బుధవారం ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటన- భోగాపురం ఎయిర్‌పోర్ట్, టెక్‌పార్క్‌లకు శంకుస్థాపన
సీఎం జగన్ బుధవారం విశాఖ, విజయనగరంలో పర్యటించి భోగాపురం ఎయిర్‌పోర్టు, టెక్‌పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నారు.
ముఖ్యమంత్రి జగన్ బుధవారం ముందుగా విశాఖలో పర్యటించనున్నారు. అదానీ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లకు శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ అదానీ కూడా పాల్గొనబోతున్నారు. మధురవాడలో ఏర్పాటు చేయబోతున్న ఈ పార్క్‌లో అదానీ సంస్థ 14,634 కోట్ల పెట్టుబడి పెట్టనుంది.
ఉదయాన్నే సీఎం జగన్ తాడేపల్లిలో బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడ గౌతమ్ అదానీని రిసీవ్ చేసుకొని అక్కడి నుంచి విశాఖ చేరుకుంటారు. అక్కడ మధురవాడలో ఏర్పాటు చేయబోయే టెక్ పార్క్‌కు శంకుస్థాపన చేస్తారు.
130 ఎకరాల్లో నిర్మించే పార్క్‌లో 200 మెగావాట్ల డెటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ పార్క్, స్కిల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయబోతున్నారు. దీని వల్ల 24,990 మందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వం చెబుతోంది.
కాపులుప్పాడలో మరో డేటా సెంటర్, టెక్‌పార్క్‌కు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో 7,210 కోట్ల పెట్టుబడి రాబోతోంది. దీని వల్ల 20వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
మొత్తంగా బుధవారం శంకుస్థాపన చేయబోయే రెండు ప్రాజెక్టుల కారణంగా 22 వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయని... 45 వేలమందికిగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
విశాఖ పర్యటన అనంతరం విజయనగరంలో పర్యటిస్తారు. బుధవారం భోగాపురం ఎయిర్‌పోర్టుకు కూడా సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 3,500 కోట్ల రూపాయలతో ఈ విమానాశ్రయాన్ని నిర్మించనున్నారు. 2025 సెప్టెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం.
కొత్తగా నిర్మించే టెక్ పార్క్, భోగాపురం మధ్య ఆరులేన్ల రోడ్లు నిర్మాణానికి కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు కేంద్రం నుంచి అంగీకారం కూడా లభించిందని మంత్రి అమర్‌నాథ్ ప్రకటించారు. 6,500 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ ట్విన్ సిటీ మాదిరిగానే విశాఖ, విజయనగరం ఏర్పడబోతున్నాయని అన్నారు మంత్రి.