AP Encounter Latest News: ఏపీలో భారీ ఎన్‌కౌంటర్.. ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు హతం: మహేష్ చంద్ర లడ్డా
ఏపీలో వరుసగా రెండో రోజు పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.

Encounter In Alluri Sitharamaraju district | విజయవాడ: ఛత్తీస్‌గఢ్ మావోయిస్టులు ఏపీలో తలదాచుకున్నారన్న సమాచారంతో పోలీసులు ఏపీలో వరుసగా రెండో రోజు కూంబింగ్ నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలో నక్సల్స్, పోలీసులకు మధ్య బుధవారం సైతం కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో సుమారు ఆరుగురి నుంచి ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లుగా అడిషనల్ డి.జి. మహేష్ చంద్ర లడ్డా తెలిపారు.
విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో మావోయిస్టులు ఛత్తీస్‌గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని వారి కదలికలపై నిఘా వర్గాలు ప్రత్యేక దృష్టి పెట్టాయి. ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న తరుణంలో మావోయిస్టులో ఛత్తీస్ గఢ్ అటవీ ప్రాంతాలను వదిలి ఏపీకి మకాం మార్చ ప్రయత్నం చేస్తున్నారు. దాంతో అల్లూరి సీతారామరాజు సహా ఇతర ఏజెన్సీ జిల్లాల్లో పోలిసులు మావోయిస్టుల కదలకలపై నిఘా పెట్టినట్లు తెలిపారు.
పక్కా సమాచారంతో ఆపరేషన్
నవంబరు 17న పోలీసులు కీలకమైన ఆపరేషన్ చేపట్టామని లడ్డా తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా నిన్న (నవంబర్ 18న) మారేడుమిల్లి ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు అగ్ర నాయకులలో ఒకరైన హిడ్మాతో పాటు మరో ఐదుగురు మృతి చెందారని తెలిపారు. అయితే, హిడ్మాను పట్టుకున్నాక చంపామనే ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని లడ్డా స్పష్టం చేశారు. మృతుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించామని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో నిన్న ఎన్‌కౌంటర్ లో చనిపోయిన మాడావి హిడ్మా, ఆయన భార్య, మరో నలుగురు మావోయిస్టుల మృతదేహాలు ఉన్నాయి. మృతదేహాలను నేడు వారి కుటుంబసభ్యులకు అప్పగించే అవకాశం ఉంది.
హిడ్మా బ్యాచ్ ఖేల్ ఖతం..
ఈ ఆపరేషన్లో భాగంగా ఎన్టీఆర్, కృష్ణా, కాకినాడ, కోనసీమ, ఏలూరు జిల్లాల నుంచి ఏకంగా యాభై మంది మావోయిస్టులను పట్టుకున్నామని అడిషనల్ డి.జి. మహేష్ చంద్ర లడ్డా వివరించారు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్ద సంఖ్యలో కీలక వ్యక్తులను ఒకేసారి పట్టుకోవడం ఇదే తొలిసారి అన్నారు. పట్టుబడిన వారిలో కేంద్ర, రాష్ట్ర, ఏరియా కమిటీ సభ్యులు, ప్లాటూన్ టీమ్ సభ్యులు ఉన్నారని, ఎక్కడా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఈ ఆపరేషన్‌లో 45 వెపన్స్, 272 రౌండ్స్, రెండు మ్యాగజైన్‌లు, 750 గ్రాముల వైర్ మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
తమ ఫీల్డ్ సిబ్బంది ప్రణాళిక ప్రకారం ఆపరేషన్‌ను పూర్తి చేశారని, ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ లడ్డా అభినందించారు. తమ ఇంటిలిజెన్స్ విభాగం ఈ విషయంలో చాలా బాగా పని చేసిందని ప్రశంసించారు. తెలంగాణలో ఇటీవల కొంతమంది మావోయిస్టులు సరెండర్ అవ్వడం వల్ల, ఆ సమాచారం తమ ప్రాంతాలకు వెళితే ఇబ్బందులు వస్తాయని భావించిన మావోయిస్టులు, కొన్ని రోజులు షెల్టర్ తీసుకునేందుకు ఏపీలోని పలు ప్రాంతాలను ఎంచుకున్నారని, మళ్లీ సమయం చూసి తమ ప్రాంతాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. తమకు ముందే సమాచారం వచ్చినా, వారి కదలికలు, కార్యకలాపాలపై నిఘా పెట్టి, అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ఒకేసారి అందరినీ పట్టుకోగలిగామని, వారి తదుపరి మూవ్‌మెంట్లు లేదా ప్లాన్ల గురించి మరిన్ని వివరాలు లేవని అడిషనల్ డీజీ మహేష్ చంద్ర లడ్డా తెలియజేశారు.






















