Bandaru Satyanarayana : సీఎం జగన్ భూ రక్షకుడు కాదు భక్షకుడు, మా భూమిపై మీ పెత్తనం ఏంటి? - బండారు సత్యనారాయణ
Bandaru Satyanarayana : సీఎం జగన్ భూ రక్షకుడు కాదని భక్షకుడని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శలు చేశారు.
Bandaru Satyanarayana : వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వేపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ విమర్శలు చేశారు. ఈ సర్వే పూర్తిగా ప్రజల్ని మోసం చేసేందుకే అని ఆరోపించారు. జగన్ భూ రక్షకుడు కాదు భక్షకుడని మండిపడ్డారు. జగనన్న శాశ్వత భూ హక్కు అంటున్నారు కానీ ప్రజల హక్కు అనడం లేదన్నారు. ఎలాంటి అవగాహన లేకుండా మా భూమి మీద, నీ పెత్తనం ఏంటిని విమర్శించారు. మీ భూమి మా కర్మ అన్నట్లు తయారైందన్నారు. అసలు మా భూమి పత్రాలపై జగన్ ఫొటో ఏంటి దీనిపై కోర్టును ఆశ్రయిస్తామన్నారు. భూములు మీద వచ్చిన సమస్యలే పరిష్కరించలేదన్నారు. భూ హక్కు పత్రాలపై జగన్ చిత్రం తొలగించాలని డిమాండ్ చేశారు.
మీ భూమి నా సొంతం
జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకం మీభూమి మా హామీ కన్నా మీ భూమి నా సొంతం అని పేరు పెడితే బాగుంటుందని టీడీపీ నేత పల్ల శ్రీనివాసరావు విమర్శించారు. ఎన్నికల సమయంలో రాళ్లకు పరదాలు కడతారా? అని ప్రశ్నించారు. విశాఖ భూ కుంభకోణంపై సిట్ కు సంబంధించిన అన్ని రికార్డులు తాడేపల్లి తీసుకువెళ్లారని, ఆ భూములు సొంతం చేసుకోవడానికి వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇనాం భూములు, అన్ సెటిల్డ్ విలేజెస్ విషయంలో ఏం చేస్తారని ప్రశ్నించారు. వక్స్ భూములు, ఎండోమెంట్ భూములు, మిషనరీ ఆస్తులు విషయంలో ఏం చేస్తారని నిలదీశారు. భూ సర్వే వల్ల ప్రజలకి ప్రయోజనం కన్నా , ఇబ్బందులే ఎక్కువవుతాయన్నారు.
సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు పెద్ద స్కామ్
జగన్ సీఎం అయినప్పటి నుంచి రాష్ట్రంలో రైతుల భూములకు భద్రత లేకుండా పోయిందని బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు. సీఎం జగన్ భూ దోపిడీకి తెర లేపారని విమర్శించారు. "మీ భూమి - మా హామీ"కు బదులు "మీ భూమి - నా భూమి" అని పెడితే బాగుండేదన్నారు. రిజిస్ట్రేషన్ చేయాలంటే వాలంటీర్ సంతకం పెట్టాలనడం సరికాదన్నారు. సర్వే అండ్ సెటిల్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పేరు పకడం కూడా సీఎం జగన్ రాలేదన్నారు. వైసీపీ ప్రభుత్వం రెవెన్యూ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారన్నారు. తాము చేసుకున్న ఖర్మ కొద్దీ జగన్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన రెవెన్యూ దరఖాస్తులు ఎందుకు పరిష్కారం కావట్లేదని ప్రశ్నించారు. స్పందనలో 90 శాతం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పడం అవాస్తవం అన్నారు.
సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో భూతగాదాతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నిజం కాదా అని బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. ముదపాక ల్యాండ్ పూలింగ్‌పై తనపై ఆరోపణలు చేశారని, అవి నిరూపిస్తే నా తల నరుక్కుంటానన్నారు. నా పాస్ బుక్‌పై ఓ అవినీతిపరుడి బొమ్మా ఎందుకన్నారు. ఆయనేమైనా మాకు భూమి ఇచ్చారా? ఆయన బొమ్మతో నా భూమిలో సర్వే రాయి పెట్టడం ఏంటని మండిపడ్డారు. పాస్ బుక్, సర్వే రాళ్లపై జగన్ బొమ్మలు తీయించకపోతే కోర్టుకు వెళ్తానన్నారు. వందేళ్ల సమస్యలు కాదని, ముందు వైసీపీ హయాంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. దొంగ రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. సర్వే రాళ్లపై సీఎం జగన్ బొమ్మలు ఓ పెద్ద స్కామ్ అని బండారు సత్యనారాయణ విమర్శించారు.