PM Modi Pawan Kalyan Meet : ప్రధాని మోదీ, పవన్ భేటీకి అంత ప్రాధాన్యత లేదు- ఓట్లు, సీట్లు లేని పార్టీలంటూ వైసీపీ ఎద్దేవా!
PM Modi Pawan Kalyan Meet : విశాఖలో ప్రధాని మోదీ, పవన్ కల్యాణ్ భేటీకి అంత ప్రాధాన్యత లేదని వైసీపీ నేతలు అంటున్నారు. బీజేపీ, జనసేన పొత్తులో ఉన్నారని అందులో భాగంగానే భేటీ అవుతున్నారన్నారు.
PM Modi Pawan Kalyan Meet : విశాఖలో ప్రధాని మోదీతో జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఏపీ రాజకీయాల్లో ఈ కీలక సమావేశంపై జోరుగా చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ నేతలు ఈ భేటీకి అంత ప్రాధాన్యత లేదన్నారు. ప్రధాని, పవన్ భేటీపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశాన్ని భూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. మోదీ, పవన్ భేటీపై తాము స్పందించాల్సిన అవసరం లేదన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు, కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం భూసేకరణపై విజయనగరం కలెక్టరేట్‌లో మంత్రి బొత్స సమీక్ష నిర్వహించారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఉన్న సమస్యలన్నీ కొలిక్కి వచ్చాయన్నారు. గిరిజన వర్సిటీకి భూసేకరణ సమస్యపై రైతులతో చర్చించాలన్నారు.
పవన్ సొంతంగా ఎదిగే ఆలోచన చేయాలి- మంత్రి అమర్నాథ్
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ప్రధానితో పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో రూట్ మ్యాప్, ఇరు పార్టీల పొత్తుతో పలు విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రధాని-పవన్ సమావేశానికి అంత ప్రాధాన్యత లేదంటోంది వైసీపీ. మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ... ప్రధానితో పవన్ భేటీ పెద్దగా చూడాల్సిన అవసరంలేదన్నారు. కొంతకాలంగా బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందన్నారు. అయినా ఏపీలో జనసేనకు, బీజేపీకి ఓట్లు, సీట్లు లేవని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ విశాఖ పర్యటన పుర్తిగా ప్రభుత్వ కార్యక్రమం అన్నారు. గవర్నర్, సీఎం జగన్ స్వాగతం పలుకుతారన్నారు. రాష్ట్రంలో రూ.15 వేల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. బీజేపీ రోడ్ మ్యాప్‌లోకి టీడీపీని ఎలా తీసుకెళ్లాలని పవన్ భావిస్తున్నారని మంత్రి అమర్నాథ్ విమర్శించారు. టీడీపీ, బీజేపీని కలిపేందుకు జనసేన ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీలు , స్ర్కిప్ట్ లపైనే పవన్ ఆధారపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా పవన్ కల్యాణ్ సొంతంగా ఎదగాలనే ఆలోచన చేయాలన్నారు. విశాఖ అభివృద్ధి చెందకూడదని చంద్రబాబు భావిస్తున్నారని మండిపడ్డారు.
కీలక భేటీ
రెండో రోజుల విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీతో శుక్రవారం రాత్రి పవన్ భేటీ కానున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ విశాఖ చేరుకున్నారు. రాత్రి 8.30 గంటలకు ప్రధాని మోదీతో భేటీ అవుతారు. తాజా రాజకీయా పరిస్థితులు, స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై వీరి మధ్య చర్చకు రానున్నట్లు సమాచారం. వైజాగ్ పర్యటనలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన వైఖరిని పవన్ మోదీ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందని సమాచారం.
పాచిపోయిన లడ్డు వ్యాఖ్యలు
ప్రధాని మోదీ పర్యటనలో ఏపీ విభజన హామీలు నెరవేరుతాయని భావిస్తున్నామని మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉందని, పొత్తు ఉన్న పార్టీ నాయకులు కలవడంలో ప్రాధాన్యత ఏముందన్నారు. ప్రధానితో పవన్ భేటీకి ఏ మాత్రం ప్రాధాన్యత లేదన్నారు. కేంద్రం ఏమిచ్చింది, పాచిపోయిన లడ్డు అన్న పవన్ కల్యాణ్ మాటలు జనం మర్చిపోలేదని కన్నబాబు అన్నారు. మూడేళ్లలో ఎన్నో సందర్భాల్లో సీఎం జగన్ ప్రధాని మోదీని నేరుగా కలిశారన్నారు.