నిలువరించే ప్రయత్నం చేయడంతో నోటీసులు ఇవ్వడానికి సాయంత్రం అయింది. మాజీ మంత్రి బండారుకు 41a, 42b కింద పోలీసులు నోటీసులు అందజేశారు. ఆ సమయంలో పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చివరగా రాత్రి బండారు సత్యనారాయణను పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి ప్రభుత్వాసుపత్రిలో వైద్య నిర్వహించాల్సి ఉంది. అయితే రూటు మార్చిన పోలీసులు హైవే మీదుగా గుంటూరుకు ఆయనను తరలిస్తున్నారు.
ఉద్రిక్తతల వేళ బండారు సత్యనారాయణ మూర్తికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. నేటి సాయంత్ర దీక్ష ముగిసిన అనంతరం మాజీ మంత్రి బండారుకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండాలని.. పోరాటాన్ని కొనసాగించాలని లోకేశ్ ఆయనకు చెప్పారు. అక్రమ కేసులు పెట్టే పోలీసులు భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని లోకేశ్ హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ తొత్తుల్లా వ్యవహరించే ప్రతి అధికారి వివరాలు నమోదు చేయాలని బండారు సత్యనారాయణ మూర్తికి సూచించారు. అంతకుముందు సాయంత్రం బండారు సత్యనారాయణ మూర్తి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నోటీసులు ఇవ్వకుండా తమను భయభ్రాంతులకు గురిచేశారని డీఎస్పీ సత్యనారాయణ, పోలీసులపై ఫిర్యాదు చేశారు.