CM Jagan: వచ్చే రెండేళ్లలో లక్షకుపైగా జాబ్స్ - విశాఖలో సీఎం జగన్, ఏటీసీ టైర్స్ ప్లాంటు ప్రారంభం
CM Jagan: యొకొహోమా కంపెనీ రూ.1,200 కోట్లతో తన కార్యకలాపాల్ని మంగళవారం ప్రారంభించనుంది. ఈ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలోని ఏపీ సెజ్ లో కొన్ని పరిశ్రమలను ప్రారంభించారు. మరికొన్ని కొత్త యూనిట్లకు భూమి పూజ చేశారు. ఈ సెజ్‌లో యొకొహోమా కంపెనీ రూ.1,200 కోట్లతో తన కార్యకలాపాల్ని మంగళవారం ప్రారంభించనుంది. ఈ పరిశ్రమను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సెజ్‌లోనే రూ.1,002.53 కోట్లతో మరో ఎనిమిది పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అచ్యుతాపురం సెజ్‌లో తొలి దశలో రూ.1,384 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేశారు. రూ.816 కోట్లతో రెండో దశ పనులకు సీఎం జగన్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడారు.
వచ్చే రెండేళ్లలో లక్షకు పైగా ఉద్యోగాలు
‘‘జపాన్ కు చెందిన కంపెనీ 2020లో మన వద్దకు వచ్చింది. మేం అన్ని రకాల సపోర్ట్ ఇచ్చాం. 2021 ఫిబ్రవరిలో కంపెనీ పనులు ప్రారంభించగా, 15 నెలల కాలంలోనే ఉత్పత్తి దశకు చేరింది. మన సపోర్ట్ కు రెండో దశకు మొగ్గు చూపుతున్నారు. ఈ సెకండ్ ఫేస్ కూడా ఒక ఏడాదిలోనే పూర్తి చేస్తామంటున్నారు.
ఈ మూడేళ్ల కాలంలోనే 98 లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ రాష్ట్రానికి వచ్చాయి. 39,350 కోట్ల పెట్టుబడి పెట్టాయి. 60,541 మందికి ఉద్యోగాలు దక్కాయి. 31 వేల కోట్ల ఎంఎస్ఎంఈలను కూడా రూ.8 వేల కోట్లతో మరో లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాం. మరో రెండేళ్లలో 56 లార్జ్ మెగా ఇండస్ట్రీస్ రాష్ట్రానికి రానున్నాయి. లక్షకు పైగా మందికి ఉద్యోగాలు దక్కనున్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మనమే దేశంలో నెంబర్ 1 గా ఉన్నాం.’’ అని జగన్ మాట్లాడారు.
జపాన్‌కు చెందిన యొకొహోమా గ్రూప్‌నకు చెందిన ఏటీసీ టైర్ల తయారీ కంపెనీ ఉత్పత్తి కేంద్రం మొత్తం రెండు దశల్లో రూ. 2,200 కోట్ల పెట్టుబడి పెడుతోంది. దాదాపు రెండు వేల మందికి ఇక్కడ ఉద్యోగావకాశాలు దక్కనున్నాయి. 100 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న ఈ యొకొహోమా కంపెనీ 6 ఖండాల్లో 120 దేశాలలో విస్తరించి ఉంది. దేశంలో ఇప్పటికే తమిళనాడులోని తిరునల్వేలి, గుజరాత్‌లోని దహేజ్‌లో ఏటీసీ టైర్ల మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది. అచ్యుతాపురం యూనిట్ మూడవది.
ఏపీ సెజ్ లో పరిశ్రమలకు భూమి పూజ
వీటిలో 100 టీపీడీ కెపాసిటి కాగా మెస్సర్స్ పిడిలైట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పరిశ్రమ ద్వారా రూ.202 కోట్ల పెట్టుబడి రానుంది. దీనిద్వారా 380 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. వాటర్ ప్రూఫింగ్ ఉత్పత్తుల తయారీ, కోటింగ్, సీలెంట్స్ తదితర ఉత్పత్తుల తయారీ యూనిట్ విస్తరణకు కూడా సీఎం జగన్ భూమి పూజ చేశారు. మేఘ ఫ్రూట్ ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కార్బొనేటెడ్ ప్రూట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్, ప్రూట్ జ్యూస్‌ల టెట్రా ప్యాకింగ్, పెట్ బాటిల్స్ తదితర ఉత్పత్తుల బెవరేజెస్ యూనిట్‌ను సెజ్ లో నెలకొల్పుతారు. ఇప్పటికే మంగుళూరు, సంగారెడ్డిలలో యూనిట్లు ఉన్న ఈ కంపెనీ అచ్యుతాపురం సెజ్‌లో రూ.185.25 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇందులో దాదాపు 700 మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు.
మెస్సర్స్ ఐనాక్స్ ఎయిర్ ప్రొడక్ట్స్ ప్రెవేట్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ గ్యాసెస్ తయారీలో పేరుగాంచిన ఈ సంస్థ దేశంలో ఇప్పటికే 38 మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను నెలకొల్పింది. రూ. 145 కోట్ల పెట్టుబడితో లిక్విడ్ ఆక్సిజన్, లిక్విడ్ నైట్రోజన్, లిక్విడ్ ఆర్గాన్ తదితర ఉత్పత్తులను ఇక్కడ తయారుచేయనున్నారు. మెస్సర్స్ ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇప్పటికే హైదరాబాద్, పరవాడలలో మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లను ఏర్పాటుచేసిన ఈ సంస్థ ఇక్కడ రూ. 125 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది. విన్ విన్ స్పెషాలిటీ ఇన్సులేటర్స్ లిమిటెడ్ ,అత్యాధునిక సాంకేతికతతో కూడిన వోల్టేజ్ సిరామిక్ ఇన్సులేటర్స్, పాలిమెరిక్ ఇన్సులేటర్ల తయారీలో పేరుగాంచిన ఈ కంపెనీ దాదాపు రూ. 107.70 కోట్ల పెట్టుబడితో ఇక్కడ యూనిట్‌ను ఏర్పాటుచేయనుంది.