Vizianagaram Latest News: మట్టి బొమ్మలకు ప్రాణం పోస్తున్న వృద్ధులు- టెర్రకోట్ కళాకృతులతో మానసిక ఉల్లాసం
Vizianagaram Latest News: ఆ చేతులు వణుకుతూనే అద్భుతాలు సృష్టిస్తాయి. మట్టితో తమకున్న బంధాన్నే అపురూపంగా మార్చి, అందమైన కళాకృతులను చిటికెలో సిద్ధం చేస్తాయి.
Vizianagaram Latest News: అందరిదీ ఇంచుమించుగా ఒకటే వయసు, పిల్లాపాపలను చూసుకుంటూ, మనవళ్లకు కథలు చెప్పుకొంటూ హాయిగా విశ్రమిద్దామనీ వారికీ ఉంటుంది. కానీ, ఆ విధాత ఆడిన ఆటకు వారు అతీతులేం కాదు కదా! వీరిలో ఒక్కొక్కరిదీ.. ఒక్కో గాథ. కదిపితే కన్నీటి ధార. పంటి బిగువన బాధను దిగమింగుకునే.. ఒకరికి ఒకరుగా తోడుగా ఉంటున్నారు. వారిలోని ఆవేదనను దూరం చేసుకునేందుకే టెర్రకోట బొమ్మలు తయారు చేస్తున్నారు.
విజయనగరం పట్టణం బాబామెట్టలో ఏటీకే వెలుగు వృద్ధాశ్రమం ఉంది. తన తండ్రి ఆశయ సాధనలో భాగంగా డాక్టర్ ఎండీ ఖలీల్ బాబు దీన్ని ప్రారంభించారు. బిడ్డల ప్రేమకు దూరమైన తల్లిదండ్రులు.. కుటుంబాలను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిన వృద్ధులు.. అయినవారికి దూరమై, ఏ పనీ చేసుకోలేని అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్నారు.
ఎవరి వద్దా పైసా ఆశించకుండానే టెర్రకోట్ కుటీర పరిశ్రమ ద్వారా వచ్చిన డబ్బులతో కొంత సర్దుకుంటున్నారు. ఇది దక్షిణ భారత దేశంలో ప్రాముఖ్యం పొందిన తొలి కుటీర పరిశ్రమ. ఏటికే ఆధ్యాత్మిక, సామాజిక సేవా సంస్థ నిర్వహిస్తున్న ‘వెలుగు-అనాథ వృద్ధుల ఆశ్రమం’కు అనుబంధంగా టెర్రకోట‌్ కుటీర పరిశ్రమ ఏర్పాటు చేసింది. మొదట్లో ఆశ్రమానికి వచ్చిన అభాగ్యులంతా తమ దీనస్థితిని తలుచుకుంటూ ప్రతి రోజూ కుమిలిపోయేవారు. ఆ బాధను మరిచిపోయేందుకే ఈ టెర్రకోట్‌ను ఖలీల్‌బాబు నెలకొల్పారు.
ఇక్కడ 40 మంది వరకూ వృద్ధులు, నిర్భాగ్యులు ఉన్నారు. ప్రతి రోజూ తాము చేయగలిగినంత మట్టి పని చేస్తారు. అందమైన కళాకృతులను ఒద్దికగా తీర్చిదిద్దుతారు. ఎవరిపైనా ఒత్తిడి ఉండదు. వీరికి స్థానికంగా ఉన్న మహిళలు సాయం చేస్తారు. అంతా చేతి పనే. కాస్త కష్టమైన పనినే మగవారు చేస్తుంటారు. ఇక్కడ తయారయ్యే అందమైన వివిధ రకాల మట్టి పాత్రలను సందర్శకులు కొనుగోలు చేస్తూ ఉంటారు. టీ కప్పులు, నీటి బాటిళ్లు, కూజాలు, గ్లాసులు, వంట పాత్రలు, అందమైన మొక్కల కోసం కుండీలు, ప్లేట్లు, ఫ్లవర్ పాట్‌లు, గృహ అలంకరణ వస్తువులు అన్నీ టెర్రకోట్ మట్టితో తయారు చేసినవే.
ఇక్కడ తయారైన వస్తువులు రాష్ట్రంతోపాటు.. పొరుగు రాష్ట్రాలు, విదేశాలకు సైతం వెళ్తాయని నిర్వాహకులు చెబుతున్నారు. వీటి వల్ల వచ్చే ఆదాయాన్ని ఏటికే సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎండీ ఖలీల్ బాబు వృద్ధాశ్రమంతోపాటు అక్కడి పని చేసే మహిళల స్వయం ఉపాధికి, పర్యావరణ పరిరక్షణ వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. మట్టి పాత్రల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని తీర్చి దిద్దాలన్నదే తమ లక్ష్యమని డాక్టర్ ఖలీల్ బాబు చెబుతున్నారు.
ఎలా తయారవుతుంది..
మట్టి పాత్రల్లో టెర్రకోట్‌ది ప్రత్యేక స్థానం. కుమ్మరి చక్రంపై చేసే మట్టి పాత్రల కంటే మరింత మన్నిక, కళాకృతిని తెచ్చేలా తయారు చేసినవే టెర్రాకోట్ పాత్రలు. వీటి తయారీలో ఒక ప్రత్యేకత ఉంటుంది. శుద్ధి చేసిన బంకమట్టితో అవసరమైన ఆకారంలో మట్టి పాత్ర సిద్ధం చేస్తారు. తరువాత దానిని ఎండబెటి, అనంతరం ఒక బట్టీలో లేదా దహన పదార్థం పైన ఒక గొయ్యిలో ఉంచి, ఆపై కాల్చాలి. నిర్ణీత వేడిలో కాల్చితే ఎర్రటి రంగు వస్తుంది. మన పూర్వీకులు, నిన్న మొన్నటి తరాలు వరకు మట్టి పాత్రల్లోనే వంటలు వండుకునేవారు.
మట్టితో మేలెంతో..
సాధారణంగా మట్టిలో మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవన్నీ తినే ఆహారంలో చాలా తక్కువగా ఉంటాయి. కానీ మన శరీరానికి ఇవి చాలా అవసరం. ఇలా మట్టికుండల్లో వండిన ఆహారంలో ఐరన్, ఫాస్పరస్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. అందువల్ల మట్టిపాత్రల్లో వండితే ఇవి మనకు బాగా లభిస్తాయి. మట్టిలో ఉండే క్షార గుణం ఆరోగ్యానికి లాభం. మట్టి పాత్రలను తయారు చేసే మట్టిలో ఉండే క్షార గుణం వల్ల మానవ శరీరానికి అసిడిటీ సమస్య లేకుండా శరీరంలోని పీహెచ్ నిల్వలను సమతుల్యంగా ఉంచుతుంది. మట్టి నీళ్ల వల్ల గ్యాస్ట్రిక్ నొప్పులు రాకుండా కాపాడుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. మట్టి పాత్రల్లోని నీటిని తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడి టెస్టోస్టిరాన్ అధికంగా ఉత్పత్తవుతుంది. ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఫ్రిజ్‌లోని చల్లని నీటిని తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో బేధాలు ఏర్పడి వడదెబ్బ తగిలే అవకాశం ఉంది.
అందమైన జ్యువెలరీ సైతం..
ఇక్కడ కాదు.. ఒక ప్రత్యేకమైన మట్టిని ఉపయోగించి జ్యువెలరీ సైతం తయారు చేస్తారు. ముక్కుపుడకులు, చెవిదిద్దులు, జప మాలలు వంటివి వృద్ధుల చేతిలో తయారవుతున్నాయి. జప మాలలకు మంచి డిమాండ్ ఉంది. పూర్తిగా మటితోనే, చేతి పనితోనే వీటిని సిద్ధం చేస్తారు. స్థానికంగా చెరువులో దొరికే జిగటగా ఉన్న మట్టితోపాటు.. ఢల్లీ నుంచి కొంత మట్టి తెచ్చి కలిపి వీటిని తయారు చేస్తారు. ‘కుటుంబానికి దూరమైనా, ఈ ఆశ్రమమే మాకు అంతా అయ్యింది. పని చేయాలన్న బలవంతమేమీ లేదు. మా వీలు, శక్తిని బట్టి చేసుకోవచ్చు. మట్టితో పని చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తోంది. గత జీవితాన్ని మర్చిపోతున్నామ’ని వృద్ధులు సత్యవతి, తోలేటి వెంకట సర్వలక్ష్మి, బైరాగి పద్మావతి, జి.నర్సింగరావు చెబుతున్నారు.