Vizag Steel Plant: ఆ ప్రధానుల మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ సాధించుకున్నాం: మంత్రి అమర్నాథ్
ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమాలను ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని.. ఇది సీఎం వైఎస్ జగన్ మాటగా చెబుతున్నానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వ మద్దతు ఉంటుందని, ఉక్కు కర్మాగార పరిరక్షణ కోసం భవిష్యత్తులో జరిగే ఉద్యమాలను ప్రభుత్వం ముందుండి నడిపిస్తుందని.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటగా చెబుతున్నానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు సోమవారం ప్లాంట్ ఆవరణలో నిర్వహించిన ఉక్కు ప్రజా గర్జన సభలో మంత్రి అమర్నాథ్ ప్రసంగించారు. విశాఖ హుక్కు.. ఆంధ్రుల హక్కు.. అన్న నినాదంతో ప్రారంభించిన ఆయన ప్రసంగం ఆద్యంతం కార్మికులకు భరోసాను కల్పిస్తూ.. ఉద్యమానికి మరింత ఊతమిస్తూ సాగింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ మీద లక్షలాదిమంది ఆధారపడి పని చేస్తున్నారని, లాభాలలో కొనసాగుతున్న స్టీల్ ప్లాంట్ ను దొంగ చాటుగా ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకునేందుకు 700 రోజులకు పైగా కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. 60వ దశకంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రజలు అనేక పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి, అప్పటి ప్రధానుల మెడలు వంచి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారని ఆయన తెలియజేశారు. దేశంలో పలు రాష్ట్రాల్లో సముద్ర తీర ప్రాంతాలు ఉన్నప్పటికీ, విశాఖపట్నంలో ప్లాంటును ఏర్పాటు చేస్తే ఇక్కడ ఉత్పత్తి అయ్యే స్టీల్ ప్రపంచంలోని వివిధ దేశాలకు సులభంగా రవాణా చేయొచ్చన్న ఉద్దేశంతోనే దేశంలోనే మొట్టమొదటి సముద్ర తీర ఉక్కు కర్మాగారాన్ని విశాఖలో ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయటానికి గత రెండు సంవత్సరాలుగా కేంద్రం ప్రయత్నిస్తోందని, దానిని అడ్డుకోవడానికి కార్మిక సంఘాలు ప్రజాసంఘాలు పోరాడుతున్న సమయంలో, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కార్మిక సంఘాల నాయకులు కలిసి సుదీర్ఘంగా చర్చించారని మంత్రి అమర్నాథ్ చెప్పారు. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డి కార్మికులకు మద్దతు తెలియజేశారని, ఇటీవల ప్రధాని మోదీ విశాఖపట్నం వచ్చినప్పుడు జరిగిన సభలో తమకు ప్రజాప్రయోజనాలు తప్ప మరే ప్రయోజనాలు లేవని స్పష్టం చేయడంతోపాటు, ప్రైవేటీకరణను నిలిపివేయాలని ప్రధానికి పలు సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి లేఖలు కూడా రాశారని అమర్నాథ్ తెలియజేశారు. స్టీల్ ప్లాంట్ కోసం వేలాది ఎకరాల భూమిని ఇక్కడ ప్రజలు వదులుకున్నారని, అనేకమంది నిర్వాసితులయ్యారని ఇప్పటికి వారికి ప్లాంట్ లో ఉద్యోగాలు లభించలేదని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కోవిడ్ సమయంలో ఆక్సిజన్ అందక అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, అటువంటి సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఆక్సిజన్ ని సరఫరా చేసి, 'ఉక్కు కాదు.. ఊపిరి' అని కూడా నిరూపించుకుందని అమర్నాథ్ చెప్పారు. ఇటువంటి స్టీల్ ప్లాంట్ ను విక్రయించాలన్న ఆలోచనకు వ్యతిరేకంగా ఏ సభలోనైనా ముఖ్యమంత్రి ప్రతినిధిగా గళమెత్తి మాట్లాడుతానని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఇంతకాలంగా చేస్తున్న ఉద్యమానికి ప్రభుత్వ మద్దతు ఉందన్న విషయాన్ని మంత్రి గుడివాడ అమర్నాథ్ గుర్తు చేశారు.