Vijayawada News: విజయవాడ కనకదుర్గ భక్తులకు గుడ్ న్యూస్, బస్సుల్లో ఉచిత ప్రయాణం!
Vijayawada News: విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు దేవస్థానం అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి బస్టాండు, రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది.
Vijayawada News: విజయవాడ కనక దుర్గమ్మ భక్తులకు అక్కడి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. ఇంద్రకీలాద్రిపైకి వెళ్లే భక్తుల కోసం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆలయ అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేసి దేవాదాయ శాఖ మంత్రి, కమిషనర్ కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే బస్టాండు, రైల్వే స్టేషన్, దుర్గా ఘాట్ నుంచి కొండపైకి దేవస్థానం ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఈ బస్సుల్లో భక్తులకు నామమాత్రపు ఛార్జీనే వసూలు చేస్తున్నారు. ఇకపై దానిని కూడా రద్దు చేయాలని దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. విజయవాడలో దుర్గమ్మ భక్తుల కోసం మొత్తం తొమ్మిది బస్సులు ఉండగా.. ఇందులో నాలుగు బస్సులను రోజూ విజయవాడ రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి దుర్గగుడికి నడుపుతున్నారు. మరో మూడు బస్సులను కొండ దిగువన ఉన్న దుర్గాఘాట్ నుంచి కొండపైకి నడుస్తున్నాయి. మరో రెండు బస్సులను పండుగలు, పర్వ దినాలు, రద్దీ సమయాల్లో మాత్రమే వాడుతుంటారు.
ఈ బస్సులు రోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి దుర్గగుడికి రాకపోకలు సాగిస్తుంటాయి. సాధారణ రోజుల్లో అయితే 16 సార్లు, పండుగలు, రద్దీ సమయాల్లో అయితే రోజుకి 20 సార్లు బస్సులను తిప్పుతుంటారు. బస్టాండు, రైల్వే స్టేషన్ నుంచి కొండపైకి వెళ్లేందుకు కేవలం 10 రూపాయలు మాత్రమే వసూలు చేస్తారు. నిత్యం 30 వేల నుంచి 40 వేల మంది, శుక్ర, ఆది వారాల్లో 50 వేల నుంచి 60 వేల మంది అమ్మవారి దర్శనానికి కొండపైకి వెళ్తారు. వీరిలో సాధారణ రోజుల్లో 4 వేల నుంచి 5 వేల మంది, శుక్ర, ఆది వారాలతో పాటు ప్రత్యేక రోజుల్లో 7 వేల నుంచి 10 వేల మంది దేవస్థఆనం బస్సుల్లో ఇంద్రకీలాద్రిపైకి వెళ్తారు. తద్వారా దేవస్థానానికి ఏడాదికి సుమారు రూ.4 కోట్ల మేర ఆదాయం వస్తుంది. ఇంధనం, మరమ్మతులు, జీతాలు, ఇతర ఖర్చులు మినహాయించి కోటి రూపాయల మేర ఆదాయం వస్తుంది. అయితే తాజాగా అన్ని బస్సుల్లోనూ ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. ఇది అమల్లోకి వస్తే భక్తులకు ఉపశమనం కల్గుతుందని పేర్కొన్నారు.
దుర్గమ్మ ఆళయాని ట్రస్ట్ బోర్డు నియామకం..
బెజవాడ దుర్గమ్మ ఆలయానికి వారం రోజుల క్రితమేఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్రస్ట్ బోర్డ్‌ను నియమించింది. ఈ మేరకు పదిహేను మంది కమిటి సభ్యులను నియమిస్తూ జీవోను జారీ చేసింది. బెజవాడ దుర్గమ్మ ఆలయానికి నూతన ట్రస్ట్ బోర్డ్ ను నియామకం జరిగింది. కమిటి నియమిస్తూ ప్రభుత్వం 111 జీవోను విడుదల చేసింది. బోర్డ్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి రెండు సంవత్సరాలపాటు పదవిలో ఉంటారని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. మొత్తం పదిహేను మంది సభ్యులతో దేవస్థానం ప్రధాన అర్చకుడిగా ఉన్న వ్యక్తి ఎక్స్ అఫీషియో సభ్యుడిగా కూడా కమిటిలో ఉంటారని జీవోలో ప్రభుత్వం వెల్లడించింది. గత దసరా ఉత్సవాలకు ముందు ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ పదవి కాలం ముగింది. అయితే అప్పటి నుంచి నూతన కమిటి నియామకం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల మేరకు అధికార పార్టీకి చెందిన నాయకుల్లో ఉత్సాహం నెలకొంది.