(Source: ECI/ABP News/ABP Majha)
Andhra Pradesh: రాజకీయ అష్టదిగ్బంధనంలో వైఎస్ జగన్- వైసీపీ అధినేతకు ఊపిరి తీసుకోనివ్వని సవాళ్లు
Jagan: కూటమి వ్యూహాల్లో చిక్కుకోవడానికి అభిమాన్యుడిని కాదంటూ పదే పదే చెప్పే జగన్‌కు ఇది నిజంగానే టెస్టింగ్ టైం. వివిధ రూపాల్లో సమస్యలు వైసీపీ అధినేతను చుట్టుముడుతున్నాయి.
YS Jagan: ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు పర్సనల్ స్థాయికి వెళ్లిపోయాయి. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూస్తున్నారు ప్రతీ ఒక్కరూ. అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తన ప్రత్యర్థి చంద్రబాబును టార్గెట్ చేయడం కావాలనే ఆయన్ను జైల్లో పెట్టించడం వంటి పనులు చేశారని టిడిపి శ్రేణులు అంటుంటాయి. ఇప్పుడు ఆ వంతు టిడిపికి వచ్చింది. సీఎం చంద్రబాబు తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాల్లో ఉన్నారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. ఇందులో నిజం ఎంతో కానీ జగన్మోహన్ రెడ్డికి ఊపిరి సలపనివ్వకుండా ఒక ఇష్యుపై మరొకటి చేరుతోంది. ఇందులో ప్రధానమైన 8 అంశాలను ఓసారి చూద్దాం.
1) తిరుపతి కల్తీ లడ్డు వివాదం
ప్రస్తుతం రాష్ట్రాన్నే కాదు దేశాన్ని సైతం ఊపేస్తున్న అంశం జగన్ ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని. ముఖ్యంగా యానిమల్ ఫ్యాట్‌తో కూడిన నెయ్యిని తిరుమల లడ్డూల తయారీకి వాడారని సాక్షాత్తు సీఎం ఆరోపించారు. తర్వాత ఆధారాలను టిడిపి బయట పెట్టింది. దీనిపై జగన్ స్పందించి అసలు తిరుమల లడ్డూలో కల్తీ జరిగే ఆస్కారమే లేదని అన్నారు. కావాలనే కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారంటూ ప్రధానికే ఫిర్యాదు చేశారు.
ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా దేశవ్యాప్తంగా కల్తీ లడ్డూల వ్యవహారం వైరల్ అయింది. కొన్నిచోట్ల అయితే జగన్ చిత్రపటాలను కాల్చి మరీ నిరసనలు చేశాయి హిందూ సంఘాలు. ఎంత కాదన్నా ఇది జగన్ ప్రతిష్టకు ఇబ్బంది కలిగించేదే. దీనిలో నిజానిజాలు ఎప్పటికి బయట పడతాయో చూడాలి.
2) కాదంబరి జత్వాని కేసు - ముగ్గురు IPSల సస్పెన్షన్
కల్తీ లడ్డూల వివాదం కంటే ముందు బాగా రచ్చైన ఇష్యూ ముంబై మోడల్ కాదంబరి జత్వాని వేధింపుల వ్యవహారం. సన్నిహితుడైన ఒక వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చేందుకు కొందరు ఐపీఎస్‌లతో ముంబై మోడల్ కాదంబరిపై తప్పుడు కేసులు నమోదు చేశారని.. దీని వెనుక వైసిపి కీలక నేతలు ఉన్నారనేది ఆరోపణ. ఏకంగా ఆ మోడల్, పేరెంట్స్‌ను ముంబై వెళ్ళి మరీ ఏపీకి తీసుకువచ్చి ముగ్గురు ఐపీఎస్ అధికారులు హింసించారని కేసు రిజిస్టర్ అయింది.
తప్పుడు కేసులతో ఆమెను జైలుకు పంపించారని అంతా ఒక పథకం ప్రకారం జరిగిందని ప్రభుత్వం అంటోంది. ఏపీ సర్కార్ ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని తిరుగతోడడంతో పాటు ఆ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. వైసిపి నేత కుక్కల విద్యాసాగర్‌ను అరెస్టు చేసింది. ఈ వ్యవహారం సజ్జల మెడకు చుట్టుకునే అవకాశం ఉందంటూ కథనాలు వైరల్ అయ్యాయి. ఇది ఓ ప్లాంటెడ్ స్టోరీగా జగన్మోహన్ రెడ్డి చెబుతున్నా సామాన్య జనంలో మాత్రం జత్వాన్ని కేసులో గత ప్రభుత్వం ఏదో తప్పు చేసింది అనే అభిప్రాయం అయితే ఉంది.
3) ప్రకాశం బ్యారేజ్ కూల్చేసే కుట్ర ఆరోపణ
ఏపీ ప్రభుత్వం, టిడిపి నేతలు వరదల సమయంలో జగన్ పై పదేపదే చేసిన ఆరోపణ వైసీపీకి చెందిన కొందరు వ్యక్తులు కొన్ని పడవలను ఒకదానికొకటి కట్టివేసి ప్రకాశం బ్యారేజ్‌లో ఇరుక్కునేలా చేసి బ్యారేజ్‌ని కూల్చేయాలని అనుకున్నారని గట్టిగా ప్రచారం చేశారు. మొదట్లో ఇది ఒక ప్రమాదమే అని అందరూ భావించిన వైసిపి దీనిపై చాలా ఆలస్యంగా స్పందించడం జనాల్లో అనవసర అనుమానాలు రేకెత్తించింది. ఇప్పటికీ ఈ ఆరోపణ వెనుక వాస్తవాలు ఏంటన్నది బయటికి రాలేదు.
4) అమరావతి కి జనామోదం
నిజానికి 2014-19 మధ్యకాలంలో సీఎం గా చంద్రబాబు అమరావతికి రూపకల్పన చేసినప్పుడు అందరి నుంచి ఏకాభిప్రాయం రాలేదు. కానీ జగన్ హయాంలో మూడు రాజధానుల పేరుతో జరిగిన ప్రహసనం చాలామందిలో చిరాకు కలిగించింది. ఏకంగా పదేళ్లపాటు రాజధానిలేని రాష్ట్రంగా ఏపీ మిగిలి పోయిందని ఫీలింగ్ బలంగా వెళ్లిపోయింది. దీనితో విసుగు చెందిన అధిక భాగం ప్రజలు అమరావతి వైపే మొగ్గు చూపారు. దానికి తోడు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు చేసిన ఉద్యమానికి కూడా మిగిలిన ప్రాంతాల నుంచి సపోర్ట్ లభించింది. ప్రస్తుత ప్రభుత్వం అమరావతే రాజధాని అని డిక్లేర్ చేస్తే గతంలో లేనంతగా దానికి ప్రజామోదం లభించింది. ఇది జగన్ మూడు రాజధానుల కలకు చెక్ మేట్ పెట్టేసినట్టే.
5) కేంద్రంలో పలుకుబడి
జగన్ తన హయాంలో ఎన్డీఏలో చేరకపోయినా కేంద్రం వద్ద పలుకుబడి బానే ఉండేది. పరోక్షంగా మోడీ, అమిత్ షా మద్దతు గట్టిగానే లభించేది. అయితే ఎన్నికల తర్వాత ఏకంగా కేంద్ర ప్రభుత్వమే చంద్రబాబు, నితీష్ కుమార్‌పై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ప్రధాని మోడీ కేవలం జగన్ కోసం చంద్రబాబునో ముఖ్యంగా పవన్‌నో దూరం చేసుకునే అవకాశం లేదు. ఇది కచ్చితంగా జగన్‌కు ఇబ్బంది కలిగించే అంశమే.
6) కీలక నేతల అరెస్ట్ లు
జగన్‌కు అత్యంత సన్నిహితులుగా పేరున్న నేతలు అరెస్ట్ అవుతున్నారు. ఈవీఎంలు పగలగొట్టిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టై బెయిల్ పై బయటికి రాగా టిడిపి ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు అయ్యారు. ఇదే కేసులో తలశిల రఘురాం, దేవినేని అవినాష్ అలాగే చంద్రబాబు ఇంటి పై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ఇప్పుడు న్యాయ పరమైన చిక్కులు ఎదుర్కొంటున్నారు. మునుముందు మరెంతమంది ఆయా కేసుల్లో అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఇవన్నీ పార్టీ అధినేతగా జగన్ ను ఇరుకునుపెట్టే విషయాలే
7) పార్టీ నుంచి జంపింగ్‌లు
ఇటీవల కాలంలో వైసిపి నుంచి ఇతర పార్టీల వైపు జంప్ చేస్తున్న నేతల లిస్ట్ పెరిగిపోతుంది. ఎన్నికలు అయిన తర్వాత రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీ పోతుల సునీత వైసిపికి రాజీనామా చేశారు. వీరిలో మోపిదేవి వెంకటరమణ జగన్‌కు అత్యంత సన్నిహితుడు. తాజాగా జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, సీనియర్ నేత సామినేని ఉదయభాను పార్టీకి రాజీనామా చేసి జనసేనలో చేరుతామని ప్రకటించారు. అదే దారిలో మరి కొంతమంది ఉన్నట్టు సమాచారం.
వైసిపిలో జగన్ చుట్టూ ఒక కోటరీ ఏర్పడిందని దానివల్లే తాము ఇబ్బందులు పడ్డామని పార్టీ మారుతున్న నేతలు చేస్తున్న ప్రధాన ఆరోపణ. జగన్ వాటిని పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. వెళ్లేవాళ్లను వెళ్ళనీ అన్నట్లే ఆయన మాట్లాడుతున్నారు. దానితో పార్టీలో ఏం జరుగుతుందో తెలియక సామాన్య కార్యకర్తల్లో అయోమయం నెలకొని ఉంది.
8) కేసుల విచారణ వేగవంతం
ప్రస్తుతం జగన్ ముందు ఉన్న అతిపెద్ద సమస్య ఆయనపై నమోదైన అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతమయ్యే అవకాశం ఉండడం. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లు సీఎంగా తన బాధ్యతలకు ఆటంకం కలుగుతుందంటూ కోర్టుకు హాజరు కాకుండా గడిపేసారు. కానీ ఇప్పుడు తను ఓడిపోవడం గతంలోలా పైవాళ్ళ అండదండలు ప్రస్తుతానికి అందే సూచనలు కనిపించకపోవడం ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులు తప్పవనే సంకేతాలు అందుతున్నాయి.
అర్జునుడిలా గెలుస్తాడా.. లేక అభిమన్యుడిలా మిగిలిపోతాడా?
ఎన్నికల ప్రచారంలో జగన్ పదే పదే చెప్పిన మాట"కూటమి వ్యూహాల్లో చిక్కుకుపోవడానికి తాను అభిమన్యుడు కాదు.. అర్జునుడిని " అని. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మరి ఇప్పుడు ఎదురవుతున్న చిక్కు ముళ్లను జగన్ ఎలా ఛేదిస్తారో చూడాలి.