TDP On Mlc Elections : ఇది కదా దేవుడి స్క్రిప్ట్, జగన్ కు ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయిపోయింది - గంటా శ్రీనివాసరావు
TDP On Mlc Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అనురాధ విజయం సాధించడంపై ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
TDP On Mlc Elections : టీడీపీ పడిలేచిన కెరటమని ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయంపై దేవుడు చక్కగా స్క్రిప్ట్ ఇచ్చాడన్నారు. 23 సంఖ్య తమకు కలిసివచ్చేటట్లు చేశాడన్నారు. హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకూ ఒకటే గాలి వీచిందన్నారు. టీడీపీకి ఆకర్షణ పెరిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సెమీఫైనల్స్ అని వైసీపీ వాళ్లే చెప్పారని, సెమీస్ లో ఓడిపోతే ఇక ఫైనల్స్ లో స్థానం ఉండదన్నారు. వైసీపీకి ఇది తీవ్రమైన ప్రతికూల ఫలితాలన్నారు. జగన్ కి ఇచ్చిన ఒక్క ఛాన్స్ అయ్యిపోయిందని స్పష్టమైన తీర్పుకు ఇది సంకేతమన్నారు. వైసీపీకి పతనానికి ఆరభం ఇది అన్నారు. ఎక్కడా సౌండ్ లేకుండా వైసీపీకి రౌండ్ పడిందన్నారు. అందుకే ఎమ్మెల్సీగా అనురాధను గెలిపించారన్నారు. సీనియర్ మినిస్టర్లను ఉపయోగించి మాక్ పోలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోయిందని విమర్శించారు. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రతో వరుసగా విజయాలే వస్తున్నాయన్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో సమావేశమైన టీడీపీ నేతలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంపై సంబరాలు చేసుకున్నారు.
నియంతలా పాలించారు
"108 నియోజకవర్గాల నుంచి గ్రాడ్యుయేట్ లు పెద్దెత్తున పాల్గొని టీడీపీని గెలిపించారు. ఆ పార్టీలో ఉన్న వారు కూడా నేడు టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. 23 తేదీన 23 మంది ఎమ్మెల్యేలతో టీడీపీ గెలవడం ఒక సందేశం. నియంతలా పాలించారు కాబట్టే జగన్ ను సాగనంపడానికి అందరూ చూస్తున్నారు."- పల్లా శ్రీనివాస్
ఇది కదా దేవుడి స్క్రిప్ట్ - లోకేశ్
ఎమ్మెల్సీగా విజయం సాధించిన విజయవాడ మాజీ మేయర్, చేనేత ఆడపడుచు పంచుమర్తి అనురాధకు హృదయపూర్వక శుభాకాంక్షలని ఎమ్మెల్సీ లోకేశ్ ట్వీట్ చేశారు. మేము 23 సీట్లే గెలిచామని ఎద్దేవా చేశారని, అందులో నలుగురిని సంతలో పశువుల్లా కొన్నారన్నారు. చివరికి అదే 23వ తేదీన, అదే 23 ఓట్లతో వైసీపీ ఓటమి-టీడీపీ గెలుపు సాధ్యమైందన్నారు. ఇది కదా దేవుడు స్క్రిప్ట్ అంటే జగన్ అని లోకేశ్ ట్వీట్ చేశారు.
టీడీపీ సంబరాలు
డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం గడియార స్తంభం సెంటర్ లో టీడీపీ నాయకుల సంబరాలు చేసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ 23 ఓట్లతో నెగ్గడంతో టీడీపీ నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి నినాదాలు చేశారు. జగన్ ప్రభుత్వ పతనానికి ఎమ్మెల్సీ ఎన్నికలు నాంది అని నియోజకవర్గ ఇన్చార్జ్ అయితాబత్తుల ఆనందరావు అన్నారు.
పెందుర్తిలో విజయోత్సవ సంబరాలు
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయంతో జీవీఎంసీ టీడీపీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెందుర్తి నాలుగు కూడలిలో సంబరాలు జరిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ మొన్న పట్టభద్రులు అందరూ జగన్ కు బుద్ధి చెప్పడంతో మూడు స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలుచుకుందని, ఈరోజు జగన్ పరిపాలనతో విసిగిపోయిన ఎమ్మెల్యేలు 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధను గెలిపించి వైసీపీకి బుద్ధి చెప్పారని తెలియజేశారు. రానున్న రోజుల్లో సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు మళ్లీ టీడీపీని అధికారంలోకి తీసుకువస్తారన్నారు.
పద్మశాలి వర్గానికి చెందిన @AnuradhaTdp ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో గ్రామాలతో సహా మంగళగిరి నియోజకవర్గం అంతటా చేనేత కార్మికులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. చేనేత వర్గానికి టిడిపి ఇచ్చిన గౌరవం అంటూ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు.#ByeByeJaganIn2024 pic.twitter.com/c9MVe2zCD3
— Telugu Desam Party (@JaiTDP) March 23, 2023